గేర్‌ మార్చిన అచ్చెన్న, రామ్మోహన్‌ నాయుడు..!

నిన్న మొన్నటి వరకు కూల్‌ కూల్‌ అన్నారు. టైమ్‌ వచ్చేవరకు ఓపిక పట్టాలని ఓదార్చారు. ఏమైందో ఏమో.. ఉన్నట్టుండి కాలు దువ్వుతున్నారు బాబాయ్‌ అబ్బాయ్‌. అందరి లెక్కలు రాస్తున్నాం.. తిరిగి చెల్లిస్తాం అని వార్నింగ్‌లు ఇస్తున్నారట. ఎందుకు గేర్‌ మార్చారు? వాళ్ల రాసుకుంటున్న లెక్కలేంటి?

బాబాయ్‌, అబ్బాయ్‌లకు ఏమైందని తమ్ముళ్ల ప్రశ్న!

వైసీపీ గాలిలో కూడా 2019 ఎన్నికల్లో గెలిచి నిలిచారు కింజరాపు అచ్చెన్నాయుడు, రామ్మోహన్‌నాయుడు. టెక్కలి నుంచి అచ్చెన్న ఎమ్మెల్యేగా గెలిస్తే.. రామ్మోహన్‌నాయుడు శ్రీకాకుళం ఎంపీగా రెండోసారి గెలిచారు. కానీ.. టీడీపీ అధికారం కోల్పోవడంతో ఇద్దరికీ రాజకీయంగా ప్రతికూల పరిస్థితులు స్వాగతించాయి. ESI కేసులో అచ్చెన్న అరెస్ట్‌య్యారు. పంచాయతీ ఎన్నికల సమయంలో మరోసారి అరెస్ట్‌ కావడంతో దూకుడు తగ్గించారు అచ్చెన్నాయుడు. ఏపీ టీడీపీకి చీఫ్‌ అయినా.. మౌనంగా ఉండిపోయారు. ఎవరొచ్చినా.. సహనంగా ఉండాలని ఓదార్చి పంపేవారు. మనకూ టైమ్‌ వస్తుంది అప్పటి వరకు ఓపికగా ఉండాలని సూచించేవారు అచ్చెన్న. కేడర్‌కు ఇది అర్థం కాలేదు. అలాంటిది తాజాగా ఏపీ టీడీపీ చీఫ్‌లో వచ్చిన మార్పును చూసి తెలుగు తమ్ముళ్లు ఆశ్చర్యపోతున్నారు.

కోటబొమ్మాళి ధర్నాలో మాటల తూటాలు!

బాబాయ్‌ అరెస్ట్‌లతో అబ్బాయ్‌ రామ్మోహన్‌నాయుడు మొదట్లో సైలెంట్‌ అయ్యారు. కోవిడ్‌ టైమ్‌లో స్వీయ నియంత్రణ పాటిస్తూ.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలుకు లేఖలు రాస్తూ కాలక్షేపం చేసేశారు. పెద్దగా బయటకొచ్చింది లేదు. ఇప్పుడు అబ్బాయ్‌ కూడా పెట్రోల్‌, డీజిల్‌, నిత్యావసరాల ధరల పెరుగుదలను నిరసిస్తూ బాబాయ్‌తో కలిసి కోటబొమ్మాళిలో మాటల తూటాలు పేల్చారు. వాస్తవానికి టీడీపీ చేపట్టిన నిరసనల్లో ఇద్దరూ కలిసి పాల్గొన్నది లేదు. కానీ.. కోటబొమ్మాళి ధర్నాలో కలిసి మెరిశారు. టీడీపీ కేడర్‌ తమ కళ్లను కూడా నమ్మలేకపోయిందట.

అన్ని లెక్కలు రాస్తున్నామని వార్నింగ్!

కేడర్‌కు ధైర్యం చెబుతూ బాబాయ్‌, అబ్బాయ్‌లు చేసిన ప్రసంగాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. మొన్నటి వరకు తమ టైమ్‌ బాగోలేదని చెప్పుకొచ్చిన ఇద్దరిలో వచ్చిన మార్పుపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కోటబొమ్మాళిలో వారు చేసిన కామెంట్స్‌.. ఇచ్చిన వార్నింగ్స్‌ కూడా హాట్‌ టాపిక్‌గా మారాయి. టెక్కలిలో వ్యాపారస్తులను కొందరు లక్ష్యంగా చేసుకుని ఇబ్బంది పెడుతున్నారని.. అలాంటి వారు పద్ధతి మార్చుకోకపోతే టీడీపీ అధికారంలోకి వచ్చాక ఎవరూ కాపాడలేరని హెచ్చరించారు బాబాయ్‌, అబ్బాయ్‌లు. టీడీపీ కేడర్‌ను ఇబ్బంది పెడుతున్న పోలీసుల లెక్కల రాస్తున్నామని.. అధికారంలోకి వచ్చాక అన్నీ తిరిగి ఇస్తామని వార్నింగ్‌ ఇచ్చారు. ఈ కామెంట్స్ పార్టీ శ్రేణులను సైతం ఆశ్చర్యపరిచాయి.

కేసులంటే భయం పోయిందా?

కేసులంటే భయం పోయిందా? లేక కామ్‌గా ఉంటే పొలిటికల్‌గా నష్టం జరుగుతోందని భావించారో కానీ.. అచ్చెన్నకు ఏమైందని తమ్ముళ్లు ప్రశ్నించుకుంటున్నారట. మరి.. వచ్చే ఎన్నికల వరకు బాబాయ్‌ అబ్బాయ్‌లు ఇదే స్పీడ్‌తో ఉంటారో లేదో చూడాలి.

Related Articles

Latest Articles

-Advertisement-