స్పీకర్ తమ్మినేని స్పీడ్ కు బ్రేకులు వేస్తున్న వైరి పక్షాలు

చేతిలో పెద్దపదవి ఉంది. నియోజకవర్గంలో ఆయన చెప్పిందే వేదం. కానీ.. ఆయన స్పీడ్‌కు బ్రేక్‌లు వేస్తున్నాయి వైరిపక్షాలు. ఇదేం తలపోటు అని అనుకుంటున్న సమయంలోనే సొంత పార్టీ కేడర్‌ నుంచి చికాకులు పెరిగాయట. ఇదే అక్కడ హాట్ టాపిక్‌. ఆయన ఎవరో.. ఆ శిరోభారాలేంటో ఇప్పుడు చూద్దాం.

తమ్మినేని కొబ్బరికాయ కొట్టగానే స్టే తెస్తున్నారా?

శ్రీకాకుళం జిల్లాలో ఫ్యామిలీ పాలిటిక్స్‌కు కేరాఫ్ అడ్రస్ అయిన ఆమదాలవలసలో ఇప్పుడు కొత్త తరహా రాజకీయాలు మొదలయ్యాయి. స్థానిక ఎమ్మెల్యే, స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌కు తలనొప్పులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయట. రోజూ నియోజకవర్గంలో ఏదో ఒక కార్యక్రమాన్ని చేపడుతూ కార్యకర్తలకు ,ప్రజలకు అందుబాటులో ఉంటున్నా.. అభివృద్ధి కార్యక్రమాల్లో మాత్రం ఆయనకు గట్టిగానే అడ్డుపడుతున్నారు. రైతు భరోసా కేంద్రాలు, సచివాలయాలు, వెల్ నెస్ కేంద్రాలు అంటూ శంకుస్థాపనలు చేస్తున్న తమ్మినేనికి.. కోర్టు స్టేలతో బ్రేకులు వేస్తున్నారు. డెవలప్‌మెంట్‌ పనులకు కొబ్బరికాయ కొట్టి వెళ్లగానే స్టే ఆర్డర్స్‌ తీసుకొచ్చేస్తున్నారట.

తమ్మినేని రిక్వస్ట్‌ చేసినా కోర్టుకెళ్లడం ఆగడం లేదా?

కొంతకాలంగా కోర్టు వ్యవహారాలు తమ్మినేనికి తలనొప్పిగా మారాయి. అందుకే ఆ మధ్య పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన.. అభివృద్ధికి ఎవరైనా అడ్డుపడితే చూస్తూ ఊరుకోబోనని వార్నింగ్‌ ఇచ్చారు. అయినప్పటికీ స్టేలకు బ్రేక్‌ పడలేదు. దీంతో విసిగిపోయిన ఆయన.. ఇదేం రాజకీయం.. ఎన్నికలప్పుడు పాలిటిక్స్‌ చేసుకుందాం.. ఇప్పుడు అభివృద్ధిని జరగనివ్వాలని రిక్వస్ట్‌లు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ.. ప్రత్యర్థులు మాత్రం స్టే ఉత్తర్వులు తెచ్చే విషయంలో వెనక్కి తగ్గడం లేదు.

కులం పేరుతో సర్పంచ్‌ను దూషించిన సొంత పార్టీ నేతలు?

ఈ స్టే సమస్యల నుంచి ఎలా బయటపడాలా అని ఆలోచిస్తున్న సమయంలోనే తమ్మినేనికి సొంత పార్టీ శ్రేణులతోనూ శిరోభారం మొదలైందట. పొందూరు మండలంలో ఓ గ్రామ సర్పంచ్‌ భర్త సచివాలయ సిబ్బంది నోరు పారేసుకున్నారు. దాంతో సచివాలయ సిబ్బంది అంతా రోడ్డెక్కి నిరసన తెలిపారు. దీనిపై చర్చ జరుగుతుండగానే.. పొందూరు మహిళా సర్పంచ్‌పై వైసీపీ నేతలే కులం పేరుతో దూషించడంతో ఇంకో కుంపటి రాజుకుంది.

తమ్మినేనికి చికాకు పెడుతున్న కేడర్‌ తీరు!

బాధిత మహిళా సర్పంచ్‌ ఇచ్చిన ఫిర్యాదును పోలీసులు తీసుకోలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇది కాస్తా రచ్చ రచ్చగా మారింది. పార్టీలో రెండు వర్గాల మధ్య రాజీకి వైసీపీ నేతలు దృష్టి పెట్టారట. ఈ విధంగా కేడర్‌ నుంచే కొత్త చికాకులు వస్తుండటంతో తమ్మినేనికి ఏం చేయాలో పాలుపోవడం లేదట. ఒకవైపు వైరిపక్షాలు.. ఇంకోవైపు పార్టీలో కేడర్‌ మధ్య వస్తున్న తగాదాలు శిరోభారంగా మారినట్టు టాక్‌. ప్రస్తుతం ఆమదాలవలసలోని స్పీకర్‌ క్యాంప్‌ ఆఫీస్‌లో ఇదే చర్చ. ప్రత్యర్థి పార్టీలపై పదునైనా రాజకీయ విమర్శలు చేస్తున్నా.. లోకల్‌గా ఎదురవుతున్న ఇబ్బందులు మాత్రం తమ్మినేనికి కునుకు లేకుండా చేస్తున్నాయని ప్రచారం జరుగుతోంది. మరి.. ఈ సమస్యలను ఏవిధంగా అధిగమిస్తారో చూడాలి.

Related Articles

Latest Articles

-Advertisement-