తిరుపతి బీజేపీ నేతలది వన్‌ మ్యాన్‌ షో..?

కలిసి పనిచేస్తేనే పార్టీ అయినా.. మరేదైనా సక్సెస్‌ అవుతుంది. కానీ.. అక్కడ ఆ నేతలు ఎక్కువగా వన్‌ మ్యాన్‌ షో చేస్తుంటారు. ఎవరికి వారే మైలేజ్‌ కోసం ప్రయత్నిస్తూనే ఇంకొకరికి చెక్‌ పెట్టేందుకు ప్లాన్‌ చేస్తారు. ఎవరు చెప్పినా.. ఎంత చెప్పినా మారని ఆ నేతలతో ఆ పార్టీ కూడా ఎదుగూ బొదుగూ లేకుండా ఉంది.

వర్గాలుగా విడిపోయిన తిరుపతి బీజేపీ.. ఎవరి శిబిరం వారిదే!

ఆధ్యాత్మిక నగరం తిరుపతి కేంద్రంగా బీజేపీ కార్యకలాపాలు చురుగ్గా సాగుతుంటాయి. తిరుమల, తిరుపతి ఆథ్యాత్మిక కేంద్రంగా ఉండటంతో.. కొండపైన, కింద కాషాయదళం నేతలు క్రియాశీలకంగా వ్యవహరిస్తుంటారు. అయితే ఎన్నేళ్లు గడుస్తున్నా తిరుపతి బీజేపీలో అంతర్గతంగా ఉన్న విభేదాలు పెరుగుతున్నాయే తప్ప తరగడం లేదంటోంది కేడర్‌. దీనికంతటికీ కారణం.. కేడర్ కంటే నాయకులే ఎక్కువని వైరిపక్షాలు అప్పుడప్పుడూ సెటైర్లు వేస్తుంటాయి కూడా. జిల్లాలో శాంతా రెడ్డి, భానుప్రకాష్‌రెడ్డి, సామంచి శ్రీనివాస్‌ సహా కొందరే సీనియర్లు బీజేపీలో ఉన్నారు. నిరసనలకు వచ్చేసరికి భానుప్రకాష్‌రెడ్డి,శ్రీనివాస్‌లే కనిపిస్తుంటారు. విషయం ఏదైనా ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలపై రాష్ట్రంలో వారే స్పందిస్తుంటారు. గతంలో శాంతారెడ్డి హవా సాగినా.. తర్వాతి తరం వచ్చాక ఆ దూకుడు లేదట. పైగా బీజేపీలో భాను ఓ వర్గంగా, శాంతారెడ్డి మరో వర్గంగా.. జల్లి మధుసూదన్‌ ఇంకోవర్గంగా ఉంటున్నారట. ఎక్కడ ఏ కార్యక్రమం జరిగిన వేర్వేరుగా ధర్నాలు చేస్తుంటారు. కేడర్ కూడా తమకు నచ్చిన నేత వెంట వెళ్లిపోతోందట.

తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికల్లోనూ ఎవరికి వారే యమునా తీరే!

ఇటీవల జరిగిన తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికల సమయంలో తిరుపతి బీజేపీ నేతలను ఒక్కతాటిపైకి తేవాలని పార్టీ పెద్దలు ప్రయత్నించారట. వారి ముందు ఓకే అని చెప్పినప్పటికీ.. తర్వాత ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు వ్యవహరించారట. ఉపఎన్నికలో ఓటమి తర్వాత ఈ విభేదాలు ఇంకా పెరిగినట్టు చెబుతున్నారు. గత ఏడాది శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించడానికి సీఎం జగన్ తిరుపతి వస్తున్న సందర్భంలో.. డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతనే ముఖ్యమంత్రి శ్రీవారి దర్శనానికి వెళ్లాలని భానుప్రకాష్‌రెడ్డి నిరసన తెలిపారు. ఒకవైపు భాను ఆందోళన చేస్తుంటే..బీజేపీ ఎలాంటి నిరసనలకు పిలుపివ్వలేదని పార్టీ నేత దయాకర్‌రెడ్డి ప్రకటన విడుదల చేయడం అప్పట్లో చర్చగా మారింది.

కిషన్‌రెడ్డి ఆశీర్వాదయాత్రకు కొందరు డుమ్మా?

తాజాగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తిరుపతిలో నిర్వహించిన ఆశీర్వాద్ యాత్రలోను నగర బీజేపీ నేతలు అంటీముట్టనట్టుగా ఉన్నారట. కొంతమంది నాయకులు ఆశీర్వాద యాత్రకు డుమ్మా కొట్టేశారట. ఉపఎన్నిక సమయంలో నేతల మధ్య పెరిగిన విభేదాలు ప్రస్తుతం తారాస్ధాయికి చేరాయి. ఇంత చేస్తే.. పార్టీ ఏమైనా పెరిగిందా అంటే అదీ లేదు. ఎన్నేళ్లు అయినా ఎన్ని ఎన్నికలు వచ్చినా అవే ఓట్లు అదే సీన్‌. అటు పార్టీ పెరగదు. ఇటు వర్గ విభేదాలు తరగవు అన్నట్టు తిరుపతి బీజేపీ పరిస్థితి ఉంది. మరి.. తిరుపతి బీజేపీని గాడిలో పెట్టేందుకు పెద్ద కమలనాథులు ఎలాంటి మంత్రం వేస్తారో చూడాలి.

Related Articles

Latest Articles