ఎమ్మెల్యే పదవిపై మనసు పారేసుకున్న టీఆర్ఎస్ ఎంపీ !

ఆయనో అధికారపార్టీ ఎంపీ. లోక్‌సభ సభ్యుడిగా ఉండి బోర్‌ కొట్టిందో ఏమో కొత్తగా ఆలోచిస్తున్నారట. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని గ్రౌండ్‌ ప్రిపేర్‌ చేసుకుంటున్నారు. పార్టీ కూడా ఫ్రీ హ్యాండ్‌ ఇచ్చినట్టు టాక్‌. సమయం చిక్కితే ఆ నియోజకవర్గంలో వాలిపోతున్నారట. ‘హలో.. బాగున్నారా?’ అని కనిపించినవారందరినీ కుశల ప్రశ్నలు వేస్తున్నారు. ఇంతకీ ఎవరా ఎంపీ? ఏంటా నియోజకవర్గం?

వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే కావాలనే పట్టుదలతో ఉన్నారా?

కొత్త ప్రభాకర్‌రెడ్డి. మెదక్‌ టీఆర్‌ఎస్‌ ఎంపీ. 2014లో మెదక్‌ ఎంపీతోపాటు గజ్వేల్‌ ఎమ్మెల్యేగా గెలిచిన సీఎం కేసీఆర్‌.. లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆ తర్వాత వచ్చిన ఉపఎన్నికలో ప్రభాకర్‌రెడ్డి పోటీచేసి తొలిసారి లోక్‌సభలో అడుగుపెట్టారు. 2019 ఎన్నికల్లోనూ ఎంపీగా గెలిచారాయన. రాజకీయాల్లోకి రాకమునుపు వ్యాపారాలలో బిజీగా ఉండే ప్రభాకర్‌రెడ్డి.. ప్రజాప్రతినిధి అయ్యాక పూర్తిస్థాయిలో పాలిటిక్స్‌పై ఫోకస్‌ పెట్టారు. వాస్తవానికి ప్రభాకర్‌రెడ్డికి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని కోరిక ఉండేదట. 2014, 2018 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ముందు అదే ప్రతిపాదన పెట్టినట్టు చెబుతారు. సమీకరణాలు సెట్‌ కాక.. ఎంపీ అయ్యారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం తప్పకుండా ఎమ్మెల్యే కావాలనే పట్టుదలతో ఉన్నారట. అదే ఇప్పుడు పార్టీవర్గాల్లో చర్చగా మారింది.

read also : ఏపీ విద్యార్థులకు శుభవార్త

దుబ్బాక నుంచి ఎమ్మెల్యేగా పోటీకి గ్రౌండ్‌ ప్రిపేర్‌ చేసుకుంటున్నారా?

కొత్త ప్రభాకర్‌రెడ్డి సొంతూరు దుబ్బాక నియోజకవర్గంలోని పోతారం గ్రామం. దుబ్బాక నుంచే అసెంబ్లీకి పోటీ చేద్దామని అనుకున్నారట. అయితే టీఆర్‌ఎస్‌ ఆవిర్భావం నుంచి ఉన్న సోలిపేట రామలింగారెడ్డిని కాదని టికెట్‌ ఇవ్వడానికి పార్టీ ఒప్పుకోలేదని సమాచారం. రామలింగారెడ్డి చనిపోయాక.. జరిగిన ఉపఎన్నికలో దుబ్బాక బీజేపీ ఖాతాలో పడింది. మారిన పరిణామాల తర్వాత దుబ్బాకలో పరిస్థితులను అనుకూలంగా మలుచుకునే పనిలో ఉన్నారట ప్రభాకర్‌రెడ్డి. వచ్చే ఎన్నికల్లో దుబ్బాక నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలని.. ఆ నియోజకవర్గంపై ఎక్కువగా గురిపెడుతున్నారట.

ఎక్కువ సమయం దుబ్బాకలో ఉంటున్నారట!

దుబ్బాకలో బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావును ఢీకొట్టాలంటే మరో ప్రొటోకాల్‌ నేత కావాలి. కొత్త ప్రభాకర్‌రెడ్డి ఎంపీ కావడంతో అక్కడ లెక్కలు ఈక్వల్‌ అవుతాయని భావిస్తున్నారట పార్టీ నేతలు. ఆ మేరకు పార్టీ నుంచి సంకేతాలు అందడంతో ఎక్కువ సమయం దుబ్బాకలోనే ఉంటున్నారట ప్రభాకర్‌రెడ్డి. గతంలో హైదరాబాద్‌ ఉంటూ.. మెదక్‌ లోక్‌సభ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో పర్యటనలు చేసేవారు. ఇప్పుడంతా మారిపోయింది. ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలేవైనా దుబ్బాకలోనే మొదలు పెడుతున్నారు. సొంత ఊళ్లోనే ఉంటూ నియోజకవర్గం మొత్తం చుట్టి వస్తున్నారు. కనిపించిన వాళ్లందరినీ కుశల ప్రశ్నలు వేస్తూ .. అధికారులతో రివ్యూ మీటింగ్‌లు, ప్రభుత్వ పథకాలు నేరుగా లబ్ధిదారులకు ఇస్తున్నారట.

దుబ్బాక బస్టాండ్‌కు రూ.4కోట్లు కేటాయించేలా చొరవ!

దుబ్బాక బస్టాండ్‌ నిర్మాణానికి గతంలో కేటాయించిన నిధులు సరిపోవని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి 4 కోట్లు కేటాయించేలా చొరవ తీసుకున్నారని కొత్త ప్రభాకర్‌రెడ్డి అనుచరులు ప్రచారం మొదలుపెట్టారు. బస్టాండ్‌ నమూనా రిలీజ్‌చేసి స్పీడ్‌ పెంచారు. గతంలో గజ్వేల్‌లో పర్యటించడానికి ఎంపీ ఎక్కువ ఆసక్తి చూపించేవారు. సీఎం నియోజకవర్గం కాబట్టి ఇంఛార్జ్‌గా బాధ్యతలు తీసుకున్నానని అందరికీ చెప్పేవారాయన. కానీ.. ఇప్పుడు సమయం చిక్కితే దుబ్బాకలో వాలిపోతున్నారు

‘కొత్త’ ఆలోచనతో సరికొత్త ఎత్తుగడ!

మొత్తానికి ఎంపీ కొత్త ఆలోచనలతో ముందుకెళ్తున్నారు. నిత్యం ప్రజల్లోనే ఉంటున్నారు. ఎంపీలో వచ్చిన ఈ మార్పు చూసి.. జనం కూడా ఈయన మన కొత్త ప్రభాకర్‌రెడ్డేనా అని ఆశ్చర్యపడుతున్న పరిస్థితి ఉందట. మరి.. కొత్త ఎత్తుగడ వచ్చే ఎన్నికల్లో ఆయనకు ఏ మేరకు వర్కవుట్‌ అవుతుందో చూడాలి.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-