ఢిల్లీ టూర్‌ను గోప్యంగా ఉంచిన ప్రకాశంజిల్లా టీడీపీ నేతలు…!

వెలిగొండ ప్రాజెక్టును కేంద్ర గెజిట్‌లో చేర్చాలన్నది ప్రకాశం టీడీపీ నేతల డిమాండ్‌. ఇదే అంశంపై రెండు రాష్ట్రాల సీఎంలకు లేఖలు రాశారు. అక్కడితో ఆగితే బాగోదని అనుకున్నారో ఏమో సడెన్‌గా ఢిల్లీ వెళ్లారు. కాకపోతే హస్తిన పర్యటనను రహస్యంగా ఉంచడమే చర్చగా మారింది. ఎందుకు గోప్యత పాటించారు? ప్రకాశం టీడీపీ నేతలకు వచ్చిన ఇబ్బందేంటి?

ఢిల్లీ వెళ్లి కేంద్రమంత్రి షెకావత్‌ను కలిసిన ప్రకాశం జిల్లా టీడీపీ నేతలు!

ప్రకాశం జిల్లాలోని వెలిగొండ ప్రాజెక్టుపై ఆ జిల్లా టీడీపీ నేతలు కొన్నాళ్లుగా ఆందోళనలు చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను కేంద్రం గెజిట్‌లో చేర్చాలన్నది వారి డిమాండ్‌. ఇటీవల కేంద్రం వెల్లడించిన గెజిట్‌లో వెలిగొండను అనుమతి ఉన్న ప్రాజెక్టుగా గుర్తించలేదు. దీంతో ఆందోళన చేపట్టారు టీడీపీ నేతలు. తీవ్ర కరువు పీడిత ప్రాంతంగా మారుతున్న ప్రకాశం జిల్లాకు వెలిగొండ ప్రాజెక్టు ఆశాదీపమని చెబుతూ.. జరిగిన తప్పును సరిదిద్దాలని కోరుతూ KRMBతోపాటు తెలుగు రాష్ట్రాల సీఎంలు జగన్‌, కేసీఆర్‌లకు, కేంద్ర జలశక్తి మంత్రికి లేఖలు రాశారు. ఇదే అంశంపై ఢిల్లీ వెళ్లారు ప్రకాశం జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నేతలు. స్వయంగా జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. టీడీపీ నేతల ఢిల్లీ టూర్‌పైనే ఇప్పుడు రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతోంది.

హడావిడి లేకుండా సాగిపోయిన టీడీపీ ఢిల్లీ టూర్‌!

ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలు వెలిగొండపై మొదటి నుంచి వేగంగానే పావులు కదుపుతున్నారు. అయితే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రకాశం జిల్లాకు చెందిన ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు వ్యతిరేకించారు. కాకపోతే వెలిగొండ విషయంలో ప్రకాశం జిల్లా టీడీపీ నేతల ఢిల్లీ టూర్‌ చాలా సైలెంట్‌గా జరిగిపోయింది. మీడియాకు గానీ.. టీడీపీలోని ఇతర నాయకులకుగానీ ఎక్కడా సమాచారం ఇవ్వలేదు.

ముందుగా లీకైతే అవాంతరాలు వస్తాయని భయపడ్డారా?

సాధారణంగా ఇలాంటి పర్యటనలు ఉన్నప్పుడు ముందుగా మీడియాకు, పార్టీ వర్గాలకు తెలియజేస్తారు. మీడియాను వాడటంలో టీడీపీ రూటే సెపరేట్‌. అంచలంచెలుగా లీక్‌లు ఇస్తూ విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేసుకోవడంలో టీడీపీ స్టయిలే వేరు. అలాంటిది ఇంత ప్రాధాన్యం ఉన్న అంశంలో రెండో కంటికి తెలియకుండా కథ నడపడానికి కారణం వ్యూహం బెడిసికొట్టకుండా ఉండేందుకేనట. అందుకే టీడీపీ నేతలు కేంద్రమంత్రిని కలిసిన తర్వాతే దీనిపై బయటకు తెలిసింది. ఈ విధంగా పార్టీ నేతలు సైలెంట్‌గా ఢిల్లీ వెళ్లడంపై రకరకాలుగా చర్చ జరుగుతోంది. హస్తిన పర్యటనపై ముందుగానే తెలిస్తే మధ్యలోనే అవాంతరాలు వచ్చే అవకాశం ఉందని నేతలు భావించారట. వైసీపీ, బీజేపీ నాయకులు అడ్డుపడతారని అనుమానించారట. లీకైతే కేంద్రమంత్రి అపాయింట్‌మెంట్‌ రద్దయ్యే ప్రమాదం ఉందని లెక్కలు వేసుకున్నారట టీడీపీ నేతలు. టీడీపీలోని ముఖ్యులకు తప్ప ఢిల్లీ పర్యటన గురించి ఇంకెవరికీ తెలియకుండా జాగ్రత్త పడ్డారట ప్రకాశం నేతలు.

కేంద్రమంత్రిని కలవలేకపోతే విమర్శలొస్తాయని ఆందోళన?

2019 ఎన్నికల తరువాత ఇలా ఒక జిల్లా నుంచి టీడీపీ ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధుల బృందం డిల్లీ వెళ్లడం ఇదే మొదటిసారి. పైగా బేటీ కూడా కేంద్రమంత్రితో కావడంతో గోప్యంగా ఉంచారు. ఒకవేళ డిల్లీ బయలుదేరాక ఏదైనా కారణంతో కేంద్రమంత్రిని కలవలేకపోతే విమర్శలు వస్తాయని ఆందోళన చెందారట. మరి.. వెలిగొండపై టీడీపీ నేతలు చేపట్టిన ఈ రహస్య ఢిల్లీ టూర్‌ వారికి ఎంత వరకు వర్కవుట్‌ అవుతుందో చూడాలి.

Related Articles

Latest Articles

-Advertisement-