టీచర్ల పదోన్నతులు, బదిలీలకు గ్రహణం..!

ప్రభుత్వ ఉద్యోగమంటే.. పదోన్నతులు.. బదిలీలు కామన్‌. సమయం సందర్భాన్ని బట్టి అవి జరిగిపోతూ ఉంటాయి. తెలంగాణలో టీచర్లకు మాత్రం ఈ రెండు అంశాలు అందని ద్రాక్షగానే మిగిలిపోయాయి. కొన్నేళ్లుగా గ్రహణం వీడటం లేదు. ఎందుకిలా? ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవడం లేదా? లేక.. టీచర్ల వైపు నుంచి ఏదైనా లోపం ఉందా?

పదోన్నతులు.. బదిలీలకు టీచర్లు దూరం..!

తెలంగాణలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఆరేళ్లుగా పదోన్నతులు లేవు. మూడున్నరేళ్లుగా బదిలీలు బంద్‌. ఈ రెండు అంశాలపై ఉపాధ్యాయ సంఘాలు పోరాటం చేస్తున్నా.. ఎక్కడి సమస్య అక్కడే తిష్ఠ వేసింది. విద్యాశాఖలో అధికారులు మారినా.. మంత్రిగా ఎవరొచ్చినా కలిసి విన్నవించడమే తప్ప.. సమస్యను పరిష్కరించేవారు కరువయ్యారు. ఇన్నేళ్లుగా ఉపాధ్యాయ సంఘాలు ఇచ్చిన వినతిపత్రాల దొంతర్లు.. పేషీలలో మూలుగుతున్నాయి.

అతీగతీ లేని యాజమాన్యాల వారీగా చర్యలు..!

ఏకీకృత సర్వీస్‌ రూల్స్‌ వివాదంతో కొన్ని రోజులుగా ఈ రెండు అంశాలు పెండింగ్‌లో పడ్డాయి. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉలుకు, పలుకు లేకపోవడంతో ఉపాధ్యాయ సంఘాలే ఒక మెట్టు దిగాయి. యాజమాన్యాల వారీగా పదోన్నతులు, బదిలీలు కల్పించాలని విన్నవించారు ప్రతినిధులు. అంటే ప్రభుత్వ, పంచాయతీరాజ్‌ విభాగాల వారీగా చర్యలు తీసుకోవాలని కోరారు. వివిధ ప్రభుత్వ విభాగాలలో ఉద్యోగులకు పదోన్నతులు.. ట్రాన్స్‌ఫర్లు అమలవుతున్నా.. తమకే ఎందుకీ దుస్థితి అని ఆవేదన చెందుతున్నారు ఉపాధ్యాయులు.

ప్రభుత్వం తమపై కోపంగా ఉందేమోనని టీచర్ల అనుమానం..!

పీఆర్సీ ప్రక్రియ కొనసాగేటప్పుడు.. ప్రకటన సమయంలో ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు ప్రభుత్వ పెద్దలను కలిసి మాట్లాడారు కూడా. అసెంబ్లీలోనూ వీటిపై ప్రకటనలు వచ్చాయి. కానీ.. కార్యాచరణ దిశగా అడుగు పడలేదు. అయితే అన్ని సమస్యలు కొలిక్కి తెస్తున్న ప్రభుత్వం.. టీచర్ల డిమాండ్లను పెండింగ్‌లో పెట్టడానికి కారణాలు వేరే ఉన్నాయట. వాటిపైనే ఇప్పుడు ఉపాధ్యాయ వర్గాల్లో.. ఉద్యోగ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. టీచర్లపై ప్రభుత్వాధినేత గుర్రుగా ఉన్నట్టు ఆ చర్చల్లో ఒకటి. కాదు కాదు.. పదోన్నతులు, బదిలీలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తే.. ఉపాధ్యాయ సంఘాలతో కొత్త ఇబ్బందులు వస్తాయని.. ఆ తలనొప్పులు అవసరమా అని జంకుతున్నట్టు మరో వాదన ప్రచారంలో ఉంది.

పునర్విభజన.. రేషనలైజేషన్‌ ఎప్పుడో..?

కొత్త జిల్లాల వారీగా ఉపాధ్యాయులను పునర్విభజన చేయాలి. రేషనలైజేషన్‌ చేపట్టాలి. ఆ తర్వాత బదిలీలు.. పదోన్నతుల్లో కదలిక వస్తుంది. ఇదంతా ఇప్పుడు జరిగే పనేనా అన్నది ఉపాధ్యాయుల ప్రశ్న. ప్రతి విషయంలో నాకేంటి అనే ఆలోచనలో ఎక్కువ మంది టీచర్ల ఉంటారన్నది ప్రభుత్వ వర్గాల అభిప్రాయం. ఈ ప్రాసెస్‌లో లేనిపోని కొర్రీలు పెడతారని అనుమానిస్తున్నారట. అదే అభిప్రాయం ప్రభుత్వ వర్గాల్లో ఉన్నట్టు టాక్‌. అందుకే ఈ అంశంలో ముందుకు అడుగు పడటం లేదని సమాచారం. మరి.. ఈ గ్రహణం ఇంకెన్నాళ్లు కొనసాగుతుందో చూడాలి.

-Advertisement-టీచర్ల పదోన్నతులు, బదిలీలకు గ్రహణం..!

Related Articles

Latest Articles