టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ ఆశావహుల్లో టెన్షన్‌..!

హుజురాబాద్‌ ఉపఎన్నిక నగారా మోగాక ఎమ్మెల్సీ ఆశావహుల్లో టెన్షన్‌ మొదలైందా? ఒకటి రెండు రోజుల్లో ఆరు ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి షెడ్యూల్‌ వస్తుందా? గులాబీ నేతలు లాబీయింగ్‌ తీవ్రం చేశారా? పదవీకాలం ముగిసిన వాళ్లలో ఎవరికి ఛాన్స్‌? పెద్దల సభకు వెళ్లే కొత్తవారు ఎవరన్నదే ఇప్పుడు ఉత్కంఠ.

ఆరు ఎమ్మెల్సీ పదవులు ఎవరికి ఇవ్వాలో సీఎం కేసీఆర్‌ నిర్ణయానికి వచ్చారా?

తెలంగాణ‌లో ఎమ్మెల్సీ ఖాళీలు ఆరు.. పోటీలో 60 మందికిపైగా ఉన్నారు. ఎవ‌రిని ప‌ద‌వి వ‌రిస్తుందోన‌న్న ఉత్కంఠ టీఆర్ఎస్‌లో క‌నిపిస్తోంది. ప‌ద‌వీకాలం ముగిసినా కరోనాతో ఎన్నిక వాయిదా ప‌డుతూ వ‌స్తుంది. ప్రత్యక్ష ఎన్నిక‌లకు దేశ‌వ్యాప్తంగా నోటిఫికేష‌న్ రావ‌డంతో ఒక‌టి రెండు రోజుల్లోనే ఎమ్మెల్సీ ఎన్నిక‌ల షెడ్యూల్ వస్తుందని టాక్‌. అసెంబ్లీలో ఉన్న బలాబలాల‌ను బ‌ట్టి ఆరింటికి ఆరు అధికార‌ టీఆర్ఎస్‌కే దక్కనున్నాయి. అధినేత క‌రుణిస్తే చాలు పెద్దలస‌భ‌లో అడుగు పెట్టొచ్చు. సామాజిక స‌మీక‌ర‌ణ‌లు, విధేయ‌త‌, జిల్లాల లెక్కలు వేసుకుని సీఎం కేసీఆర్‌ ఇప్పటికే ఓ నిర్ణయానికి వ‌చ్చిన‌ట్టు స‌మాచారం. షెడ్యూల్ రాగానే పేర్లను అధికారికంగా ప్రక‌టిస్తార‌ని తెలుస్తోంది. అయినప్పటికీ ఆశావ‌హులు త‌మ ప్రయ‌త్నాలు తాము చేసుకుంటు ఉన్నారు. ఎక్కడ అవ‌కాశం దొరికినా నేత‌లు కంట‌ప‌డేందుకు ప్రయత్నిస్తున్నారు నాయకులు.

ఎమ్మెల్సీ అయ్యి.. మంత్రి కావాలని చూస్తోన్న గుత్త..!

గవర్నర్‌ కోటాలో ప్రొఫెసర్‌ శ్రీనివాస్‌రెడ్డి స్థానంలో కౌశిక్‌రెడ్డిని కేబినెట్ ప్రతిపాదించ‌గా అది ఇంకా పెండింగ్‌లో ఉంది. క‌డియం శ్రీహ‌రి, గుత్తా సుఖేంద‌ర్‌రెడ్డి, ఫరీదుద్దీన్, ఆకుల ల‌లిత‌, బోడ‌కుంటి వెంక‌టేశ్వర్లు, నేతి విద్యాసాగ‌ర్‌ల ప‌ద‌వీకాలం పూర్తవ‌డంతో ప్రస్తుతం ఖాళీలు ఏర్పడ్డాయి. కడియం శ్రీహ‌రి, గుత్తా సుఖేంద‌ర్‌రెడ్డి మ‌రోసారి ప్రయ‌త్నాలు చేసుకుంటున్నారు. ఎమ్మెల్సీ అయి మంత్రివ‌ర్గంలోకి వెళ్లాల‌ని కోరుకుంటున్నారు గుత్తా. రాబోయే ఎన్నిక‌ల్లో క‌డియం కుమార్తెకు అవ‌కాశం ఇస్తామ‌న్న హామీతో క‌డియం పోటీ నుంచి త‌ప్పుకున్నట్టేన‌ని చెబుతున్నారు. పార్టీ కోటాలో దేశ‌ప‌తి శ్రీనివాస్, రావుల శ్రవ‌ణ్ కుమార్ రెడ్డి, ఎల్పీ ఇంఛార్జ్‌ ర‌మేష్ రెడ్డి, ఎస్సీ, ఎస్టీ క‌మిష‌న్ మాజీ ఛైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్ ఎమ్మెల్సీలుగా అవకాశం వ‌స్తుంద‌ని ఆశిస్తున్నారు.

నల్లగొండ నేత కోటిరెడ్డికి ఇప్పుడా.. భవిష్యత్‌లోనా..?

జిల్లాల వారీగా చూస్తే ఉమ్మడి వ‌రంగ‌ల్ జిల్లా నుంచి మాజీ స్పీక‌ర్ మ‌ధుసూదనాచారి, త‌క్కెళ్లప‌ల్లి ర‌వీంద‌ర్‌రావు, సీనియ‌ర్ నేత రాజ‌య్య యాద‌వ్ ఈసారి త‌మ‌కు అవ‌కాశం వ‌స్తుంద‌ని లెక్కలు వేసుకుంటున్నారట. న‌ల్లగొండ జిల్లా నుంచి సాగ‌ర్ ఎన్నిక‌ల్లో పోటీప‌డి త‌ప్పుకొన్న కోటిరెడ్డిని మండ‌లికి పంపుతాన‌ని సీఎం ఆనాడే ప్రకటించారు. అది ఇప్పుడేనా లేక భ‌విష్యత్తులోనా అన్నది స్పష్టత రావాల్సి ఉంది. ఖ‌మ్మం నుంచి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర‌రావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, తాతా మ‌ధు ఎమ్మెల్సీ ఆశిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా నుంచి నిర్మల్‌ ఇన్‌ఛార్జ్ శ్రీహ‌రిరావు, పాల‌మూరు జిల్లా నుంచి మాజీ మంత్రి జూప‌ల్లి కృష్ణారావులు సైతం ఎమ్మెల్సీపై ఆశలు పెట్టుకున్నారు. మరి.. గులాబీ దళపతి ఫ్రేమ్‌లో ఎవరున్నారో ఏమో..?

-Advertisement-టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ ఆశావహుల్లో టెన్షన్‌..!

Related Articles

Latest Articles