తెలంగాణ సర్కార్‌ ఆదేశాలు పట్టని మిల్లర్లు..!

వారు ప్రభుత్వాన్నే శాశిస్తున్నారా? హెచ్చరికలను కూడా లెక్క చేయడం లేదా? వారి నిర్లక్ష్యం సర్కార్‌కు ఆర్థిక ఇబ్బందులు తెచ్చిపెడుతోందా? అయినప్పటికీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ప్రభుత్వాన్ని ధిక్కరిస్తున్నవాళ్ల వెనక ఉన్నది ఎవరు?

మిల్లర్ల అక్రమాల వెనక ఉన్నది ఎవరు?

తెలంగాణలో మిల్లర్ల తీరు ప్రభుత్వానికి వందలకోట్ల నష్టాన్ని తీసుకొస్తోంది. గత ఏడాది యాసంగిలో సివిల్‌ సప్లయ్‌ కొనుగోలు చేసిన ధాన్యాన్ని FCIకి అప్పగించేందుకు మిల్లర్లకు కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌-CMRకు కేటాయించారు. కానీ మిల్లర్లు సమయానికి CMR ఇవ్వలేదు. దాంతో వాటిని తీసుకోబోమని ప్రభుత్వానికి లేఖ రాసింది FCI. పైకి ఈ వ్యవహారం చిన్నగా కనిపించినా.. లక్ష టన్నుల CMRకు సంబంధించిన విషయం ఇది. ప్రభుత్వంపై 340 కోట్ల భారం పడింది. వర్షాకాలానికి సంబంధించిన మూడున్నర లక్షల టన్నుల CMR పెండింగ్‌లో ఉన్నట్టు సమాచారం. సమస్య తీవ్రత పెరుగుతున్నా.. మిల్లర్లు ఎందుకిలా చేస్తున్నారు? వారి వెనక ఉన్న శక్తులెవరు? ప్రభుత్వ ఆదాయానికి వందల కోట్లు గండిపడుతున్నా.. చర్యలు తీసుకోలేరన్న ధైర్యం ఎవరికి ఉంది అన్నదే ఇప్పుడు ప్రశ్న.

చర్యలు తీసుకోవాల్సిన వాళ్ల నుంచి స్పందన నిల్‌!

ఒకసారి మిల్లర్లకు ధాన్యం అప్పగిస్తే నిర్దేశించిన గడువులోగా FCIకి అందజేయాలి. మిల్లర్లు నిర్లక్ష్యంగా ఉంటే పౌరసరఫరాల మంత్రి లేదా పౌరసఫరాల కార్పొరేషన్‌ ఛైర్మన్‌ చర్యలు తీసుకోవాలి. కానీ.. ఈ విభాగం నుంచి ఉలుకు, పలుకు లేదు. ఇదే అనుమానాలకు తావిస్తోంది. రాష్ట్రంలో 2 వేల 400 మిల్లులు ఉండగా.. వాటిల్లో బాయిల్డ్‌ మిల్లులు 940. రోజుకు రెండు షిఫ్ట్‌ల చొప్పున యంత్రాలు నడిపిస్తే టన్నుల్లో రైస్‌ సిద్ధం అవుతుంది. కానీ.. ఏ మిల్లూ రెండు షిఫ్ట్‌లు పనిచేయడం లేదు.

సమీక్షలు పిచ్చాపాటి మాటలకే పరిమితం?

గడువులోగా CMR ఇవ్వని మిల్లులపై 125 శాతం జరిమానా వేయొచ్చని రూల్స్‌ చెబుతున్నాయి. వాటికీ మిల్లర్లు భయపడటం లేదు. ఇప్పుడు FCI కొరఢా ఝుళిపించడంతో లొసుగులు చర్చల్లోకి వచ్చాయి. మంత్రి, కార్పొరేషన్‌ ఛైర్మన్‌ సమీక్షలు చేస్తున్నా.. పరిస్థితుల్లో మార్పు లేదు. సమీక్షలు పిచ్చాపాటి మాటలకే పరిమితం అవుతున్నాయన్న విమర్శలు ఉన్నాయి. పాత CMR పెండింగ్‌ను పక్కన పెడితే ఈ యాసంగిలో కొనుగోలు చేసిన లక్షల టన్నుల ధాన్యంపైనా అనుమానాలు ఉన్నాయి. 64 లక్షల టన్నుల CMRకు గాను.. ఇప్పటి వరకు 10-12 లక్షల టన్నులే అందించారట. ఇది కూడా టార్గెట్ రీచ్‌ కావడం సందేహమే అన్నది అధికారులు చెప్పేమాట.

‘పెద్దోళ్ల’ వ్యవహారం కావడంతో అంతా గప్‌చుప్‌!

బ్లాక్‌ లిస్ట్‌లో ఉన్న మిల్లులకూ ధాన్యాన్ని పంపడంపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీటి వెనక పెద్ద ఎత్తున పెద్ద తలకాయలకు చేతులు మారుతున్నాయట. పైగా ఇది పెద్దోళ్ల వ్యవహారం కావడంతో సివిల్ సప్లయ్‌ శాఖలో కిందివాళ్లు ఎవరూ కిక్కురు మనడం లేదు. వెనక పెద్దల అండ, ఆశీస్సులు ఉండటంతో మిల్లర్లు చర్యలకు భయపడటం లేదని సమాచారం. అసలే ఆర్థిక ఇబ్బందులు ఉన్న ఈ సమయంలో ఇంటి దొంగలను పట్టుకునేందుకు ప్రభుత్వ పెద్దలు దృష్టి పెట్టాలన్నది సివిల్‌ సప్లయ్‌ వర్గాల నుంచి వినిపిస్తున్నమాట. మరి.. ఇంటి దొంగలు దొరుకుతారో లేక ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడన్న సామెత మరోసారి రుజువవుతుందో చూడాలి.

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-