ఆ సమయంలో బాబు వెంట నడిచిన ఏకైక నాయకుడికి ఏమైంది?

మంత్రిగా.. ఎంపీగా చేసిన ఆయన సడెన్‌గా పొలిటికల్‌ తెర నుంచి కనుమరుగయ్యారు. పార్టీ కార్యక్రమాల్లోనూ నల్లపూసై చర్చగా మారారు. ఆయనది మౌనమా? వ్యూహాత్మకంగా దూరం పాటిస్తున్నారా? ఎవరా నాయకుడు? ఏమా కథ?

టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారా?

నిమ్మల కిష్టప్ప. అనంతపురం జిల్లాలో సీనియర్‌ టీడీపీ నాయకుడు. సుదీర్ఘకాలం మంత్రిగా.. ఎంపీగా పనిచేసిన అనుభవం ఆయన సొంతం. 2019లో హిందూపురం లోక్‌సభ నియోజకవర్గంలో ఓడిన తర్వాత రెండున్నరేళ్లుగా టీడీపీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. అసలు ఆయన ఎక్కడున్నారో.. ఏం చేస్తున్నారో కూడా కేడర్‌కు తెలియని పరిస్థితి. టీడీపీకి దూరంగా ఉండటంతో కొన్ని రోజులుగా కిష్టప్పపై చర్చ జరుగుతోంది.

2019 ఎన్నికల్లో ఓటమి కుంగదీసిందా?

తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలం నుంచి కొనసాగుతున్నారు కిష్టప్ప. ఎన్టీఆర్‌తో చంద్రబాబు విభేదించిన సమయంలో అనంతపురం జిల్లా నుంచి బాబు వెంట నడిచిన ఏకైక నాయకుడిగా ముద్ర ఉంది. అందుకే చంద్రబాబు ఆయనకు చాలా ప్రాధాన్యం ఇస్తున్నారని అనుకునేవారు. జిల్లాలోని గోరంట్ల మండలం పెరుమాళ్లపల్లికి చెందిన కిష్టప్ప.. బలమైన ఓటు బ్యాంక్‌ ఉన్న బీసీ నేత. ఎంపీపీగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించి మంత్రిగా.. ఎంపీగా ఎదిగారు. హిందూపురం లోక్‌సభను అడ్డగా మార్చుకున్నారు. కానీ.. 2019 ఓటమి ఆయన్ని కుంగదీసిందని సమాచారం.

మాజీ ఎమ్మెల్యే పార్థసారధితో విభేదాలు?
కుమారుడికి టికెట్‌ ఇవ్వకపోవడంతో అసంతృప్తి?

హిందూపురంలో ఓడినప్పటి నుంచి టీడీపీ కార్యక్రమాలకు కూడా కిష్టప్ప దూరంగా ఉంటున్నారు. సైలెంట్‌ అయ్యారు. కొన్ని రోజులుగా టీడీపీలో ఆయనకు సరైన ప్రాధాన్యం దక్కడం లేదని తెలుస్తోంది. పెనుకొండ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే పార్థసారధితో తీవ్రస్థాయిలో విభేదాలు ఉన్నాయి. కిష్టప్ప ఎంపీగా ఉన్న సమయంలో ప్రొటోకాల్‌ ఇవ్వకుండా దూరం పెట్టారట పార్థసారధి. పైగా 2019 అసెంబ్లీ ఎన్నికల్లో కుమారుడికి పెనుకొండ, పుట్టపర్తిల నుంచి టికెట్‌ ఆశించినట్టు సమాచారం. ఆ విన్నపానికి చంద్రబాబు నో చెప్పారట. అప్పటి నుంచి కిష్టప్ప అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది.

రాయలసీమ టీడీపీ నేతల సదస్సుకు రాలేదు!

2019లో ఓటమి తర్వాత హిందూపురం లోక్‌సభ పరిధిలోని టీడీపీ నేతలంతా కిష్టప్పను ఏ కార్యక్రమానికి ఆహ్వానించడం లేదట. అలా వచ్చిన గ్యాప్.. ఇప్పుడు ఇంకా పెరిగిందని సమాచారం. నిమ్మల సొంత మండలం గోరంట్లలో టీడీపీ చేపట్టిన నిరసనలకు దూరంగా ఉంటూ వచ్చారు మాజీ ఎంపీ. ఇటీవల జరిగిన రాయలసీమ నేతల సదస్సుకు కూడా హాజరు కాలేదు.
పైగా హిందూపురం పార్లమెంట్ టీడీపీ బాధ్యతలను పార్థసారథికి అప్పగించడంతో మరింత అసంతృప్తికి కారణమైందట. ఇలా చాలా కారణాలు కిష్టప్ప మౌనానికి.. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటానికి కారణాలుగా చెబుతున్నారు. మాజీ ఎంపీ అసంతృప్తిని టీడీపీ గుర్తించిందో లేదో.. కిష్టప్ప చుట్టూ చర్చ మాత్రం ఆగడం లేదు. మరి.. ఏం జరుగుతుందో చూడాలి.

-Advertisement-ఆ సమయంలో బాబు వెంట నడిచిన ఏకైక నాయకుడికి ఏమైంది?

Related Articles

Latest Articles