రెండు దశాబ్దాలుగా నరసరావుపేటలో టీడీపీ డల్‌..!

ఒకప్పుడు టీడీపీకి కంచుకోటగా భావించిన ఆ నియోజకవర్గంలో 2 దశాబ్దాలుగా పార్టీ గెలుపు రుచి చూడలేదు. పల్నాడు రాజకీయాలకు కేంద్రమైనా టీడీపీ నెగ్గుకు రాలేని పరిస్థితి. అందుకే స్థానిక తెలుగు తమ్ముళ్లు కొత్త పాట పాడుతున్నారట. అదేంటో ఈ స్టోరీలో చూద్దాం.

వరస ఓటములతో నరసరావుపేటను విడిచిపెట్టిన కోడెల ఫ్యామిలీ..!

గుంటూరు జిల్లా నరసరావుపేట.. పల్నాడు పౌరుషాలకు రాజకీయ వేదిక. టీడీపీ ఆవిర్భావం నుంచి 1999 వరకు టీడీపీదే ఇక్కడ ఆధిపత్యం. వరసగా అనేక పర్యాయాలు కోడెల శివప్రసాదరావు గెలిచారు. అయితే వరసగా వచ్చిన విజయాలో లేక రాజకీయ మార్పుల వల్లో కానీ తర్వాత టీడీపీ గెలిచింది లేదు. వరస ఓటములే పలకరించాయి. 2004లో కోడెల శివప్రసాదరావుపై కాసు కుటుంబం పైచెయ్యి సాధించింది. అప్పట్లో టీడీపీపై ఉన్న వ్యతిరేకతవల్లే కోడెల ఓడిపోయారు అని అనుకున్నారు. ఆ తర్వాత జరిగిన 2009 ఎన్నికల్లోనూ కోడెలకు నిరాశే ఎదురైంది. ఆ తర్వాత ఐదేళ్ల ఆటుపోట్లు తర్వాత కోడెల కుటుంబం నరసరావుపేటను విడిచిపెట్టి సత్తెనపల్లిని ఎంచుకుంది.

పేటలో గుర్తింపు పొందిన టీడీపీ నేత లేరా?

కోడెల విడిచిపెట్టాక కూడా 2014, 2019 ఎన్నికల్లో నరసరావుపేటలో టీడీపీకి పరాభవాలు తప్పలేదు. అప్పట్లో కాంగ్రెస్‌.. ఇప్పుడు వైసీపీ పూర్తిస్థాయిలో పాగా వేశాయి. ఒకప్పుడు టీడీపీని ఆదరించిన నరసరావుపేట ప్రజలు.. ఎందుకు మనసు మార్చుకున్నారు? కోడెల తర్వాత పగ్గాలు చేపట్టిన టీడీపీ నాయకులు ఎందుకు సత్తా చాటలేకపోతున్నారు? ఈ ప్రశ్నలకు సమాధానం వెతికేపనిలోనే కాలం వెళ్లదీస్తోంది తెలుగుదేశం నాయకత్వం. ప్రస్తుతం నరసరావుపేటలో టీడీపీ అంటే ఫలానా నాయకుడు అని చెప్పే పరిస్థితి లేదు.

మాజీ ఎంపీ రాయపాటి దగ్గర పార్టీ నేత పంచాయితీ..!

గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిన అరవిందబాబు.. వచ్చే ఎన్నికల్లోనూ అభ్యర్థిగా ఉంటారని కచ్చితంగా చెప్పలేకపోతున్నారు పార్టీ కేడర్‌. టీడీపీ శ్రేణులే ఆయనపై సెటైర్లు వేస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లోనూ అరవిందే అభ్యర్థి అయితే అద్భుతాలు ఆశించక్కర్లేదని పార్టీ అధిష్ఠానానికి చెప్పేశారట పార్టీ ద్వితీయశ్రేణి నాయకులు. ఇటీవల మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు దగ్గరకు నరసరావుపేటకు చెందిన కొందరు టీడీపీ నాయకులు వెళ్లి పార్టీ పరిస్థితిపై మాట్లాడారట. ఆఫీస్‌కు, ఆస్పత్రికి తేడా తెలియని వారికి పార్టీ పగ్గాలు అప్పగిస్తే టీడీపీ మరింత పతనం అవుతుందని హెచ్చరించారట. ఇదే విషయాన్ని పార్టీ హైకమాండ్‌కు స్పష్టం చేసేందుకు ఓ వర్గం ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.

కొత్త నాయకత్వంపై టీడీపీ దృష్టి పెట్టిందా?

కొద్దిరోజులుగా నరసరావుపేట రాజకీయ పరిణామాలను గమనిస్తున్న టీడీపీ హైకమాండ్‌.. నియోజకవర్గంలో కొత్త నాయకత్వంపై దృష్టి పెడుతుందని పార్టీలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఆర్థిక, అంగ బలం కలిగిన అభ్యర్థుల వేటలో ఉన్నట్టు సమాచారం. మరి.. కొత్త ప్రయత్నాలు.. సరికొత్త ఆలోచనలు పేటలో టీడీపీకి ఏ మేరకు శక్తినిస్తాయో చూడాలి.

Related Articles

Latest Articles