నోటి దూల వల్లే ఆయన ఇరకాటంలో పడ్డాడా…?

నోటి దురుసే ఆయన్ని ఇబ్బందుల్లోకి నెట్టిందా? ఆయన్ని సపోర్ట్‌ చేసినవారిని కూడా ఇరకాటంలో పెట్టిందా? కాంగ్రెస్‌లో కౌశిక్‌రెడ్డి ఎపిసోడ్‌ను ఎలా చూడాలి? వేటు వేస్తారని తెలిసి జాగ్రత్త పడినా.. పార్టీలో చికాకు కలిగింది ఎవరికి?

కౌశిక్‌రెడ్డిని వివరణ కోరిన క్రమశిక్షణ కమిటీ!

హుజురాబాద్‌ కాంగ్రెస్‌ ఇంఛార్జ్‌ కౌశిక్‌రెడ్డి వ్యవహారం పార్టీలో కలకలం రేపింది. జరగబోయే ఉపఎన్నికలో తానే టీఆర్‌ఎస్ అభ్యర్థినంటూ బయటకొచ్చిన ఆయన ఆడియోపై పార్టీ సీరియస్‌ అయింది. రెండుగంటల్లోనే స్పందించిన పార్టీ క్రమశిక్షణ కమిటీ.. 24 గంటల్లోనే వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది. ఆ గడువు తీరకుండానే వేటు వేసింది. వాస్తవానికి టీపీసీసీకి సారథిగా వచ్చిన రేవంత్‌రెడ్డి కత్తి పట్టుకుని కూర్చున్నారు. క్రమశిక్షణ ఉల్లంఘించేవారిపై వేటు వేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. ఇలాంటి సమయంలో వెలుగులోకి వచ్చిన కౌశిక్‌రెడ్డి ఉదంతం చర్చగా మారింది.

సమాధానం చెప్పుకోలేకపోతున్న కౌశిక్‌రెడ్డి

కౌశిక్‌రెడ్డి నోటి దురుసుతనం ఆయనకే కాకుండా .. ఇన్నాళ్లూ పార్టీలో తనకు మద్దతుగా నిలిచిన పీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇరకాటంలో పడ్డారు. గడిచిన నెలలో కౌశిక్‌రెడ్డి మంత్రి కేటీఆర్‌ను కలిశారు. అప్పట్లో ఏదో చెప్పుకొన్నా.. ఇప్పుడు వివరణ ఇచ్చుకోవడానికి ఏమీ లేకుండా అడ్డంగా దొరికిపోయారు. నిన్న మొన్నటి వరకు పార్టీ మారడం లేదని ఓట్టేసిన కౌశిక్‌రెడ్డే.. తాను టీఆర్‌ఎస్‌ అభ్యర్థినంటూ.. టీఆర్‌ఎస్‌ నేతలకు ఫోన్‌ చేయడం.. అది ఆడియో రూపంలో బయటకు రావడం రచ్చ రచ్చ అవుతోంది.

కౌశిక్‌రెడ్డి ఎపిసోడ్‌లో ఉత్తమ్‌ ఇబ్బందుల్లో పడ్డారా?

ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి కౌశిక్‌ తమ్ముడు వరస అవుతారు. ఇన్నాళ్లూ ఆయన అండతోనే కాంగ్రెస్‌లో హడావిడి చేశారు. మొదటి నుండి కూడా కౌశిక్ వ్యవహరం పై అనేక ఆరోపణల వచ్చాయి. సొంత పార్టీ నాయకులు… పొన్నం ప్రభాకర్… కౌశిక్… ఉత్తమ్‌ల మధ్య ఓ రేంజ్‌లో చర్చ కూడా జరిగింది. కౌశిక్ రాజకీయంగా తన దారి తాను చూసుకున్నా.. ఇబ్బందిలో పడింది మాత్రం ఉత్తమేనని పార్టీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. సరిగ్గా ఇదే సమయంలో AICC నుంచి ఓ ముఖ్య నాయకుడు ఓ కీలక నేతకు ఫోన్‌ చేసి ఆరా తీశారట. కౌశిక్‌ ఆడియో గురించి ప్రశ్నించి.. ఏ చేద్దామని అడిగారట. తప్పు చేస్తే చర్యలు తీసుకోవాల్సిందేనని ఆ కీలక నేత ఢిల్లీ నాయకుడికి చెప్పినట్టు సమాచారం.

కౌశిక్‌రెడ్డి తీరుపై టీఆర్‌ఎస్‌ గుర్రుగా ఉందా?

హుజురాబాద్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఎవరో ఇంకా ప్రకటించలేదు. ఈ సమయంలో కౌశిక్‌రెడ్డి తానే అభ్యర్థినని చెప్పుకోవడంపై గులాబీ శిబిరం కూడా గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. రాజకీయంగా ఎదురైన ఈ డ్యామేజ్‌ను కంట్రోల్‌ చేసే పరిస్థితి కూడా చేయి దాటిపోయింది. వాస్తవానికి తెలంగాణ కాంగ్రెస్‌లో రాజకీయాలు ఎప్పుడూ రసవత్తరంగా ఉంటాయి. చీమ చిటుక్కుమన్నా… అధిష్ఠానానికి ఫిర్యాదులు వెళ్లడం సహజం. అలాంటిది ఇప్పుడు పరిస్థితి చూస్తే.. ఎవరు ఎప్పుడు పక్కలో బల్లెం అవుతారో అంతుచిక్కడం లేదు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-