మేనమామ.. మేనల్లుడు వరస అయినా తీవ్రస్థాయిలో విమర్శలు !

రాజకీయాల్లో విమర్శలు కామన్‌. కొందరు శ్రుతిమించి మాటల తూటాలు పేలుస్తారు. ఇంకొందరు హద్దేలేదన్నట్టుగా వాగ్భాణాలు సంధిస్తారు. ఈ విషయంలో ఆ మామా అలుళ్లు ఆరితేరిన వారే. కాకపోతే అల్లుడు దూకుడుగా వెళ్తుంటే.. మామా స్పీడ్‌ తగ్గించారట. దాంతో మామకు ఏమైంది అన్న ప్రశ్నలు మొదలయ్యాయి. వారెవరో ఈస్టోరీలో చూద్దాం.

2014 నుంచి ఇద్దరి మధ్యా తీవ్రస్థాయిలో మాటల యుద్ధం

శ్రీకాకుళం జిల్లాలో ఫ్యామిలీ పాలిటిక్స్‌కు కేరాఫ్ అడ్రసైన ఆమదాలవలసలో.. మామా అల్లుళ్ల మాటల యుద్ధం పీక్స్‌కు చేరుకున్న సందర్భాలు అనేకం. స్పీకర్‌ తమ్మినేని సీతారాం.. టీడీపీ మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్‌లు.. ఏ కార్యక్రమానికి వెళ్లినా.. విమర్శలకు రాజకీయ వేదిగా మార్చేసుకుంటున్నారు. 2014 ఎన్నికల్లో కూన రవి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. నాడు మేనమామైన తమ్మినేనిని ఓడించారు. ఆ ఐదేళ్లూ ఇద్దరి మధ్య భౌతిక ఘర్షణ ఒక్కటే తక్కువ. ఓ రేంజ్‌లో మాటల యుద్ధం సాగింది. 2019 ఎన్నికల్లో సీన్ రివర్స్. అల్లుడు ఓడిపోతే.. మామ సీతారాం గెలిచి స్పీకర్‌ అయ్యారు. పదవులు మారినా.. రాజకీయ వైరం తగ్గలేదు. అదే దూకుడు.. అవే మాటలు.

నియోజకవర్గంలో తిరుగుతారు.. తిట్టుకుంటారు!

స్పీకరైన కొత్తలో తమ్మినేని కొంత సంయమనం పాటించినా.. పంచాయతీ ఎన్నికల తర్వాత ఇద్దరి మధ్య విమర్శల వేడి గతంలోలా తారాస్థాయికి చేరుకుంది. నువ్వొకటంటే నేను రెండంటా అని నియోజకవర్గం మొత్తం తిరుగుతూ.. ఓ రేంజ్‌లో తిట్టుకుంటున్నారు. నిన్న మొన్నటి వరకు తమ్మినేనిని మాత్రమే టార్గెట్‌ చేసిన కూన రవి.. ఈ మధ్య తమ్మినేని కుమారుడు చిరంజీవి నాగ్‌ని సైతం లక్ష్యంగా చేసుకుంటున్నారు. రేంజ్‌ తగ్గితే బాగోదని అనుకున్నారో ఏమో చిరంజీవి నాగ్‌ కూడా నోటికి బాగానే పనిచెబుతున్నారు.

కూన రవిపై పరోక్ష విమర్శలు చేస్తోన్న మేనమామ!

ఇటీవల ఆమదాలవలసలో కూన రవి విమర్శల ముందు తండ్రీ కొడుకులిద్దరూ తేలిపోతున్నట్టు చర్చ జరుగుతోంది. బూర్జ మండలంలో మంచినీటి కుళాయిల దగ్గర జరిగిన దాడిపై తమ్మినేని మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు రవి. మాటలకు గట్టిగానే కౌంటర్‌ ఇచ్చారు సభాపతి. తమ్మినేని లేకపోతే కూన రవి ఎక్కడి వాడో తెలుసుకోవాలంటూ ఒకింత ఆవేశంగానే ప్రశ్నించారు. 30 ఏళ్లపాటు ఆమదాలవలకు ఎమ్మెల్యేగా ఉంటానని మిడిసిపడి ఎక్కడ పడ్డావో గుర్తించాలని సెటైర్లు వేశారు. అయితే ఇక్కడో గమ్మత్తు ఉంది. టీడీపీ అధినేత చంద్రబాబును సైతం తన మాటలతో ఓ ఆటాడుకునే తమ్మినేని.. మేనల్లుడు కూన రవిని మాత్రం డైరెక్ట్‌గా కాకుండా పరోక్షంగా విమర్శలు చేశారు. దానిపైనే ఇప్పుడు చర్చ జరుగుతోంది.

రవిని నేరుగా ఎందుకు అటాక్‌ చేయడం లేదు?

తమ్మినేనికి ఏమైంది? రవిని నేరుగా ఎందుకు అటాక్‌ చేయడం లేదు? పరోక్ష విమర్శలతో ఎందుకు సరిపెడుతున్నారని.. పార్టీ శ్రేణుల మెదళ్లకు బోల్డంత పని పెడుతోంది తాజా ఎపిసోడ్‌. అల్లుడి డైలాగుల ముందు మేనమామ తేలిపోతున్నారేంటి అని చెవులు కొరుక్కునే వాళ్లూ ఉన్నారు. కారణం ఏదైనా.. ఫైర్‌ బ్రాండ్‌ మామ.. ఆటంబాంబులాంటి అల్లుడు చెవిలో జోరీగలా మారాడన్న టాక్‌ ఆమదాలవలసలో జోరుగా నడుస్తోంది. మరి.. రానున్నరోజుల్లోనూ తమ్మినేని ఇలాగే ఉంటారో.. వైఖరి మార్చుకుంటారో చూడాలి.


-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-