సంకట స్థితిలో తెలంగాణ బీజేపీ నాయకులు…!

పార్టీలో ఉండేవారు ఎవరో.. వెళ్లిపోయేవారు ఎవరో తెలియడం లేదు. ఎందుకైనా మంచిదని ఆరా తీస్తుంటే లేనిపోని సమస్యలు. ప్రస్తుతం తెలంగాణ బీజేపీ ఈ సంకట స్థితినే ఎదుర్కొంటోంది. వేరేపార్టీల నుంచి బీజేపీలో చేరిన వారికి తాజా పరిణామాలు ఇబ్బందిగా మారాయట. పార్టీకి ఎవరో ఒకరు గుడ్‌బై చెప్పి ప్రతిసారీ పాతివ్రత్యం నిరూపించుకోవాలా అని ప్రశ్నిస్తున్నారట. అదేంటో ఈ స్టోరీలో చూద్దాం.

టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నేతలతో టచ్‌లో ఉన్న కమలనాథులు!

తెలంగాణ బీజేపీలో గత రెండు మూడేళ్లుగా చేరికలు భారీగానే జరిగాయి. గల్లీ నుంచి ఢిల్లీ వరకు కాషాయ తీర్థం పుచ్చుకున్నవారు ఎందరో. మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీల జాబితా ఎక్కువగానే ఉంది. ఇలా చేరిన వారిలో కొందరు బీజేపీలో కంఫర్ట్‌గానే ఉంటే.. మరికొందరు అసంతృప్తితో ఉన్నారట. ఈ మధ్య పలువురు నాయకులు పక్క చూపులు చూస్తుండటంతో కాషాయ శిబిరంలో అలజడి నెలకొంది. ఒకరిద్దరు మాజీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌తో టచ్‌లోకి వెళ్లారు. మరో ఇద్దరు మాజీ మంత్రులు టీఆర్‌ఎస్‌ నాయకులతో మాట్లాడుతున్నారట. దీంతో మిగతా వారి సంగతేంటి అనే చర్చ మొదలైంది.

పార్టీలో ఉన్న నాయకులకు ఫోన్‌ చేసి ఆరా తీస్తున్న బీజేపీ నేతలు!

వెళ్లిపోతున్నవారి విషయాన్ని పక్కన పెడితే.. పార్టీలోనే ఉన్న వారి గురించి ఆరా తీస్తున్నారట బీజేపీ నేతలు. వెళ్లిపోయేవారి జాబితాలో ఇంకా ఎవరెవరు ఉన్నారు? అసంతృప్తితో ఉన్న నాయకులు ఎవరు? అనేది ఆరా తీస్తున్నట్టు సమాచారం. కాంగ్రెస్‌ శిబిరం నుంచి అదే పనిగా గేలాలు విసురుతుండటంతో.. ఆ పార్టీతోపాటు.. టీడీపీ నుంచి వచ్చి కాషాయ కండువా కప్పుకొన్న వారిపై అనుమానాలు నెలకొన్నాయట. సోషల్ మీడియాతోపాటు మీడియాలోనూ పలువురి పేర్లు ప్రచారంలోకి వస్తుండటంతో కలవరపడుతున్న కమలనాథులు.. నేరుగా ఆయా నాయకులకు ఫోన్‌ చేసి వాకబు చేస్తున్నారట. ముందు కుశల ప్రశ్నలు వేసి.. తర్వాత మీరు బీజేపీనే ఉంటున్నారుగా.. వెళ్లడం లేదుగా అని అడుగుతున్నట్టు తెలుస్తోంది. ఏదో పార్టీ పెద్దలు ఫోన్‌ చేసి అడిగారంటే అర్థం ఉంటుంది. చివరకు పార్టీలో పరిచయం ఉన్న ప్రతిఒక్కరి నుంచీ ఇదే విధంగా ఫోన్‌ కాల్స్‌ వస్తున్నాయట. చివరకు మీడియా నుంచి ఫ్లోను వెల్లువెత్తుతున్నట్టు చెబుతున్నారు.

బీజేపీని వీడే ఆలోచన లేదని చెబుతున్నారా?
ఫోన్‌ చేసిన వ్యక్తి స్థాయిని భట్టి సమాధానం!

బీజేపీలో చేరినా కొందరు పార్టీకి దూరంగా ఉంటున్నారు. పార్టీ పదవులు రాలేదని కొందరు.. పార్టీలో తగిన గుర్తింపు లేదని ఇంకొందరు అసంతృప్తితో ఉన్నమాట వాస్తవం. అలాంటి వారిలో కొందరు బీజేపీని వీడే ఆలోచనలో లేరట. అయినప్పటికీ పదే పదే ఫోన్లు వస్తుండటంతో వారికి విసుగెత్తిపోతోందట. మీ తీరు చూస్తుంటే బలవంతంగా బయటకు గెంటేట్టు ఉన్నారే అని ఫోన్‌ చేసిన వారిని ఎదురు ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. అవతల ఫోన్‌లో మాట్లాడే నాయకుడి స్థాయిని భట్టి.. మేము బీజేపీలోనే ఉంటాం.. కంగారు పడొద్దు అని జవాబిస్తున్నారట.

పదే పదే ఆరా తీస్తుండటంపై బీజేపీలోని వలస నేతలు కలవరం

ఈ విషయంలో బీజేపీలో ఎవరి వాదన ఎలా ఉన్నా.. ఎవరో ఒకరు పార్టీ మారిన ప్రతిసారీ తమ పాతివ్రత్యం నిరూపించుకోవాల్సి వస్తోందని వలస నేతలు వాపోతున్నారట. ఏ ఘటన జరిగినా తమకు శీల పరీక్ష తప్పడం లేదని కొందరు లైట్‌ తీసుకుంటున్నారు. ఈ జంపింగ్ ప్రచారానికి దూరంగా ఉండేందుకు బలవంతంగా బీజేపీ సమావేశాలకు వస్తున్నారట. మొత్తానికి ఎంకిపెళ్లి సుబ్చిచావుకొచ్చినట్టుగా మారిందని వాపోతున్నారట బీజేపీలోని వలస నాయకులు.

-Advertisement-సంకట స్థితిలో తెలంగాణ బీజేపీ నాయకులు...!

Related Articles

Latest Articles