ముల్లును ముల్లుతోనే తీయాలనే ప్లాన్‌లో ఎమ్మెల్సీ తోట!

ముల్లును ముల్లుతోనే తీయాలని చూస్తున్నారు ఆ నాయకుడు. ఇప్పటికీ వెంటాడుతున్న సమస్య తన రాజకీయ భవిష్యత్‌కు అడ్డుపడకూడదని రివర్స్‌ ప్లాన్‌ వేశారట. తనకు వ్యతిరేకమని ప్రచారం జరుగుతున్న వర్గంతోనే ఘన సన్మానం చేయించుకుని శత్రు శిబిరానికి షాక్‌ ఇచ్చారట. ఇంతకీ ఇవన్నీ వర్కవుట్‌ అవుతాయా?

కేసు విచారణలో ఉండగానే ఎమ్మెల్యేగా గెలిచారు.. ఇప్పుడు ఎమ్మెల్సీ!

తోట త్రిమూర్తులను శిరోముండనం కేసు నీడలా వెంటాడుతోంది. తాజాగా ఎమ్మెల్సీ అయినా ఆయన్ను శిరోముండనం కేసుకు బాధ్యుడిగా చేస్తూ బర్తరఫ్‌ చేయాలని రామచంద్రపురం, మండపేట ప్రాంతాల్లో ఆందోళనలు జరుగుతున్నాయి. ఎమ్మెల్సీగా తోట పేరు ప్రకటించినప్పటి నుంచి ఆయన వ్యతిరేకులు ఇలా ఆందోళనలు, నిరసనలు, ప్రదర్శనలు చేస్తూనే ఉన్నారు. ఈ నిరసనలు తోటకు కొత్తేమీ కాదు. 1997లో జరిగిన శిరోముండనం కేసు కోర్టులో ఉంది. అది అలా కొనసాగుతుండగానే ఆయన రామచంద్రపురం నుంచి ఎమ్మెల్యేగా, టీడీపీ, కాంగ్రెస్‌ నుంచి గెలిచారు. ఇప్పుడు వైసీపీలో చేరి ఎమ్మెల్సీ కూడా అయ్యారు.

read also : అధికారులు ఇచ్చిన లెక్కలపై సీఎం కేసీఆర్‌ అసంతృప్తి !

మంత్రిని చేస్తారేమోనని ఆశ!

అడపాదడపా శిరోముండనం ఆందోళనలు జరుగుతూ ఉన్నా వాటిని తోట కానీ, ఆయన ఉన్న అప్పటి పార్టీలు కానీ పట్టించుకోలేదు. దాంతో ఆయన కూడా నిరసనలను లైట్‌ తీసుకునేవారు. కానీ, ఇప్పుడా పరిస్థితి లేదు. ఆయన చేరింది వైసీపీలో. పదవి ఇచ్చింది సీఎం జగన్‌. వైసీపీకి దళితులు అనుకూలంగా ఉంటారు. అలాంటివర్గం తనకు వ్యతిరేకంగా చేస్తున్న ఆందోళనలను సీఎం జగన్‌ సీరియస్‌గా తీసుకుంటారేమోననే భయం తోట త్రిమూర్తులకు ఉందట. అంతేకాదు ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన సీఎం జగన్‌ త్వరలో జరగబోయే మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలో ఛాన్స్‌ ఇస్తారని తోట ఆశిస్తున్నారు.

తోటను ఆందోళనలోకి నెట్టిన దళితుల నిరసనలు
దళితులతో భారీ సన్మానం ఏర్పాటు చేయించారు!

ఇలాంటి సమయంలో నిత్యం ఏదో ఒక మూల తనకు వ్యతిరేకంగా.. తనను బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ జరుగుతోన్న కార్యక్రమాలు తోటను ఆందోళనలోకి నెట్టినట్టున్నాయి. గతంలోలాగా వదిలేస్తే లాభం లేదని అనుకున్నారో.. లేక రాజకీయంగా అందాల్సిన అందలం మిస్‌ అవుతుందని అనుకున్నారో ఏమో.. ప్లాన్‌ మార్చేశారు. ఇలాంటి వాటిల్లో ఆరితేరిన తోట ఏ వర్గాలైతే తనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాయో.. వాళ్లతోనే తనకు జైజైలు కొట్టించుకున్నారు. తాను ఇంఛార్జ్‌గా ఉన్న మండపేటలో దళితులతో భారీ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయించారట తోట. పైకి అది దళితులు పెట్టిందే అని చెప్పినా.. స్క్రీన్‌ ప్లే మొత్తం ఎమ్మెల్సీదేనట.

దళితుల రుణం తీర్చుకోవాల్సింది చాలానే ఉందన్న తోట!

ఓ పక్క తోటకు వ్యతిరేకంగా రకరకాల ఆందోళనలు జరుగుతుంటే.. సన్మాన సభలో ఏకంగా త్రిమూర్తులను భుజాలపైకి ఎత్తుకొని వేదికపైకి తీసుకెళ్లేలా ప్లాన్‌ చేశారు. ర్యాలీలు, డప్పులు, డ్యాన్స్‌లతో అదరగొట్టి.. తనను ఇరకాటంలోకి నెడుతున్న ప్రత్యర్థి వర్గానికి చెక్‌ పెట్టే ప్రయత్నం చేశారు. తాను దళితల వ్యతిరేకిని కాదని.. దళితులకు అనేకం చేశానని.. ఇంకా వాళ్ల రుణం తీర్చుకోవాల్సింది చాలానే ఉందని చెప్పుకొచ్చిన తోట.. శిరోముండనం కేసును పరోక్షంగా ప్రస్తావిస్తూ తనను అది ఎప్పటికీ బాధిస్తుందనే చెప్పుకొన్నారు.

నిరసనలకు పిల్లి అండదండలు ఉన్నాయని తోట అనుమానం!

ఎంపీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, మంత్రి వేణుగోపాల్‌ కృష్ణలతో ఎప్పటి నుంచో తోటకు తీవ్ర రాజకీయ విభేదాలు ఉన్నాయి. ముగ్గురూ ఇప్పుడు ఒకే పార్టీయే అయినా కడుపులో కత్తులు పెట్టుకుని ఉంటారని అందరూ అంటుంటారు. తన వ్యతిరేక శిబిరానికి పిల్లి అండదండలు ఉన్నాయనేది తోట అనుమానం. ఎంత ఎమ్మెల్సీ అయినప్పటికీ పిల్లితో పోలిస్తే వైసీపీలో తోట జూనియర్. ఆ ఎఫెక్ట్‌ భవిష్యత్‌ పదవులపై పడకుండా ఉండటానికి వ్యతిరేకంగా ఉన్న వర్గం నుంచే సన్మానం చేయించుకోవడం ద్వారా తన సత్తా చాటాలని తోట చూస్తున్నారు. తనకూ దళితుల్లో ఆదరణ ఉందని చెప్పుకొనేందుకు తోట చేస్తున్న ప్రయత్నాలు ఎంత వరకు సక్సెస్‌ అవుతాయో చూడాలి.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-