టీఎన్జీవో నేతల వైఖరిపై ఉద్యోగులు గుర్రు…!

చాలా కాలంగా అందరూ ఆ సంఘాలనే టార్గెట్ చేస్తున్నారు. వాళ్లూ.. వీళ్లు చెప్పడమేంటి.. మా నాయకులు అంతే అన్నవారూ లేకపోలేదు. ఇప్పుడు సమస్యలను వదిలేసి.. సభలకు ప్లాన్‌ చేస్తుండటంతో మళ్లీ విమర్శలు మొదలయ్యాయి. ఇంతకీ ఏంటా సంఘాలు? అంతా ఎందుకు రుసరుసలాడుతున్నారు?

విపక్షాల విమర్శలపై ఉద్యోగ సంఘాల నేతలు మౌనం!

తెలంగాణలో ఉద్యోగ సంఘాల తీరు ఇటీవల కాలంలో తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. గతంలో ఉద్యోగ సంఘాల నాయకులను ఏమైనా అనాలంటే.. ఏ పార్టీ నాయకులైనా వెనకా ముందు ఆలోచించేవారు. ఇప్పుడా గీతలు చెరిగిపోయాయి. విపక్ష పార్టీలు గట్టిగానే అందుకుంటున్నాయి. కాంగ్రెస్‌లో మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ మొదలుకుని మాజీ మంత్రి జీవన్ రెడ్డి.. ఎమ్మెల్యే జగ్గారెడ్డి లాంటి వాళ్లంతా ఉద్యోగ సంఘాల నేతలను ఏకి పడేస్తున్నారు. ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాల నేతలు వత్తాసు పలుకుతున్నారన్నది కాంగ్రెస్‌ నేతల ప్రధాన ఆరోపణ. ఒకప్పుడు ప్రభుత్వాలను శాసించి డిమాండ్లు సాధించుకున్న ఉద్యోగ సంఘాలు నేడు.. బెగ్గింగ్‌ స్థాయికి దిగజారిపోయాయని విమర్శల డోస్‌ పెంచారు జీవన్‌రెడ్డి. ఆ విమర్శలను పెద్దగా పట్టించుకోకుండా ఉద్యోగ సంఘాల నేతలు సైలెంట్‌గా ఉండిపోయారు. కానీ.. తాజగా చేసిన కొన్ని తీర్మానాలతో మళ్లీ చర్చల్లోకి వచ్చారు TNGO, టీజీవోల నాయకులు.

కరీంనగర్‌ నుంచి కృతజ్ఞతా సభలు పెడతారట!

30శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వడంతో ప్రభుత్వానికి కృతజ్ఞతగా రాష్ట్రవ్యాప్తంగా సభలు నిర్వహించాలని TNGO నిర్ణయించింది. కరీంనగర్ జిల్లా నుంచి సభలు మొదలుపెట్టాలని షెడ్యూల్‌ ఖరారు చేసుకున్నారు. ఫిట్‌మెంట్ ఇచ్చినందుకు సభలు పెట్టడం తప్పులేకపోయినా.. అది ఇచ్చి చాలా రోజులైంది. పైగా కరీంనగర్ నుంచి సభలు పెట్టడమంటే దానివెనక రాజకీయం కోణం ఉందనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి పార్టీలు.

సమస్యలపై కొట్లాడకుండా..సభ లేంటని ఉద్యోగులు పెదవి విరుపు!

ఫిట్‌మెంట్‌లో అనేక కొర్రీలు ఉన్నాయన్నది ఉద్యోగుల ఆరోపణ. వాటిని పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూనే.. సభలు పెట్టడం ఏంటన్న చర్చ ఆయా సంఘాల్లో ఉందట. ఉద్యోగులకు కార్పొరేట్ వైద్యం అందించాలనే డిమాండ్‌ చాలాకాలంగా ఉంది. PRCలో సూచించినట్టుగా వెంటనే జీవోలు విడుదల చేయాలని కూడా కోరుతున్నారు. జిల్లాల వారీగా ఉద్యోగుల విభజన.. పెరిగిన పనిభారం.. కొత్త ఉద్యోగాల భర్తీ.. ప్రమోషన్లు.. బదిలీలపై కొర్రీలు.. పొరుగు రాష్ట్రాల్లో ఉన్న తెలంగాణ ఉద్యోగులు.. కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలు.. ఇలా అనేక ప్రాబ్లమ్స్‌ పెండింగ్‌లో ఉన్నాయన్నది ఎంప్లాయిస్‌ మాట. వీటిపై గట్టిగా కొట్లాడాల్సిన నాయకులు.. సభలు ప్లాన్ చేయడం ఏంటని TNGO, TGO సంఘాల్లోనే కొందరు పెదవి విరుస్తున్నారట. ఇంకేదో ఆశిస్తూ.. సంఘాల నాయకులు గట్టిగా అడగడం మానేశరని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పోకడలు ఆ అనుమానాలను బలపరిచేలా ఉన్నాయని చెవులు కొరుక్కుంటున్నారట ఉద్యోగులు.

ప్రభుత్వంతో ఘర్షణ కోరుకోని ఉద్యోగ సంఘాల నేతలు!

ఉద్యోగుల ఒత్తిడి ఎలా ఉన్నా.. ప్రభుత్వంతో ఘర్షణ వైఖరి కాకుండా.. స్నేహపూర్వంగా పని చేసుకోవాలన్నది TNGO, TGO నేతల ఆలోచనగా మరికొందరు చెబుతున్నారు. ఈ విషయంలో ఎవరి వాదన ఎలా ఉన్నా.. సమస్యలు గాలికొదిలేశారనే అభిప్రాయం ఉద్యోగుల్లో బలంగా నాటుకుపోయింది. ఇది గమనించిన విపక్ష పార్టీలు సైతం ఉద్యోగ సంఘాల నేతలను విమర్శించడానికి వెనకాడటం లేదట. మరి.. కృతజ్ఞతా సభలు మొదలయ్యాక ఇంకేం జరుగుతుందో చూడాలి.

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-