ఆసక్తిగా రామచంద్రపురం వైసీపీ రాజకీయం…

కొత్త ఎమ్మెల్సీల ఎంపిక తర్వాత ఆ నియోజకవర్గ వైసీపీలో వర్గపోరుకు మరోసారి తెరలేచింది. ఒకే ప్రాంతానికి చెందిన ముగ్గురు నేతలు కీలక పదవుల్లో ఉండటంతో రాజకీయం మూడుముక్కలాటలా మారిందా?. వారసులను రంగంలోకి దించేలా ఒకే బరిపై ముగ్గురు గురిపెట్టారా?. వారేవరో ఈ స్టోరీలో చూద్దాం.

ముగ్గురు నేతలు మూడు కీలకపదవుల్లో ఉన్నారు

తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. స్థానిక ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మంత్రిగా ఉన్నారు. ఇదే ప్రాంతానికి చెందిన మరో కీలకనేత పిల్లి సుభాష్‌ చంద్రబోసు రాజ్యసభ సభ్యుడు. ఇంకో ముఖ్యనేత తోట త్రిమూర్తులు ఇటీవలే ఎమ్మెల్సీ అయ్యారు. రాష్ట్రంలో ఏ నియోజకవర్గ వైసీపీలో లేనట్టుగా ఇక్కడే మూడు కీలకమైన పదవుల్లో ఉన్న ముగ్గురు నేతలు తమ రాజకీయ వ్యవహారాలలు నడుపుతున్నారు.

వైసీపీలోకి వచ్చిన తక్కువ సమయంలోనే ఎమ్మెల్సీగా తోట

తోట త్రిమూర్తులు మండపేట వైసీపీ ఇంఛార్జ్‌గా కొనసాగుతూ ఎమ్మెల్సీగా నామినేట్ అయ్యారు. గతంలో టీడీపీ, కాంగ్రెస్‌, ప్రజారాజ్యం పార్టీలలో ఉన్న ఆయన .. 2019 ఎన్నికల తర్వాత వైసీపీలో చేరారు. తక్కువ సమయంలోనే ఎమ్మెల్సీ పదవిని దక్కించుకుని జిల్లా రాజకీయాల్లో మరోసారి వెలుగులోకి వచ్చారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా తోట త్రిమూర్తులు పేరు ప్రతిపాదించిన సమయంలో ఆయనపై దళితుల శిరోముండనం కేసు ఉందని రాజ్‌భవన్‌కు ఫిర్యాదు వెళ్లింది. రెండు రోజులపాటు రాజకీయ చర్చకు దారితీసింది. చివరకు సీఎం జగన్ భేటీ తర్వాత తోట త్రిమూర్తులు సహా నలుగురు పేర్లకు గవర్నర్ ఆమోద ముద్ర వేశారు.

రామచంద్రపురంలో తోట తనయుడు యాక్టివ్‌

తోట త్రిమూర్తులకు ఎమ్మెల్సీ ఇవ్వటాన్ని ఆయన చిరకాల రాజకీయ ప్రత్యర్థి పిల్లి సుభాష్ చంద్రబోస్ తెరవెనక వ్యతిరేకించడం వల్లే గవర్నర్‌కు ఫిర్యాదు వెళ్లిందనే ప్రచారం జరిగింది. అయితే సీఎం జగన్ సంపూర్ణ ఆశీసులు ఉండటంతో.. తోటను పదవి వరించింది. కాపు సామాజికవర్గంలో బలమైన నేతగా గుర్తింపు ఉండటం.. టీడీపీ కంచుకోటగా ఉన్న మండపేట మున్సిపాలిటీలో వైసీపీ జెండా ఎగురవేయటంతో తోటకు కలిసొచ్చింది. త్వరలో కేబినెట్‌లోనూ చోటు దక్కుతుందని ఆయన వర్గం ఆశిస్తోందట. అయితే మండపేట వైసీపీ ఇంఛార్జ్‌గా ఉన్నా.. ఎమ్మెల్సీ హోదాలో తన సొంత నియోజకవర్గం రామచంద్రపురంపై తోట ఎలాంటి ఫోకస్ పెడతారనేది ఆసక్తిగా మారింది. ఇప్పటికే తోట త్రిమూర్తులు తన రాజకీయ వారుసుడిగా కుమారుడిని సొంత నియోజకవర్గంలో యాక్టివ్‌ చేశారు. సీఎం జగన్‌ను కలిసిన సందర్భంలోనూ తన కుమారుడు ఫోకస్ అయ్యేలా చూసుకుంటున్నారు. దీంతో రానున్న ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ సీటు తన కుమారుడికి దక్కేలా త్రిమూర్తులు గట్టి ప్రయత్నాలు చేస్తారనే అనుమానాలు ఉన్నాయట.

బోసు కుమారుడు కూడా టికెస్‌ రేస్‌లో ఉంటారా?

తాజా పరిణామాలతో తోట త్రిమూర్తులు చిరకాల ప్రత్యర్థి పిల్లి సుభాష్‌ చంద్రబోసు ఏం చేయబోతున్నారనేది పార్టీ వర్గాల్లో చర్చగా మారిందట. వాస్తవానికి తోట వైసీపీలోకి వచ్చిన సమయంలో ఎలాంటి అసమ్మతిని బయటపడనీయలేదు. అయితే కొద్ది నెలలకే దళితుల శిరోమండనం కేసును తెరపైకి తెచ్చి ఆయన్ని ఇరుకున పెట్టారు. పార్టీలోకి వచ్చిన తోట దూసుకుపోతున్న తరుణంలో బోసు సైతం వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తన రాజకీయ వారసుడిగా కుమారుడిని రామచంద్రపురం వైసీపీ టిక్కెట్ కోసం పోటీలో ఉంచుతారనే అంచనాలు ఉన్నాయట.

క్రియాశీలకంగా మంత్రి వేణు కుమారుడు

మంత్రి వేణు కుమారుడు సైతం రామచంద్రపురం రాజకీయాల్లో క్రియాశీలకంగా మారి తండ్రి వ్యవహారాలను చక్కబెడుతున్నారు. దీంతో రామచంద్రపురంలో ముగ్గురు కీలక నేతలు వచ్చే ఎన్నికల నాటికి తమ కుమారులకు పార్టీ టికెట్‌ ఇప్పించేందుకు పోటీ పడే పరిస్థితి కనిపిస్తోందట. దానికోసం వారసుల మధ్య టికెట్‌ రేస్‌ ఇప్పటి నుంచే మొదలైనా ఆశ్చర్యం లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.

-Advertisement-ఆసక్తిగా రామచంద్రపురం వైసీపీ రాజకీయం...

Related Articles

Latest Articles