కొత్త కమిటీతో కాంగ్రెస్ నాయకులు ఒక్కటయ్యేనా…?

తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త కమిటీ వచ్చేసింది. ఈ కమిటీ అయినా నాయకుల మధ్య సమన్వయం సాధిస్తుందా? అలిగిన ఆ ఇద్దరు నాయకులు గాంధీభవన్ మెట్లు ఎక్కుతారా..!? కథ సుఖాంతం అవుతుందా.. లేదా?

రేవంత్‌ను వ్యతిరేకించిన ఎంపీ కోమటిరెడ్డికి పీఏసీలో చోటు!

తెలంగాణ కాంగ్రెస్‌లో సీనియర్ నాయకులు అందరినీ కలిపేందుకు AICC ఓ కసరత్తు చేసింది. 30 మందితో పొలిటికల్ అఫైర్స్ కమిటీ వేసింది. ఈ కమిటీలో ఎంపీ, ఎమ్మెల్యేలతోపాటు మాజీ పీసీసీ చీఫ్‌లు, సీఎల్పీ నేతలకు చోటు కల్పించింది. పీసీసీలో కోర్ కమిటీ ఉంటుంది. ఇదే అన్ని అంశాలపై రాజకీయ కార్యాచరణ ప్రకటనకు వేదిక. ఈసారి మాత్రం AICC పొలిటికల్ అఫైర్స్ కమిటీ వేసింది. పీసీసీ చీఫ్‌గా రేవంత్‌ నియామకాన్ని వ్యతిరేకించిన నాయకులు ఈ కమిటీలో ఉన్నారు. వారిలో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఒకరు. మాజీ పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డికి కూడా కమిటీలో చోటు లభించింది. రేవంత్‌ సారథిగా వచ్చాక ఉత్తమ్ అడపా.. దడపా గాంధీభవన్‌కి వచ్చారు తప్ప మనస్పూర్తిగా కలిసి పోలేదన్నది ఓపెన్ టాక్.

గాంధీభవన్‌ మెట్లు ఎక్కేది లేదని గతంలో ప్రకటన!

కోమటిరెడ్డి బ్రదర్స్ వ్యవహారమే ఇప్పుడు కీలకం. ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుండి.. రాజగోపాల్ రెడ్డి గాంధీభవన్‌కు రాలేదు. బీజేపీవైపు మొగ్గు చూపుతున్నట్టు కామెంట్ చేసిన నాటి నుండి ఆయన అంటిముట్టనట్టు వ్యవహారం నడిపిస్తున్నారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. పీసీసీ చీఫ్‌గా రేవంత్‌ వచ్చాక గాంధీభవన్ మెట్లే ఎక్కేది లేదని స్పష్టం చేశారు. ఇప్పుడు ఈ ఇద్దరు బ్రదర్స్‌నీ PAC కమిటీలో వేశారు. గతంలో రాహుల్ గాంధీకి లేఖ రాసిన ఎమ్మెల్యే జగ్గారెడ్డి కమిటీలో ఉండాల్సిన వారిపేర్లలో వీరందరినీ సూచించారు. కమిటీ వేసింది హైకమాండే అయినా.. కమిటీ సమావేశానికి ఉత్తమ్‌తోపాటు కోమటిరెడ్డి బ్రదర్స్ హాజరవుతారా..లేదా అనేది అసలు ప్రశ్న. ఇక కమిటీని వేయించడంలో కీలకంగా వ్యవహరించిన జగ్గారెడ్డి.. వీరంతా సమావేశానికి రాకపోతే ఇరుకున పడటం ఖాయం.

కోమటిరెడ్డి సోదరులను తీసుకొచ్చే బాధ్యత జగ్గారెడ్డిదేనా?

కోమటిరెడ్డి బ్రదర్స్.. ఎమ్మెల్యే జగ్గారెడ్డికి సన్నిహితం. పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ హోదాలో భువనగిరి పార్లమెంట్‌ ఇంఛార్జ్‌గా కూడా ఉన్నారు. నిత్యం వీరి మధ్య సంభాషణలు జరుగుతున్నాయి. అందుకే కోమటిరెడ్డి సోదరులను.. సమావేశాలకు వచ్చే బాధ్యత జగ్గారెడ్డి తీసుకున్నారట. అలాగే కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్‌ మాణిక్యం ఠాగూర్‌ను సైతం కోమటిరెడ్డి రెడ్డి బ్రదర్స్‌ ఇంటికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం. ఇలా కాంగ్రెస్‌లో ఎవరి ఎత్తుగడ వాళ్లు వేస్తున్నారు. కోమటిరెడ్డి సోదరులు గాంధీభవన్‌కు వచ్చి మీటింగ్‌లో పార్టిసిపేట్‌ చేస్తారా.. వస్తే ఎలా ఉంటుంది.. రాకపోతే ఏం జరుగుతుంది అన్నది కాంగ్రెస్‌లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. మరి.. కొత్త కమిటీ సరికొత్త పరిణామాలకు వేదిక అవుతుందో లేదో చూడాలి.

Related Articles

Latest Articles

-Advertisement-