ఆసక్తిగా తాడిపత్రి రాజకీయం…

ఆ ఒక్క మాట వారికి బాగా కలిసి వచ్చింది. అధికారం పోదన్న ధీమా వాళ్లను నేలమీద నిలబడ నివ్వడం లేదు. అధికారం చేజారిపోదన్న నమ్మకం అందుకు కారణమా? ఎవరా నాయకులు? ఏంటా రాజకీయం? లెట్స్‌ వాచ్‌!

తాడిపత్రిలో గేర్‌ మార్చిన జేసీ!

మున్సిపల్‌ ఎన్నికల తర్వాత అనంతపురం జిల్లా తాడిపత్రి రాజకీయం మారింది. అసలే గరం గరంగా ఉండే ఇక్కడి పాలిటిక్స్ కొత్త పుంతలు తొక్కుతోంది. ఎమ్మెల్యే పెద్దారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి మధ్య ఉప్పు నిప్పులా ఉంటున్నాయి పరిణామాలు. నాటి మున్సిపల్ ఎన్నికల్లో తాడిపత్రిలో టీడీపీ జెండా ఎగిరింది. దీనికి కారణం జేసీ ఫ్యామిలీనే. అనూహ్యంగా ఆ ఎన్నికల్లో మున్సిపల్‌ ఛైర్మన్‌ అయ్యారు జేసీ ప్రభాకర్‌రెడ్డి. ఈ ఫలితం అధికారపార్టీ వర్గాలకు రుచించ లేదు. అప్పటి నుంచి వేయని ఎత్తులు లేవు. అయితే తాడిపత్రి మున్సిపాలిటీలో టీడీపీని పడగొట్టబోమని వైసీపీ చేసిన ప్రకటన జేసీకి అలుసుగా మారింది. ఆ తర్వాత ఆయన గేర్‌ మార్చి రాజకీయాన్ని రక్తి కటిస్టున్నారు. ఇప్పుడదే చర్చగా మారింది.

ఎమ్మెల్యే పెద్దారెడ్డి దూకుడు ప్రతికూలంగా మారిందా?

2019 ఎన్నికలకు ముందు తాడిపత్రిలో జేసీ కుటుంబానిదే హవా. ఆ ఎన్నికల్లో జేసీ ఓడిపోవడం.. పెద్దారెడ్డి ఎమ్మెల్యేగా గెలవడం.. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి రావడంతో ఆ ప్రభావం తాడిపత్రి రాజకీయాలపై పడింది. నేరుగా జేసీ ఇంటికి వెళ్లి ఎమ్మెల్యే పెద్దారెడ్డి సంచలనం సృష్టించారు. ఆ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చగా మారింది. ఆ ఎపిసోడ్‌లో ఎమ్మెల్యేకు పార్టీ పెద్దల నుంచి అక్షింతలు పడ్డాయని ప్రచారం జరిగింది. అది స్థానికంగా వైసీపీకి ప్రతికూలంగా మారిందని టాక్. ఆ ప్రభావం మున్సిపల్‌ ఎన్నికల్లో కనిపించిందని.. దానివల్లే టీడీపీ పైచెయ్యి సాధించిందని భావించారు.

మున్సిపాలిటీలో వైసీపీ కౌన్సిలర్లకు నో వాయిస్‌!

మున్సిపల్‌ ఎన్నికల సమయంలో జేసీ ప్రభాకర్‌రెడ్డి తొడకొట్టి మీసం మెలి తిప్పారు. తాడిపత్రి మున్సిపాలిటీలో ఎలా గెలుస్తావో చూద్దాం రా అని ఎమ్మెల్యేకు సవాల్‌ విసిరారు. చెప్పినట్టుగానే మున్సిపాలిటీలో పాగా వేసింది జేసీ కుటుంబం. అప్పటి నుంచి పురపాలక సంఘంలో వైసీపీ డమ్మీ అయిపోయింది. వైస్‌ ఛైర్మన్‌ మొదలుకొని.. కోఆప్షన్‌ సభ్యుల ఎన్నికల్లోనూ జేసీ పైచెయ్యి సాధించారు. పైగా తాడిపత్రి మున్సిపాలిటీలో టీడీపీ పాలకవర్గాన్ని కూల్చబోమన్న ప్రకటన జేసీకి అలుసుగా మారి మరింత దూకుడు పెంచారు. ప్రస్తుతం మున్సిపల్‌ సమావేశంలో ఛైర్మన్‌ చెప్పిందే వేదం. అలాగే వైసీపీ కౌన్సిలర్లు మాట్లాడేందుకు మైక్‌ కూడా దొరకడం లేదట. రాష్ట్రంలో టీడీపీ వాయిస్‌ లేకపోతే.. తాడిపత్రిలో వైసీపీకి వాయిస్‌ లేకుండా చేశారని ప్రచారం జరుగుతోంది.

ఆసక్తిగా ఉద్ధండుల మధ్య రాజకీయం!

2019 ఎన్నికల్లో జరిగిన పొరపాట్లకు తావివ్వకుండా.. పూర్తిస్థాయిలో పట్టు బిగిస్తున్నారు జేసీ. ఇదే సమయంలో ఎమ్మెల్యే పెద్దారెడ్డి కూడా అక్రమ కట్టడాల కూల్చివేతలు, ఆలయ కమిటీలలో మార్పుల పేరుతో కౌంటర్‌ అటాక్‌లు చేస్తున్నారు. ఇద్దరు ఉద్ధండుల మధ్య జరుగుతున్న రాజకీయం కావడంతో.. నిత్యం టెన్షనే. ఎప్పుడేం జరుగుతుందో తెలియడం లేదట. అందుకే వచ్చే రెండున్నరేళ్లూ తాడిపత్రి హాట్ హాట్‌గా ఉంటుందని లెక్కలేసుకుంటున్నాయి రెండు శిబిరాలు.

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-