కార్వీ స్కామ్‌లో బాధితులుగా తెలుగు రాష్ట్రాల ప్రముఖులు…?

కార్వీ స్కామ్‌ తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖులకు షాక్‌ ఇచ్చిందా? పెట్టుబడులు పెట్టిన వారు.. కక్కలేక మింగలేక ఆందోళన చెందుతున్నారా? ముందుకొచ్చి పోలీస్‌ కంప్లయింట్‌ ఇచ్చే పరిస్థితి కూడా లేదా? అధికార, రాజకీయవర్గాల్లో కార్వీపై జరుగుతున్న చర్చ ఏంటి?

కార్వీలో తెలుగు రాష్ట్రాల ప్రముఖుల పెట్టుబడులు!

కార్వీ కుంభకోణంలో CCS పోలీసులు తవ్వేకొద్దీ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సామాన్యుల పెట్టుబడులు ఎలా ఉన్నా.. తెలుగు రాష్ట్రాలకు చెందిన అనేకమంది ప్రముఖులు పార్థసారథిని చూసే కార్వీలో ఇన్వెస్ట్‌ చేశారు. వీరిలో ముఖ్యమైన రాజకీయ నేతలతోపాటు.. ఉభయ రాష్ట్రాలకు చెందిన సీనియర్‌, రిటైర్డ్‌ ఐపీఎస్‌, ఐఏఎస్‌ అధికారులు ఉన్నారట. తమ అక్రమ సంపాదనను కార్వీలో పెట్టుబడుల రూపంలో మళ్లించినట్టు సమాచారం. ఇప్పుడు స్కామ్ బయటపడటంతో తమ డబ్బులు తిరిగొస్తాయో లేదోనని వారు ఆందోళన చెందుతున్నారట.

అక్రమ సంపాదన కావడం వల్లే ఫిర్యాదు చేయడం లేదా?

ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేయడానికి బాధిత ప్రముఖులెవరూ ముందుకు రావడం లేదు. ఈ క్రమంలో వారి పెట్టుబడులపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. సక్రమ సంపాదనే అయితే.. చిల్లి గవ్వపోయినా.. ఊరుకోరు. కానీ.. ఇక్కడ పెట్టుబడిగా పెట్టిందంతా అక్రమ సంపాదన కావడంతో.. ఫిర్యాదులు చేస్తే లేనిపోని తలపోటులు వస్తాయని సైలెంట్ అయిపోయారట. స్కామ్‌ వెలుగు చూసినప్పటి నుంచి ఒకరినొకరు పలకరించుకుని.. బోరుమంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. కొందరు మాత్రం.. పరువు పోతుందనే ఆలోచనతో ఫిర్యాదు చేయడానికి వెనకంజ వేస్తున్నారట.

విచారణలో ప్రముఖుల పేర్లు బయటపడ్డాయా?

ఖాతాదారుల షేర్లను తనఖా పెట్టడం కార్వీ స్కామ్‌లో కీలకం. వీటిపై CCS ఫోకస్‌ పెట్టింది. ఈ మొత్తం వ్యవహారంలో 700 కోట్లు పూర్తిగా నష్టపోయినట్టుగా పార్థసారధి విచారణలో వెల్లడించినట్టు తెలుస్తోంది. ఆయన్ని కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించిన సమయంలోనే ప్రముఖల పేర్లు వెలుగులోకి వచ్చాయట. వారంతా పార్థసారథిని విశ్వసించి కోట్లు కుమ్మరించినట్టు తెలుస్తోంది. వారి నుంచి పోలీసులు సమాచారం తీసుకుంటారో లేదో కానీ.. విషయం తెలిసినప్పటి నుంచి ఆందోళనలో ఉన్నారట ఆ ప్రముఖులు.

ఇన్వెస్ట్‌ చేసిన పోలీసులు, నేతలు ఎవరు?

ముఖ్యంగా సీనియర్ పోలీస్ అధికారులు కూడా భారీగా పెట్టుబడులు పెట్టారని తెలియడంతో రెండు రాష్ట్రాల్లోని డిపార్ట్‌మెంట్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. వారెవరు.. వెనకాముందు ఆలోచించకుండా ఎలా ఇన్వెస్ట్‌ చేశారు అనేది కొందరు ఆరా తీస్తున్నారట. ఇక రాజకీయ నాయకులు ఎవరన్నది ఆసక్తి రేపుతోంది. మొత్తానికి సామాన్యులతోపాటు పేరున్న బడాబాబులను కూడా పార్థసారథి ఈజీగా బుట్టలో వేసుకున్నారని చర్చ జరుగుతోంది. మరి.. ఆ పేర్లు బయటకొస్తాయో లేదో చూడాలి.

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-