సీమ ప్రాజెక్టులపై లేఖరాసిన టీడీపీ ఎమ్మెల్యేలు యూటర్న్‌…!

ప్రకాశం జిల్లాకు అన్యాయం జరుగుతోందని లేఖలు రాసిన టీడీపీ ఎమ్మెల్యేలు ఎందుకు యూ టర్న్‌ తీసుకున్నారు? 24 గంటల్లో వారికి ఏమైంది? తడబడ్డారా.. తొందపాటుతో ఇరుకున పడ్డారా? ఏదో చేయబోతే.. ఇంకేదో అయ్యిందా?

సీమ ప్రాజెక్టులపై ప్రకాశం జిల్లా టీడీపీ ఎమ్మెల్యేల లేఖ

తెలుగు రాష్ట్రాల మధ్య ప్రస్తుతం నీటి యుద్ధం జరుగుతోంది. నీరే నిప్పుగా మారిన పరిస్థితి. రాజకీయంగా సున్నితమైన ఈ అంశంపై ఆచితూచి స్పందిస్తోంది టీడీపీ. ఇలాంటి సమయంలో ప్రకాశం జిల్లాకు చెందిన ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు రాసిన లేఖ సంచలనంగా మారింది. రాయలసీమలో చేపడుతున్న ప్రాజెక్టులు, కొత్త లిఫ్ట్‌ల వల్ల తమ పరిస్థితి ఏంటని లేఖలో ప్రభుత్వాన్ని నిలదీశారు ఎమ్మెల్యేలు బాల వీరాంజనేయస్వామి, గొట్టిపాటి రవి, ఏలూరి సాంబశివరావు. ఏపీ సర్కార్‌ చేపట్టిన రెండు ప్రాజెక్టులపై వారు అభ్యంతరాలు తెలియజేశారు.

24 గంటల తిరగకుండానే గొంతు సవరించిన టీడీపీ ఎమ్మెల్యేలు!
ఎమ్మెల్యేల లేఖకు టీడీపీ ఆమోదం ఉందా?
టీడీపీ ఎందుకు పెంట పెట్టుకుంది?

టీడీపీ ఎమ్మెల్యేల లేఖతో కొత్త అంశం తెరపైకి వచ్చింది. వారు లేవనెత్తి విషయాలు ఎలా ఉన్నా.. 24 గంటలు తిరక్కుండానే గొంతు సవరించుకున్నారు టీడీపీ ఎమ్మెల్యేలు. అదే ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. సీమ ప్రాజెక్టులకు తాము వ్యతిరేకం కాదంటూనే.. ప్రకాశం జిల్లా పరిస్థితి ఏంటన్నదే తమ ప్రశ్నగా చెప్పుకొచ్చారు. ముందుగా ప్రకాశం జిల్లా సంగతి తేల్చాలని డిమాండ్‌ చేశారు. ఈ వైఖరే ఇప్పుడు రాజకీయవర్గాల్లో చర్చగా మారింది. అసలు ఎమ్మెల్యేలు రాసిన లేఖకు టీడీపీ ఆమోదం ఉందా.. లేదా? లేఖ వచ్చిన 24 గంటల్లో ఏం జరిగింది? రాయలసీమ విషయంలో తెలుగుదేశం ఎందుకు పెంట పెట్టుకుంది? ఇలా రకరకాల ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

ఎమ్మెల్యేలు అత్యుత్సాహం ప్రదర్శించారా?
సీమ ప్రాజెక్టులపై అభ్యంతరాలు లేనప్పుడు లేఖ ఎందుకు?

అసలే ఏపీ, తెలంగాణ మధ్య రాయలసీమ ప్రాజెక్టులపై ఘర్షణ నెలకొంది. టీడీపీ ఎమ్మెల్యేల లేఖ చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లోనే ప్రాంతాల మధ్య ఘర్షణ వచ్చేలా ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంలో టీడీపీ రాజకీయంగా ఇంకేదైనా లెక్కలు వేసిందా? లేక ఎమ్మెల్యేలే అత్యుత్సాహం ప్రదర్శించారా అన్న అనుమానాలు ఉన్నాయి. 24 గంటల ముందు విడుదల చేసిన లేఖలో రాయలసీమ ప్రాజెక్టులపై అంతెత్తున లేచిన ఎమ్మెల్యేలు.. ఇప్పుడు ఆ ప్రాజెక్టులపై తమకెలాంటి అభ్యంతరాలు లేవని చెప్పారు. అభ్యంతరాలు లేనప్పుడు లేఖ రాయాల్సిన అవసరం ఏముంది? లేఖ ద్వారా ఏం చెప్పాలని అనుకున్నారు? ఒకవేళ ప్రకాశం జిల్లా గురించే వారి ఆవేదన అయితే.. దానిపైనే మాట్లాడాలి. టీడీపీ ఎమ్మెల్యేల తీరు అలా లేదన్నది విశ్లేషకుల అభిప్రాయం.

లేఖను ఎమ్మెల్యేలు సొంతంగానే రాశారా?

రాయలసీమ ప్రాజెక్టులు.. ప్రాంతాల వారీగా ఎవరికెన్ని నీళ్లు అన్నదానిపై ఏపీ ప్రభుత్వం స్పష్టంగా చెబుతోంది. అయినప్పటికీ లేఖ రాసి రచ్చ లేపారు. వైసీపీ, బీజేపీలకు టార్గెట్‌ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వానికి కొత్త ఆయుధాలు ఇచ్చారని అనుకుంటున్నారు. లేఖ ద్వారా ఏపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టి.. తమ బాధ చెప్పుకోవాలని ఎమ్మెల్యేలు భావించి ఉండొచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే లేఖను ఎమ్మెల్యేలు తమంతట తామే రాశారా? దాని వెనక ఇంకేదైనా ఉందా అన్న అనుమానాలు ఉన్నాయి. ఏది ఏమైనా తాజా లేఖాస్త్రం.. మారిన టీడీపీ ఎమ్మెల్యేల స్వరం.. సొంత పార్టీని కూడా ఇరుకున పెట్టే అవకాశాలు లేకపోలేదు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-