అక్రమార్కులపై యాక్షన్‌ తీసుకోకుండా నేతలు ఒత్తిళ్లు…?

అక్రమార్కుల భరతం పడతామని కొరడా బయటకు తీశారు. దూకుడుగా వెళ్లారు కూడా. ఇంతలో ఏమైందో ఏమో ఉలుకు లేదు పలుకు లేదు. ఎక్కడివారు అక్కడే గప్‌చుప్‌. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో ఆసక్తికర చర్చకు దారితీస్తోన్న ఆ సంగతేంటో ఈ స్టోరీలో చూద్దాం.

నాడు గంభీరమైన ప్రకటనలు.. నేడు పత్తా లేరు!

తప్పు చేస్తే తాట తీస్తాం. ఎంతటి వారైనా వదిలేదు లేదు. కటకటాల వెనక్కి నెట్టడం ఖాయం. కరోనా సమయంలో నిజమాబాద్‌ జిల్లా ఉన్నతాధికారులు గంభీరంగా పలికిన పలుకులివి. ప్రజలతో నేరుగా సంబంధం ఉన్న ప్రధాన ప్రభుత్వ శాఖల ఆఫీసర్లు ఓ రేంజ్‌లో ఈ డైలాగ్‌లు పేల్చారు. వారికి ప్రజాప్రతినిధులు కూడా కోరస్‌ ఇవ్వడంతో అక్రమార్కుల పనైపోయిందని అంతా భావించారు. కానీ.. షరా మామూలే. నాడు ఎన్నో చెప్పిన అధికారులు ఇప్పుడు పత్తా లేకుండా పోయారు. అప్పుడలా అన్నారుగా అని ఎవరైనా గుర్తు చేస్తే.. ముఖం తిప్పుకొని వెళ్లిపోతున్నారు.

కరోనా టైమ్‌లో అధిక ఫీజులు వసూలు చేసిన ఆస్పత్రులపై చర్యల్లేవ్‌?

కరోనా సెకండ్‌ వేవ్‌లో నిజామాబాద్‌ జిల్లాలోని ప్రైవేట్‌ ఆస్పత్రులపై ఫిర్యాదులు వచ్చాయి. భారీగా బిల్లులు వసూలు చేస్తున్నారని రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు బాధితులు. అలా ఫిర్యాదులు అందుకున్న అధికారులు.. ఆస్పత్రులకు వెళ్లి తనిఖీలు చేశారు. కొందరికి నోటీసులు ఇచ్చారు. జిల్లా కేంద్రంలోని ఓ ఆస్పత్రిని సీజ్‌ చేయాలని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్టు ఎంతో గొప్పగా చెప్పారు అధికారులు. రోజులు గడిచిపోయాయి కానీ.. ఒక్క ఆస్పత్రిపైనా చర్చల్లేవ్‌. నోటీసులు ఇచ్చేసి మమ అనిపించారు. ఇదే విషయాన్ని ఆ మధ్య జడ్పీ స్టాండింగ్‌ కమిటీ సమావేశంలో వైద్య ఆరోగ్య అధికారులను ప్రశ్నించినా.. నీళ్లు నమిలారు తప్ప సమాధానం లేదు.

లక్కీ డ్రా నిర్వాహకులపై అధికారులు శీతకన్ను!

ఆ మధ్య లక్కీ డ్రా పేరుతో ప్రజలను మోసం చేస్తున్న తీరుపై గగ్గోలు రేగింది. బాధితుల్లో కొందరు హోంమంత్రికి ఫిర్యాదు చేశారు. కొత్తలో లక్కీ డ్రా నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పిన అధికారులు తర్వాత పత్తా లేకుండా పోయారు. ఆయా లక్కీ డ్రా నిర్వాహకుల నుంచి మామూళ్లు అందడం వల్లే పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఓ లక్కీ డ్రా సంస్థ అయితే ఓ పోలీస్‌ ఉన్నతాధికారి సాయంతో రాజీకి ప్రయత్నిస్తోందట.

చర్యలు తీసుకోకుండా అధికారులపై ఒత్తిళ్లు?

కొన్ని ప్రైవేట్‌ స్కూళ్లు నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని విద్యాశాఖకు ఫిర్యాదులు వెళ్లాయి. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ అధికారులు ప్రకటించారు కూడా. కానీ.. ప్రకటనలతోనే సరిపెట్టేశారు. చర్యలు లేవు. అధికారులు ఈ విధంగా గంభీరంగా ప్రకటనలు చేయడం.. తర్వాత వెనక్కి తగ్గడం వెనక జిల్లాలోని కొందరు ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లు ఉన్నట్టు చెబుతున్నారు. బయట ఏవేవో చెబుతాం.. అన్నీ చేస్తామా ఏంటి? కొన్నాళ్లు పోతే జనాలే మర్చిపోతారు.. ప్రస్తుతానికి మీరూ మర్చిపోవాలని అధికారులను కోరుతున్నారట. అందుకే ఆఫీసర్లు ఎక్కడివారు అక్క గప్‌చుప్‌ అయినట్టు ప్రచారం జరుగుతోంది.

ఒత్తిళ్లా.. నేతల పేరు చెప్పి క్యాష్‌ చేసుకుంటున్నారా?

ఆయా కీలక శాఖలకు చెందిన అధికారులపై ఒత్తిళ్లు తెస్తున్న ప్రజాప్రతినిధులు ఎవరు? లేక నేతల పేరు చెప్పి ఇంకేవరైనా అధికారులు కేసుల్ని క్యాష్‌ చేసుకుంటున్నారా అన్న అనుమానాలు లేకపోలేదు. దాల్‌ మే కుచ్‌ కాలాహై అన్న చర్చ అయితే సాగుతోంది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-