ఆసక్తిగా మారిన వైరా టీఆర్‌ఎస్‌ రాజకీయం !

రాజకీయాల్లో ఎవరు ఎప్పుడు శత్రువులుగా మారతారో చెప్పలేం. ఆ నియోజకవర్గంలో కూడా అంతే. నిన్న మొన్నటి వరకు దోస్త్‌ మేరా దోస్త్‌ అనుకున్నవారు నేడు ముఖం చిట్లించే పరిస్థితి. కొత్త మిత్రుడు దొరకడంతో పాత ఫ్రెండ్‌కు గుడ్‌బై చెప్పేశారట. అదే ఇప్పుడు అధికారపార్టీలో హాట్‌ టాపిక్‌. వారెవరో ఈ స్టోరీలో చూద్దాం.

మాజీ ఎంపీ అనుచరుడిగా ఎమ్మెల్యేపై ముద్ర!

ఖమ్మం జిల్లా వైరా. 2018 ఎన్నికల్లో ఇక్కడి ఫలితం ఓ సంచలనం. కాంగ్రెస్‌ తిరుగుబాటు అభ్యర్థిగా బరిలో దిగి.. గెలిచి.. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయకుండానే గులాబీ కండువా కప్పుకొన్నారు రాములు నాయక్‌. నాటి అసెంబ్లీ ఎన్నికల్లో రాములు నాయక్‌కు పూర్తిస్థాయిలో సహకరించారు అప్పటి టీఆర్ఎస్‌ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి. వైరాలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి మద్దతివ్వకుండా రాములో రాములా అంటూ సాయం పట్టారాయన. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత రాములు నాయక్‌ను వెంటబెట్టుకుని పార్టీ పెద్దల దగ్గరకు తీసుకెళ్లి టీఆర్‌ఎస్‌ కండువా కప్పించారు. అప్పటి నుంచి శ్రీనివాస్‌రెడ్డి.. ఎమ్మెల్యే రాములు నాయక్‌ మధ్య బలమైన బంధం ఏర్పడింది.

read also : సమాజానికి కార్టూనిస్టుల సేవలు అవసరం: అల్లం నారాయణ

మాజీ ఎంపీతో ఎమ్మెల్యేకు చెడిందా?

శ్రీనివాసరెడ్డి ఎంత చెబితే రాములు నాయక్‌కు అంత అన్నది వైరాలో ఓపెన్‌ సీక్రెట్‌. మాజీ ఎంపీని కాదని ఏ పనీ చేయరని కేడర్‌ చెవులు కొరుక్కుంటారు. వైరా నియోజకవర్గంలో ఐదు మండలాలు ఉన్నాయి. అన్నిచోట్లా శ్రీనివాసరెడ్డి చెప్పిన వారికే పార్టీ పదవులు అప్పగించారట. ఈ స్థాయిలో ఉన్న వీరి బంధానికి ఇటీవల తూట్లు పడ్డాయట. అదే ఇప్పుడు వైరాలో హాట్ టాపిక్‌. శ్రీనివాసరెడ్డికి టీఆర్‌ఎస్‌లో ప్రత్యర్థి వర్గంగా ఉన్న నేతతో చేతులు కలిపారట రాములు నాయక్‌. వైరా, ఏన్కూరు, జూలూరుపాడు, కొణిజర్ల, కారేపల్లి మండల కమిటీలను ఎమ్మెల్యే రద్దు చేశారు. కొత్త కమిటీని ప్రకటించారు. శ్రీనివాసరెడ్డితో చెడింది అనడానికి ఈ మార్పులనే ప్రామాణికంగా చెబుతున్నారట.

పదవిలో ఉన్న కొత్త నేతతో ఎమ్మెల్యే దోస్తీ!

ఇన్నాళ్లూ మండల కమిటీలకు శ్రీనివాస్‌రెడ్డి చెప్పిన వారు సారథులుగా ఉన్నారు. వారి ప్లేసుల్లో వచ్చిన కొత్తవారంతా మరో నేత అనుచరులట. జిల్లాకు చెందిన మరో టీఆర్‌ఎస్‌ నేతతో చేతులు కలిపి.. శ్రీనివాస్‌రెడ్డికి చెక్‌ చెప్పారని రాములు నాయక్‌ తీరుపై చర్చ జరుగుతోంది. మాజీ ఎంపీ అనుచరుడిగా ఇన్నాళ్లూ తనపై ఉన్న ముద్రగా చెరిపేసుకోవాలని అనుకున్నారో.. లేక కొత్త నేత సహకారంతో మరింత ఎదగాలని భావించారో ఏమో ఎమ్మెల్యే తీసుకున్న నిర్ణయం పార్టీ వర్గాలను ఆశ్చర్య పరిచింది. పార్టీలో ప్రాధాన్యం తగ్గిన నేతకంటే.. పదవిలో ఉన్నవారి పంచన చేరితే మంచిదని లెక్కలేసుకున్నట్టు ఎమ్మెల్యే గురించి చెవులు కొరుక్కుంటున్నారు. దీంతో రాబోయే రోజుల్లో వైరా టీఆర్‌ఎస్‌లో జరిగే పరిణామాలపై ఉత్కంఠగా చర్చించుకుంటోంది పార్టీ కేడర్‌. మరి ఏం జరుగుతుందో చూడాలి.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-