సీఎం కేసీఆర్‌తో పాటు ఢిల్లీ వెళ్లిన ముగ్గురు ఎమ్మెల్యేలు..!

సీఎం కేసీఆర్‌తోపాటు హస్తిన వెళ్లిన ఎమ్మెల్యేలు సంబరాల్లో ఉన్నారా? కీలక పదవులు దక్కుతాయని ఎమ్మెల్యేల అనుచరులు గాలిలో తేలిపోతున్నారా? ఇంతకీ ఢిల్లీలో జరిగిన చర్చలేంటి? నియోజకవర్గాల్లో నెలకొన్న హడావిడి ఏంటి? ఎవరా ఎమ్మెల్యేలు? లెట్స్‌ వాచ్‌..!

జడ్చర్ల, నారాయణపేట, దేవరకద్ర ఎమ్మెల్యేలపై చర్చ..!

ఉమ్మడి పాలమూరు జిల్లా టీఆర్‌ఎస్‌లో ప్రస్తుతం సంబరాల రాంబాబుల గురించి ఓ రేంజ్‌లో చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యేలతోపాటు.. వారి అనుచరులు ఊహాలోకాల్లో తేలిపోతున్నారట. మన టైమ్‌ వచ్చిందని.. ఇక పిలుపు రావడమే మిగిలిందని రోజులు లెక్క పెడుతున్నారట. ప్రస్తుతం వారి గురించి.. ఎమ్మెల్యే శిబిరాల్లో నెలకొన్న జోష్‌ గురించి ఎంత చెప్పినా తక్కువన్నది గులాబీ శిబిరంలో వినిపిస్తున్న మాట. వారెవరో కాదు..జడ్చర్ల ఎమ్మెల్యే, మాజీ మంత్రి లక్ష్మారెడ్డి.. నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి.

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కోసమే తీసుకెళ్లారా?

ఇటీవల సీఎం కేసీఆర్‌ ఢిల్లీ వెళ్తూ.. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, రాజేందర్‌రెడ్డి, వెంకటేశ్వరరెడ్డిలను వెంట తీసుకెళ్లారు. నాలుగు రోజులపాటు హస్తినలో ముఖ్యమంత్రితోపాటే వారు ఉన్నారు. తొలుత లక్ష్మారెడ్డి ప్రత్యేక విమానంలో సీఎంతోపాటు వెళ్లగా.. మర్నాడు సీఎం పిలుపు మేరకు దేవరకద్ర, నారాయణపేట ఎమ్మెల్యేలు ఢిల్లీ చేరుకున్నారు. వీరిని పిలవడం వెనక ప్రధాన ఉద్దేశం.. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం. ఈ ప్రాజెక్టుకు నిధులు, అనుమతులు జాప్యం లేకుండా ఇవ్వాలని.. త్వరిత గతిన పనులు పూర్తయ్యేందుకు సహకరించాలని కేంద్రమంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌తో జరిగిన భేటీలో సీఎం కేసీఆర్‌తోపాటు ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు వివరించారట.

పాలమూరులో టీఆర్ఎస్‌ పరిస్థితిపై చర్చించారా?

ఢిల్లీ టూర్‌లో సమయం చిక్కినప్పుడు సీఎం రాష్ట్ర రాజకీయాలపై ఎమ్మెల్యేలతో చర్చించినట్టు ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాకు రాజకీయంగా మరింత ప్రాధాన్యం ఇవ్వాలని గులాబీ దళపతి భావించినట్టు పార్టీ వర్గాల టాక్‌. ఈ ప్రాంతంపై కాంగ్రెస్‌, బీజేపీ నేతలు ఎక్కువ ఫోకస్‌ పెట్టాయి. పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి, బీజేపీ నేతలు డీకే అరుణ, జితేందర్‌రెడ్డి, బీఎస్పీ నేత ప్రవీణ్‌కుమార్‌లు ఇక్కడి వారే. దీంతో టీఆర్ఎస్‌ పట్టు సడలకుండా ఏం చేయాలన్నదానిపై ఈ ముగ్గురు ఎమ్మెల్యేలతో సీఎం చర్చించినట్టు ప్రచారం జరుగుతోంది.

లక్ష్మారెడ్డికి మరోమారు మంత్రిని చేస్తారని ప్రచారం..!
రాజేందర్‌రెడ్డికి కీలక పదవి ఇస్తారని లెక్కలు..!

ఢిల్లీ టూర్‌లో ఇంకా ఏం జరిగిందో ఏమో.. ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, రాజేందర్‌రెడ్డి, వెంకటేశ్వరరెడ్డి శిబిరాల్లో మాత్రం ఫుల్‌ జోష్‌ కనిపిస్తోందట. జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి మరోమారు మంత్రి పదవి ఖాయమని ఆయన మద్దతుదారులు సంబరాలు చేసుకుంటున్నారట. నారాయణపేట జిల్లాగా మారిన తర్వాత అక్కడ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ముగ్గురు ఎమ్మెల్యేలలో ఎవరికీ కీలక పదవులు దక్కలేదు. అభివృద్ధి పనుల స్పీడ్‌ పెంచి.. పార్టీని ఇంకా బలోపేతం చేయడం కోసం రాజేందర్‌రెడ్డికి కీలక పదవి ఇస్తారని లెక్కలేసుకుంటున్నారట ఆయన అనుచరులు.

ఆలకు ఊహించని భరోసా ఇచ్చారట..!

సీఎం కేసీఆర్‌ కుటుంబానికి సన్నిహితంగా ఉండే ఆల వెంకటేశ్వరరెడ్డికి సైతం ముఖ్యమంత్రి ఊహించని భరోసా ఇచ్చినట్టు ఎమ్మెల్యే అనుచరులు ఓపెన్‌గానే చర్చించుకుంటున్నారు. పైగా ఢిల్లీ టూర్‌లో వెంకటేశ్వర్‌రెడ్డిపట్ల సీఎం ఎంతో మమకారం చూపారని చెబుతున్నారు. అందుకే తమ ఎమ్మెల్యేకు రాజకీయ భవిష్యత్‌ అద్భుతంగా ఉండబోతుందని అనుచరుల్లో ఒక్కటే చర్చ. మరి.. ఢిల్లీ టూర్‌లో ఎమ్మెల్యేలతో సీఎం రాజకీయ చర్చలు జరిపారో లేదో కానీ.. అదిగో తోక అంటే ఇదిగో పులి అన్నట్టుగా చెలరేగిపోతున్నారు ఫాలోవర్స్‌.

-Advertisement-సీఎం కేసీఆర్‌తో పాటు ఢిల్లీ వెళ్లిన ముగ్గురు ఎమ్మెల్యేలు..!

Related Articles

Latest Articles