తిరుమలలో సర్వదర్శనానికి కరోనా గ్రహణం…

తిరుమల శ్రీవారిని ఉచితంగా దర్శించుకునే భాగ్యం సామాన్య భక్తులకు తిరిగి ఎప్పుడు లభిస్తుంది? సామాన్యులకు అధిక ప్రాధాన్యం ఇస్తామనే టీటీడీ.. ఆ దిశగా ఎందుకు ఆలోచించడం లేదు? కరోనా తీవ్రతవల్ల నిలిచిపోయిన సర్వదర్శనం తిరిగి ప్రారంభించేది ఎప్పుడు? 300ల నుంచి వీఐపీల వరకు టికెట్‌లు పెట్టి దర్శనం చేయిస్తున్న టీటీడీకి ఉచిత దర్శనం ఎందుకు పట్టడం లేదు? ఆదాయంపై ఉన్న ధ్యాస సామాన్య భక్తులపై లేదా?

సామాన్య భక్తులు క్యూ లైన్‌లో వేచి ఉంటే ఆహార పానీయాలు ఉచితం

ఇల వైకుంఠం తిరుమల శ్రీవారి ఆలయంలో సర్వదర్శనం క్యూలైన్‌ నిరంతరాయంగా కొనసాగుతుంది. ఉదయం నుంచి రాత్రి ఏకాంతసేవ వరకు స్వామివారిని దర్శించుకునే వెసులుబాటు సర్వదర్శనం భక్తులకు ఉంటుంది. సామాన్య భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోకి ప్రవేశిస్తే.. వారికి దర్శనభాగ్యం కలిగించే వరకు అన్నీ టీటీడీయే సమకూరుస్తుంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో గంటల తరబడి భక్తులు వేచిఉంటే.. ఆ సమయంలో వారికి ఆహార పానీయాలు అన్ని కూడా ఉచితంగా అందిస్తుంది. ఇవన్నీ ఇప్పుడు గతంగతః అన్నట్టుగా మారిపోయింది.

కరోనా మొదటి వేవ్‌లో 22 వేల మందికి సర్వ దర్శనం!

కరోనా వైరస్ మొదటివేవ్‌లో గతఏడాది మార్చి 21న శ్రీవారి ఆలయంలో దర్శనాలు నిలిపివేసింది టీటీడీ. 80 రోజుల తర్వాత దర్శనాలు పునరుద్ధరించినా.. పరిమిత సంఖ్యలోనే భక్తులను దర్శనానికి అనుమతించింది. రోజుకి 6 వేల మంది వచ్చేలా మార్పులు చేసినా.. సర్వదర్శన భక్తులుకు ప్రాధ్యనం ఇచ్చింది. మొదట్లో 3వేల మంది ప్రత్యేక ప్రవేశ దర్శనం ద్వారా.. మరో 3వేల మంది సర్వదర్శనం క్యూలైను ద్వారా వెళ్లేవారు. ఆ తర్వాత భక్తుల సంఖ్యను పెంచుతూ వెళ్లింది. ఆ విధంగా ఈ ఏడాది ఏప్రిల్ 14 నాటికి స్వామివారిని దర్శించుకునే సర్వదర్శనం భక్తుల సంఖ్య 22 వేలకు చేరింది.

ఏప్రిల్‌ 14 నుంచి సర్వదర్శనం టికెట్ల జారీ నిలిపివేత

కరోనా సెకండ్ వేవ్‌లో దర్శనాలు ఆపకపోయినా.. భక్తుల సంఖ్యను గణనీయంగా తగ్గించింది టీటీడీ. ఈ ప్రభావం సర్వదర్శనం భక్తులపై పడింది. ఏప్రిల్ 14 నుంచి సర్వదర్శనం భక్తులకు జారీచేసే దర్శన టోకెన్లను పూర్తిగా నిలిపివేసింది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను రోజుకు 5 వేలకు కుదించింది. అయినప్పటికీ స్వామివారిని దర్శించుకునే భక్తుల సంఖ్య 18 వేల వరకు ఉంటోంది. వీఐపీ బ్రేక్ దర్శనాలు, వర్చువల్ సేవా , శ్రీవాణి ట్రస్ట్, పర్యాటక శాఖ జారీ చేసే టికెట్లు కలిగిన భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. వీరంతా 300 నుంచి 10వేల రూపాయలు వరకు పెట్టి టికెట్లను కొనుగోలు చేసిన భక్తులు. దీంతో టికెట్ల ద్వారా కోటి.. హుండీ ద్వారా మరో కోటికిపైగా ఆదాయం వస్తోంది.

సర్వదర్శనంలో భక్తులు వచ్చి 75 రోజులు దాటింది
కొండకు వచ్చే భక్తుల్లో 60-65 శాతం మంది ఉచిత దర్శనం

ప్రస్తుతం కాసులు చెల్లించిన వారికే దర్శనం. సర్వదర్శనం భక్తులు వచ్చి 75 రోజులవుతోంది. ఈ కోటాలో టికెట్లు జారీ చేస్తే కరోనా తీవ్రత పెరుగుతుందనే అనుమానంతో వాయిదా వేస్తూ వస్తోంది టీటీడీ. సాధారణంగా తిరుమల దర్శనానికి వచ్చే భక్తుల్లో 60-65 శాతం ఉచిత దర్శనం చేసుకునే వారే ఉంటారు. అలాంటిది కరోనా పేరుతో టికెట్లు కొనేవారికి ఇస్తున్న ప్రాధాన్యంలో కనీసం సగం కూడా సామాన్య భక్తులకు టీటీడీ ఇవ్వడం లేదు. కనీసం అందుకు వీలున్న ప్రత్యామ్నాయాలను కూడా పట్టించుకోవడం లేదు. మళ్లీ కరోనా థర్డ్‌వేవ్‌ వస్తుందని నిపుణులు చెబుతున్నారు. అంటే ఆ సాకుతో ఇప్పుడప్పుడే సామాన్యులకు శ్రీవారి దర్శన భాగ్యం దక్కే సూచనలు కనిపించడం లేదు.

-Advertisement-తిరుమలలో సర్వదర్శనానికి కరోనా గ్రహణం...

Related Articles

Latest Articles