ఎమ్మెల్సీ పదవి అంటే ఎందుకు అంత హడల్…?

MLC పదవి పేరు చెబితే ఆ జిల్లాలో ఎమ్మెల్యేలు ఉలిక్కి పడుతున్నారా? తమ నియోజకవర్గాల్లో ఎవరికీ ఆ పదవి ఇవ్వొద్దని ఓ రేంజ్‌లో మంతనాలు సాగిస్తున్నారా? ఎమ్మెల్సీ పదవంటే ఎందుకు హడలిపోతున్నారు? ఏంటా జిల్లా?

తమ నియోజకవర్గానికి ఎమ్మెల్సీ పదవి రాకుండా ఎమ్మెల్యేల ఎత్తుగడ..!

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలు పది. అన్నిచోట్లా ప్రస్తుతం ఒక్కటే చర్చ. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి జరగబోయే ఎన్నిక గురించే హాట్‌ హాట్‌గా చర్చలు నడుస్తున్నాయి. స్థానిక సంస్థల్లో టీఆర్ఎస్‌కే బలం ఉండటంతో.. ఆ పార్టీ అభ్యర్థికి గెలుపు నల్లేరుపై నడకే. అందుకే సిట్టింగ్‌ సభ్యుడు పురాణం సతీష్‌ మొదలుకొని.. ఆశావహులు పెద్దఎత్తున లాబీయింగ్‌ చేస్తున్నారు. పదికి పది అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీకి ఆసక్తి చూపిస్తున్నారు నేతలు. అయితే ఇక్కడే తెరవెనక భారీ తిరకాసు నడుస్తోందట. తమ నియోజకవర్గాల నుంచి పోటీకి ఆసక్తి చూపిస్తున్నవారిని అడ్డుకునేందుకు అక్కడి ఎమ్మెల్యేలు శతవిథాలా ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. అదే టీఆర్ఎస్‌ రాజకీయాలను హీటెక్కిస్తోంది.

ఎమ్మెల్సీ వస్తే మరో అధికార కేంద్రంగా మారతారని భయం..!

తమ నియోజకవర్గానికి చెందిన వారెవరైనా ఎమ్మెల్సీ అయితే.. రాజకీయంగా ఇబ్బందులు వస్తాయని ఆందోళన చెందుతున్నారట ఎమ్మెల్యేలు. నియోజకవర్గంలో మరో అధికార కేంద్రంగా మారతారని భయపడుతున్నట్టు సమాచారం. అందుకే ఇతర నియోజకవర్గాల నుంచి అభ్యర్థిత్వం ఆశిస్తున్నవారికి గట్టి సపోర్ట్ చేస్తున్నారట. మనం హ్యాపీగా ఉండాలి.. పక్క ఎమ్మెల్యే ఏమైనా ఫర్వాలేదన్నట్టుగా రాజకీయం చేస్తున్నారట అధికారపార్టీ ఎమ్మెల్యేలు. దీంతో నిన్న మొన్నటి వరకు సఖ్యత ఉన్న ఎమ్మెల్యేలు.. ఇప్పుడు ఒకరినొకరు అనుమానంగా చూసుకునే పరిస్థితి.

పురాణం సతీష్‌కు రెన్యువల్‌ రాకుండా ఓ ఎమ్మెల్యే ఎత్తుగడ..!

సిట్టింగ్‌ ఎమ్మెల్సీ పురాణం సతీష్‌కు మళ్లీ రెన్యువల్ రాకుండా ఉండేందుకు.. ఓ ఎమ్మెల్యే వేరే నియోజకవర్గం నుంచి సీటు ఆశిస్తున్న నాయకుడికి పూర్తిస్థాయిలో సహకరిస్తున్నారట. రేస్‌లో ఉండాలని చూస్తోన్న గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌ రేణికుంట్ల ప్రవీణ్‌కు ఇంకో ఎమ్మెల్యే అడ్డుపుల్ల వేస్తున్నారట. పార్టీ నేతలు లోక భూమారెడ్డి, గొడం నగేష్‌లకు ఇదే పరిస్థితి ఉన్నట్టు సమాచారం. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఇలాకా నుంచి పార్టీ నేతలు శ్రీహరిరావు, సత్యనారాయణగౌడ్‌లు ఎమ్మెల్సీ టికెట్‌ ఆశిస్తున్నారు. ముధోల్‌ నుంచి కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలాచారి టికెట్‌ ఆశిస్తుండగా.. ఆయనకూ సెగ తప్పడం లేదన్నది పార్టీ వర్గాల మాట.

పార్టీ అభిప్రాయం కోరితే ఎమ్మెల్యేలు అదే చెబుతారా?

రాష్ట్రంలో పలుచోట్ల ఎమ్మెల్సీలు.. ఎమ్మెల్యేలకు పడకపోవడం.. నిత్యం తగువులు.. గొడవలు..తలపోట్లు ఎక్కువ కావడంతో .. వాటిని తలుచుకుని ఆదిలాబాద్‌ జిల్లాలోని టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు ఉలిక్కి పడుతున్నారట. అలాంటి తలపోట్లు మనకెందుకు అని ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎమ్మెల్యేలు ఎంత కాదన్నా.. పది నియోజకవర్గాల్లో ఏదో ఒక నియోజవర్గానికి చెందిన నాయకుడే ఎమ్మెల్సీ అవుతారు. కుల సమీకరణాలు.. అభ్యర్థుల సామర్థ్యం ఆధారంగా అధిష్ఠానం వడపోతలు మొదలుపెట్టింది. అభ్యర్థి ఎంపికలో ఎమ్మెల్యేల అభిప్రాయం పార్టీ తెలుసుకుంటుందో లేదో తెలియదు. ఒకవేళ పార్టీ అడిగితే మాత్రం తమ మనసులో మాట చెప్పేందుకు రెడీగ ఉన్నారట ఎమ్మెల్యేలు. మరి.. ఏం జరుగుతుందో చూడాలి.

Related Articles

Latest Articles