టీఆర్‌ఎస్‌లో ఉనికి కోసం కడియం శ్రీహరి పోరాటం…?

రాజకీయాల్లో ఉన్నప్పుడు మాటలు పొదుపుగా వాడాలి. అధికార పార్టీలో ఉన్నప్పుడు ఇంకాస్త జాగ్రత్తగా ఉండాలి. ఆ స్టేట్‌మెంట్‌ ఆ మాజీ మంత్రి రాజకీయ జీవితాన్ని తలకిందులు చేసిందని టాక్‌. దీంతో పార్టీలో ఉనికి కోసం పోరాటం చేయాల్సిన పరిస్థితి ఉందట. ఇంతకీ ఎవరా నేత? ఏమా కథా?

టీఆర్‌ఎస్‌లో ఉనికి కోసం పోరాటం?

కడియం శ్రీహరి. తెలంగాణ మాజీ డిప్యూటీ సీఎం. టీఆర్‌ఎస్‌ నాయకుడు. ప్రస్తుతం చేతిలో ఎలాంటి పదవి లేదు. మరోసారి ఎమ్మెల్సీ అవకాశం ఇస్తారని ఆశగా ఎదురు చూస్తున్నారు. ఆ మధ్య సీఎం కేసీఆర్‌ వరంగల్‌ పర్యటనలో గత ఆనవాయితీకి భిన్నంగా శ్రీహరి ఇంట్లో విందుకు వెళ్లారు. దాంతో టీఆర్‌ఎస్‌లో శ్రీహరికి ప్రాధాన్యం తగ్గలేదని.. పదవి ఖాయమని ప్రచారం జరిగింది. కానీ..రోజులు గడిచే కొద్దీ సీన్‌ రివర్స్‌. పార్టీలో ఉనికి కోసం పోరాడే పరిస్థితి నెలకొందట. దానిపైనే ఇప్పుడు గులాబీ శిబిరంలో చర్చ జరుగుతోంది.

శ్రీహరిపై శీతకన్ను వేశారా?

టీఆర్‌ఎస్‌లో ప్రస్తుతం హుజురాబాద్‌ ఉపఎన్నికపై ఫోకస్‌ నెలకొంది. సీనియర్‌ నేతగా ముద్రపడ్డ శ్రీహరికి అక్కడ ఉపఎన్నికలో బాధ్యతలు అప్పగించలేదు. మంత్రి కొప్పుల ఈశ్వర్‌, ఎమ్మెల్యేలు బాల్క సుమన్‌, ఆరూరి రమేష్‌, సండ్ర వెంకట వీరయ్య, సుంకే రవి తదితరులకు ఎన్నికల బాధ్యతలు అప్పగించిన టీఆర్‌ఎస్‌.. శ్రీహరిపై శీతకన్ను వేసింది. హుజురాబాద్‌లో ఒక్క మండలానికి కూడా ఆయన్ని ఇంఛార్జ్‌గా వేయలేదు. దీంతో ఈ మాజీ డిప్యూటీ సీఎంను ఎందుకు పట్టించుకోలేదన్న చర్చ మొదలైంది.

దళితబంధుపై శ్రీహరి చేసిన కామెంట్స్‌ కొంప ముంచాయా?

హుజురాబాద్‌ వేదికగా దళితబంధు పథకాన్ని సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. ఆ సమయంలోనూ శ్రీహరిని పట్టించుకోలేదని సమాచారం. దళితబంధు పథకం ప్రారంభానికి కూడా ఆహ్వానించలేదట. వరంగల్‌ పర్యటనలో ఆనవాయితీకి బ్రేక్ ఇచ్చి శ్రీహరి ఇంటికి వెళ్లిన సీఎం కేసీఆర్.. ఎందుకు ఒక్కసారిగా ఆయన్ని పక్కన పెట్టారన్న చర్చ జరుగుతోంది. దీనిపై టీఆర్‌ఎస్‌ వర్గాల్లో రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. దళితబంధు పథకాన్ని సరిగా అమలు చేయకపోతే టీఆర్‌ఎస్‌కు నష్టం జరుగుతుందని ఆ మధ్య శ్రీహరి చేసిన కామెంట్స్‌ గులాబీ బాస్‌కు కోపం తెప్పించాయట. అందుకే శ్రీహరిని దూరం పెట్టారని సమాచారం.

అనుచరుల్లోనూ ఉత్సాహం తగ్గిందా?

టీఆర్‌ఎస్‌లో ఈటల ఎపిసోడ్‌ తర్వాత కడియం ప్రాధాన్యం తగ్గిందన్నది కొందరి అభిప్రాయం. దీంతో పార్టీలో ఉనికి కోసం ఈ మాజీ డిప్యూటీ సీఎం పోరాటం చేయాల్సిన పరిస్థితి నెలకొందట. అనుచరుల్లోనూ ఉత్సాహం తగ్గిందట. వారిలో జోష్‌ తీసుకొచ్చేందుకో ఏమో.. వరంగల్‌లో దళితబంధు పథకం సమీక్షకు తనకు ఆహ్వానం వచ్చిందని ఘనంగా ప్రకటించారట. ఆ స్టేట్‌మెంట్‌ తర్వాత శ్రీహరికి ఏమైంది అని ఆరా తీసేవాళ్లు ఎక్కువయ్యారు. మరి.. ఈ ప్రతికూల పరిస్థితులను ఆయన ఎలా అధిగమిస్తారో చూడాలి.

Related Articles

Latest Articles

-Advertisement-