సత్యవేడు నియోజకవర్గంలో వైసీపీ పరిస్థితేంటి..?

నేతలు ఒకవైపు …కేడర్ మరోవైపు. ఇక ఎమ్మెల్యేదైతే అసలు ఏ దారో తెలియదు. ఇది అ నియోజక వర్గంలో అధికారపార్టీ పరిస్థితిపై జరుగుతున్న చర్చ. అధికారంలో ఉన్నా, ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు ఉండటంతో అ నియోజకవర్గం హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ అక్కడ ఏం జరుగుతోంది?

చిత్తూరు జిల్లా సత్యవేడు నియోజక వర్గం అధికార వైసీపీలో పెద్ద చర్చకు కారణంగా మారింది. ఇక్కడ 2014 లో ఆదిమూలం పోటీచేసి ఓడిపోయారు. అయినా అధిష్ఠానం 2019 ఎన్నికలలోనూ అవకాశం ఇచ్చింది. జిల్లాలోనే అత్యధికంగా 45 వేలకుపైగా మెజారిటీ గెలిచారు. పార్టీసైతం అధికారంలోకి వచ్చింది. కానీ అక్కడ పార్టీ పరిస్థితి మాత్రం రోజురోజుకు దిగజారిపోతుందనే ప్రచారం జిల్లా పొలిటికల్‌ సర్కిల్స్ జోరుగా సాగుతోంది. పంచాయతీ ఎన్నికల నాటికే పూర్తిగా కంట్రోల్ తప్పిందని లోకల్ కేడర్ కోడై కూస్తోంది.

పార్టీ పదవుల కోసం, నామినేటెడ్ పదవుల కోసం నియోజకవర్గంలో మండలాల్లో నాయకుల మధ్య వర్గ పోరు పీక్స్ కి చేరిందంటున్నారు. ఎంపీపీ పదవికోసం ఎంపీటీసీ అభ్యర్థులు వర్గాలుగా విడిపోయారని సమాచారం. ఇన్ని జరుగుతున్నా, ఎమ్మెల్యే ఆదిమూలం మాత్రం ఉన్నా లేనట్లుగానే వ్యవహరిస్తూన్నారట. కనీసం ప్రభుత్వ పథకాల అమల్లోను ఎమ్మెల్యే యాక్టివ్ గా ఉండటం లేదట. ఎమ్మెల్యేని జనం కలవాలంటేనే పెద్ద టాస్క్‌ గా మారిందట. అయన్ని కలవాలంటే పుత్తూరు పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందంటున్నారు.

ఇక నియోజకవర్గంలో సురుట్టుపల్లి దేవస్థానంలో చైర్మన్, సభ్యుల వ్యవహారం తీవ్ర చర్చకు కారణమైంది. ఎమ్మెల్యే వర్గం, మంత్రి వర్గం గొడవలకు దిగారు. నియోజకవర్గంలోని మండలాల్లో పార్టీ అధ్యక్షుల మార్పు చేయాలని కేడర్ ఎమ్మెల్యేపై ఒత్తిడి తెస్తున్నారట. ఎమ్మెల్యే కంటే… నియోజకవర్గంలో మంత్రి పెద్దిరెడ్డి అనుచరులు …డిప్యూటీ సిఎం నారాయణ స్వామి అనుచరుల పెత్తనం ఎక్కువగా సాగుతోందని ఎమ్మెల్యే వర్గం గుర్రుగా ఉందని టాక్. ఈ పరిణామాల మధ్య కార్యకర్తలు నలిగిపోతున్నారని, సత్యవేడు, వరదయ్యపాళెం, పిచ్చటూరు, బుచ్చి నాయుడు కండ్రిగలలో అయితే ఈ గోడవలు పీక్స్ లో ఉన్నాయట. ఆ ఎఫెక్ట్ తిరుపతి ఉప ఎన్నికల సమయంలోను కనిపించిందని, దీని కారణంగానే సత్యవేడు నుండి ఎంపీకి ఆశించిన స్థాయిలో మెజారిటీ రాలేదని టాక్. ప్రభుత్వ పథకాలను, అభివృద్ది కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకొని పోవాల్సిన నేతలు.. ఎవరి స్వలాభం కోసం వారు అసలు బాధ్యతను మరిచి ప్రవర్తిస్తున్నారట. ఈ వర్గాల గొడవలు చూసిన ఎమ్మెల్యే సైతం తనకెందుకని సైలెంట్ గా ఉంటున్నారని నియోజకవర్గ ద్వితీయ శ్రేణి నేతలు జిల్లా పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. చాలామంది నాయకులు నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కి చెప్పినా ప్రయోజనం లేకపోగా ఇంకా ఎక్కువ అవడం కొసమెరుపు అంటున్నారు. జిల్లా నేతల్లో, కేడర్ లోను అక్కడ అసలు ఏం జరుగుతుందనే చర్చ జోరుగానే సాగుతోంది. మరి సత్యవేడులో పార్టీని ఎవరు ఎలా గాడిలో పెడతారో అనేది ఆసక్తికరంగా మారింది.

Related Articles

Latest Articles

-Advertisement-