దూకుడుగా వెళ్లిన వెలగపూడి ఎందుకు వెనక్కి తగ్గారు…?

ముగ్గురు ఎమ్మెల్యేలు..30 మంది కార్పొరేటర్ల బలం ఉంది. సమర్ధత ఉన్నా.. అధికారపార్టీని ఢీకొట్టడానికి సాహసించే పరిస్థితి లేదు. అనుబంధ సంఘాల పోరాటాలే తప్ప ముఖ్య నాయకులు గప్‌చుప్‌. కష్టకాలంలో పార్టీని నడిపించాల్సిన ఆ ఎమ్మెల్యేలు సైలెంట్ అయ్యారా? సైడ్ అయ్యారా? ఎవరు వాళ్లు?

విశాఖ టీడీపీ ప్రజాప్రతినిధుల్లో నైరాశ్యం..!

ఉత్తరాంధ్రలో గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి కోలుకోలేని దెబ్బతగిలింది. హేమాహేమీలకే ఓటమి తప్పలేదు. ఇటువంటి పరిస్ధితుల్లోనూ టీడీపీకి గౌరవం కట్టబెట్టారు విశాఖ ఓటర్లు. హోరాహోరీ పోరులో నాలుగుచోట్ల టీడీపీ గెలిచింది. వైసీపీ అధికారం చేపట్టాక నిర్వహించిన గ్రేటర్‌ విశాఖ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లోనూ టీడీపీకి ఊహించిన దానికంటే ఎక్కువ ఫలితాలే వచ్చాయి. 98 డివిజన్లకుగాను 30చోట్ల టీడీపీ కార్పొరేటర్లు గెలిచారు. కార్పొరేషన్‌లో ఢీ అంటే ఢీ అనే సమర్ధత ఉండి కూడా నిరాశలో కూరుకుపోయింది టీడీపీ. వైసీపీ పవర్‌లోకి వచ్చాక ఇక్కడ కొంత కాలం టీడీపీ హడావిడి చేసింది. ఆ దూకుడు ఎక్కువ కాలం నిలవ లేదు. పార్టీ అర్బన్ అధ్యక్షుడిగా పనిచేసిన ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ రాత్రికి రాత్రి పార్టీ ఫిరాయించి వైసీపీ పంచన చేరారు.

దూకుడుగా వెళ్లిన వెలగపూడి వెనక్కి తగ్గారు..!

విశాఖ ఉత్తర నియోజకవర్గం శాసనసభ్యుడు, మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ రోడ్డెక్కిన సందర్భాలు లేవు. ఇక మిగిలింది ఇద్దరు ఎమ్మెల్యేలు. వీరిలో విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు.. పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు. వీరి నాయకత్వం కష్టకాలంలో పార్టీకి కలిసి రావడం లేదనే అభిప్రాయం శ్రేణుల్లో బలంగా ఉందట. గణబాబుది దూకుడు స్వభావం కాదు. వెలగపూడి మొదట్లో వైసీపీతో గట్టిగానే ఫైట్ చేసినట్టు కనిపించారు. లిక్కర్ సిండికేట్లు, భూముల అంశాలను ప్రభుత్వం తెరపైకి తీసుకురావడంతో వెలగపూడి వెనక్కి తగ్గారు. రాజకీయంగా తన కంటే తన అనుచరులపై పెరుగుతున్న ఒత్తిళ్లు ఎమ్మెల్యేను పునరాలోచలో పడేశాయట.

టీడీపీ కార్పొరేటర్లు పక్క చూపులు చూస్తున్నారా?

టీడీపీ నుంచి 30 మంది కార్పొరేటర్లు గెలిస్తే.. వారిలో ఇద్దరు వైసీపీకి జై కొట్టారు. ఇక మిగిలిన టీడీపీ కార్పొరేటర్లకు అభివృద్ధిలో సరైన ప్రాధాన్యం దక్కక అసంతృప్తితో ఉన్నారట. రాజకీయ అవసరాలతో కొందరు అధికారపార్టీ వైపు చూస్తున్నట్టు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న హైకమాండ్‌ పార్టీ కార్పొరేటర్లను అధినాయకుడి దగ్గరకు పిలిపించుకుంది. గెలిచిన తర్వాత చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసేందుకు కార్పొరేటర్లు మూకుమ్మడిగా వెళ్లారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఐతే, లోగుట్టు మాత్రం పార్టీ ఫిరాయింపులను అడ్డుకోవడానికి చేసిన ప్రయత్నంగానే కనిపిస్తోంది.

అనుబంధ సంఘాలే టీడీపీ పిలుపునకు స్పందిస్తున్నాయా?

ప్రస్తుతం పార్టీ కార్యకలాపాల బాధ్యత పూర్తిగా అనుబంధ సంఘాలపై పడింది. ఈసారి ఉత్తరాంధ్రకు టీడీపీలో మూడు కీలక పదవులు లభించాయి. టీడీపీ ఏపీ అధ్యక్షుడుగా అచ్చెన్నాయుడు, టీడీపీ మహిళా అధ్యక్షురాలిగా వంగలపూడి అనిత.. విద్యార్ధి విభాగం TNSF అధ్యక్షుడిగా ప్రణవ్ గోపాల్ పనిచేస్తున్నారు. పార్టీ ఇచ్చే పిలుపు మేరకు రోడ్డెక్కి ఆందోళనలు చేయడంలో అనుబంధ సంఘాలు దూకుడు ప్రదర్శిస్తున్నాయి. ఇదే సమయంలో వెన్నుదన్నుగా నిలవాల్సిన ఎమ్మెల్యేలు సైలెంట్ అవ్వడం ఇబ్బందికరంగా మారిందట. మహిళలు, యువ నాయకులను అరెస్ట్ చేసినప్పుడు కనీసం నైతిక మద్దతు కూడా లభించడం లేదట. వంగలపూడి అనిత మీద వివిధచోట్ల 8 కేసులు ఉన్నాయి. ప్రభుత్వాన్ని ఎదుర్కోవడంలో పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలు, కార్పొరేటర్ల మద్దతు లభించక.. కేసులు, పార్టీ కార్యకలాపాల బాధ్యత అంతా వారిపైనే పడుతోందట. ఇలా ఎంత కాలం సాధ్యమన్నది వారి ప్రశ్న. రానున్న రోజుల్లో పార్టీ వైఖరి ఇలాగే ఉంటే.. ఇప్పుడు ఉన్నవాళ్లు కూడా గుడ్‌బై చెప్పడం ఖాయమని టీడీపీ శిబిరంలో చెవులు కొరుక్కుంటున్నారు.

-Advertisement-దూకుడుగా వెళ్లిన వెలగపూడి ఎందుకు వెనక్కి తగ్గారు...?

Related Articles

Latest Articles