శ్రీకాకుళం జిల్లా పలాస టీడీపీలో కొత్త చర్చ…

ఎన్నికల్లో ఓటమి తర్వాత నియోజకవర్గంపై శీతకన్ను వేశారు ఒకరు. పార్టీ బలోపేతం కోసం అక్కడ గేర్‌ మార్చారు ఇంకొకరు. అదే అక్కడ కొత్త చర్చకు దారితీసింది. నాయకత్వాన్ని మార్చేస్తున్నట్టు ప్రచారం జరిగింది. తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయని అనుకున్నారో ఏమో… అంతా కలిసి ఐక్యతా రాగం ఆలపించారు. మరి… కేడర్‌కు క్లారిటీ వచ్చినట్టేనా? టీడీపీలో చర్చకు దారితీసిన ఆ ఎపిసోడ్‌ను ఇప్పుడు చూద్దాం.

పలాసపై ఎంపీ రామ్మోహన్‌నాయుడు స్పెషల్‌ ఫోకస్‌!

శ్రీకాకుళం జిల్లా పలాస. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమి.. తర్వాత తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన సీదిరి అప్పలరాజు మంత్రి కావడం.. ఇలా అనేక అంశాలలో ఇక్కడి రాజకీయం వాడీవేడీగా ఉంటోంది. ఆ ఎన్నికల్లో టీడీపీ ఓడిన తర్వాత గౌతు శివాజీ సోంపేటకు, గౌతు శిరీష విశాఖకు మకాం మార్చేశారు. పార్టీ ముఖ్యకార్యక్రమాలకు శిరీష, శివాజీలు వస్తూ పోతూ ఉన్నా.. టీడీపీ కేడర్‌కు సరైన అండ లేకుండా పోయింది. ఈ సమయంలో పలాసపై స్పెషల్‌ ఫోకస్‌ పెట్టారు ఎంపీ రామ్మోహన్‌నాయుడు. మంత్రి అప్పలరాజు లక్ష్యంగా రాజకీయ వ్యూహరచన చేశారు. గౌతు లచ్చన్న విగ్రహం దగ్గర నుంచి మున్సిపల్‌ ఎన్నికల వరకు టీడీపీ వర్సెస్‌ వైసీపీ అన్నట్టుగా పలాస సలసలా కాగింది.

గౌతు కుటుంబాన్ని తప్పించారని ప్రచారం!

పలాసలో ఎంపీ రామ్మోహన్‌ నాయుడు ఎక్కువ ఫోకస్‌ పెట్టడంతో స్థానిక టీడీపీ, రాజకీయ వర్గాల్లో కొత్త చర్చ మొదలైంది. గౌతు కుటుంబాన్ని తప్పించి.. పలాసలో కింజరాపు ఫ్యామిలీ పాగా వేస్తుందనే ఊహాగానాలు స్టార్ట్‌ అయ్యాయి. నాయకత్వ మార్పుపై జోరుగానే చర్చ జరిగింది. ఈ విషయాన్ని ఆ నోటా.. ఈ నోటా శిరీషతోపాటు ఎంపీ రామ్మోహన్‌నాయుడు చెవిలో పడ్డాయి. వారు ఉలిక్కి పడ్డారట. కొండ నాలుక్కి మందు వేయబోతే ఉన్న నాలుక ఊడిపోయేలా ఉందని గ్రహించి రూమర్స్‌కు చెక్‌ పెట్టే పనిలో పడ్డారు.

రూమర్స్‌కు చెక్‌ పెట్టేందుకు పలాస వచ్చిన టీడీపీ సీనియర్లు

వన్‌ ఫైన్‌ మార్నింగ్‌ టీడీపీ పెద్దలంతా కలిసి పలాసలో వాలిపోయారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, జిల్లా టీడీపీ చీఫ్‌ కూన రవికుమార్‌, ఎంపీ రామ్మోహన్‌నాయుడు, పలాస టీడీపీ ఇంచార్జ్‌ గౌతు శిరీష అంతాకలిసి మండల టీడీపీ నాయకులతో ఓ మీటింగ్‌ పెట్టారు. పలాసలో నాయకత్వ మార్పు లేదని.. శిరిషే పార్టీని లీడ్‌ చేస్తారని క్లారిటీ ఇచ్చారట. టీడీపీలో యువ నాయకత్వానికి ప్రాధాన్యం ఇస్తున్నామని ప్రకటించి.. పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీతోపాటు మూడు మండలాల్లో సమన్వయం చేసే బాధ్యతలను యువకులకు అప్పగిస్తూ.. అప్పటికప్పుడు కమిటీలు ప్రకటించారు.

నాయకత్వ మార్పు లేదని కేడర్‌కు క్లారిటీ ఇచ్చారు!

వజ్రపుకొత్తూరు, మందస మండలాల్లో సీనియర్లకు కమిటీలో చోటు కల్పించి.. ఇన్నాళ్లూ అయ్యిందేదో అయ్యింది.. ఇకపై ఎలాంటి గొడవలు వద్దు.. ముఖ్యంగా ఎవరూ అపోహలు పెట్టుకోవద్దు.. నాయకత్వ మార్పుపై ఎలాంటి పుకార్లను నమ్మొద్దు అని ఒకటికి రెండుసార్లు చెప్పారట లీడర్లు. గౌతు లచ్చన్న విగ్రహం వివాదం.. మున్సిపల్‌ ఎన్నికల తర్వాత టీడీపీ సీనియర్లు మూకుమ్మడిగా పలాస వచ్చి క్లారిటీ ఇవ్వడంతో ఆశ్చర్యపోవడం కేడర్‌ వంతు అయ్యింది. మొత్తానికి రూమర్స్‌ నేతలను కలవర పెడితే.. పార్టీకి మంచే చేసిందని కేడర్‌ ఖుషీ అయిన పరిస్థితి. మరి.. రానున్న రోజుల్లో లోకల్‌ పాలిటిక్స్‌ను ఎదుర్కోవడానికి కూడా ఇలా ఐక్యంగా కదులుతారో లేదో చూడాలి.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-