రాహుల్ తో భేటీ లో ఏం జరిగింది…?

తెలంగాణ కాంగ్రెస్ నాయకుల ఢిల్లీ టూర్‌లో అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటా? సీనియర్లు వేసిన స్కెచ్‌కి.. పార్టీ ఇంఛార్జ్‌ చెక్ పెట్టారా? దళిత దండోరా సభకు రాహుల్ వస్తా అన్నా.. వద్దని చెప్పింది ఎవరు? ఇంతకీ రాహుల్‌తో భేటీలో ఏం జరిగింది? లెట్స్‌ వాచ్‌!

రాహుల్‌తో వన్‌ టు వన్‌ భేటీ లేకపోవడంతో నేతలు ఉస్సూరు!

తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు చాలారోజుల తర్వాత రాహుల్ గాంధీ అపాయింట్‌మెంట్‌ దక్కింది. 45 నిమిషాలపాటు పీసీసీ కొత్త టీమ్‌ సమావేశమైంది. సీనియర్ నాయకులతో విడిగా వ్యక్తిగతంగా మాట్లాడేందుకు రాహుల్‌ టైమ్ ఇవ్వడంతో అనేక అంశాలను ప్రస్తావించడానికి ఓ ముఖ్యనేత చూశారట. పీసీసీ చీఫ్‌పై ఫిర్యాదులే అందులోని అజెండాగా తెలిసింది. కానీ.. విషయాన్ని పసిగట్టిన కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్‌ మాణిక్యం ఠాగూర్‌.. వ్యక్తిగత భేటీలకు చెక్‌ పెట్టారు. రాహుల్‌తో సమూహిక సమావేశం ఏర్పాటు చేయించారు. దీంతో ఎన్నో అనుకుని.. ఏదో ఆశించి హస్తిన వెళ్లిన నేతలకు ఏం చేయాలో పాలుపోలేదట. రాహుల్‌ చెప్పింది విని ఉసూరుమంటూ భేటీ నుంచి బయటకొచ్చారు. రాహుల్‌తో వన్‌ టు వన్‌ భేటీకి చివరి వరకు ట్రై చేసినా వీలు కాలేదని టాక్‌.

రాహుల్‌ గాంధీతో భేటీకి ఎమ్మెల్యే జగ్గారెడ్డి డుమ్మా!

రాహుల్ గాంధీ అపాయింట్‌మెంట్‌ రావడమే గొప్ప అనుకుంటే… పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి మాత్రం ఈ భేటీకి డుమ్మా కొట్టారు. తనకు చివరి నిమిషంలో తెలియడంతో ఢిల్లీ వెళ్లలేకపోయానని ఆయన చెబుతున్నారు. జగ్గారెడ్డి విమానం ఎక్కరు. రైలులో మాత్రమే వెళ్తారు. కానీ.. జగ్గారెడ్డి డుమ్మా వెనక ఇంకో ప్రచారం జరుగుతోంది. సింగిల్‌గా ఢిల్లీ వెళ్లి రాహుల్‌తో విడిగా భేటీకి చూస్తున్నారట. పైగా చాలా రోజులుగా ఆయన రాహుల్, సోనియా గాంధీల అపాయింట్‌మెంట్‌ అడుగుతున్నారు. హస్తిన వెళ్తే.. చెప్పాల్సిన అంశాలన్నీ చెప్పేసి రావాలన్నది ఆయన ఆలోచనగా ఉందట.

అందరూ కలిసి పనిచేయాలని సూచన!

ఇక రాహుల్‌తో ముఖ్యనేతల భేటీ విషయానికి వస్తే.. రాష్ట్రంలోని పరిస్థితులను ముగ్గురు నాయకులు ప్రస్తావించారట. రేవంత్‌, భట్టి.. మహేష్‌గౌడ్‌లు మాట్లాడినట్టు సమాచారం. పార్టీ అఫైర్స్‌ కమిటీ సమావేశానికి MPలు, సీనియర్‌ నాయకులను పిలవాలని జగ్గారెడ్డి డిమాండ్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. అదే విషయాన్ని వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ప్రజెంటేషన్‌లో రాహుల్‌కు వెల్లడించారట. పీసీసీ కమిటీతోపాటు పార్టీని నడిపించడానికి బయట చాలామంది సీనియర్లు ఉన్నారని చెప్పడంతో. బయట అంటే.. AICC ఆఫీస్‌ బయట అని రాహుల్‌ గాంధీ ప్రశ్నించారట. చివరకు అందరూ కలిసి పనిచేయాలని సూచించినట్టు సమాచారం.

గజ్వేల్‌ సభకు రాహుల్‌ రాకపై చర్చ!
పీసీసీ కమిటీల వివరాలు చెప్పడం లేదని మధుయాష్కీ గుర్రు!

దళిత గిరిజన దండోరా సభల వివరాలను రేవంత్‌రెడ్డి అందజేశారు. గజ్వేల్‌ సభకు రావాలని రాహుల్‌ను ఆయన ఆహ్వానించారు. అయితే హుజురాబాద్‌ ఉప ఎన్నిక దగ్గర పడే సమయంలో రాహుల్‌ వస్తే.. ఎలక్షన్‌ కోసమే వచ్చారనే అభిప్రాయం కలుగుతుందని.. ఫలితం అనుకూలంగా లేకపోతే.. ఆ ప్రభావం మరోలా ఉంటుందని సీనియర్లు వారించారట. పార్టీ చేపడుతున్న కార్యక్రమాలపై రాహుల్‌ సంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. ఇక్కడ భేటీ ముగిసిన తర్వాత ఇంఛార్జ్‌ ఠాగూర్‌తో సమావేశం అయ్యారు పార్టీ నాయకులు. పీసీసీ వేసిన కమిటీల వివరాలు తమకు చెప్పడం లేదని ప్రచార కమిటీ ఛైర్మన్‌ మధుయాష్కీ ఇంఛార్జ్‌ ఠాగూర్‌కు చెప్పారట. ఆ జాబితాను ఇవ్వాలని సూచించామని రేవంత్‌ బదులివ్వగా.. మల్లీ రిపీట్‌ కాకుండా చూసుకుంటామని మరో నాయకులు రిప్లయ్ ఇవ్వడంతో ఇష్యూ క్లోజ్‌ అయింది. కాకపోతే రాహుల్‌తో వన్‌ టు వన్‌ భేటీ జరగకపోవడంతోనే సీనియర్లు ఎక్కువ నిరాశ చెందినట్టు టాక్‌.

Related Articles

Latest Articles

-Advertisement-