మోత్కుపల్లి నర్సింహులకు పదవీయోగం ఉందా?

మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులకు పదవీయోగం ఉందా? ఆ పదవి ఏంటో.. సీఎం కేసీఆర్‌ ఆయనకు చెప్పేశారా? గులాబీ కండువా కప్పుకోగానే అధికారికంగా ప్రకటన చేసేస్తారా? టీఆర్‌ఎస్‌లో ఆయన చేరిక హుజురాబాద్‌ ఉపఎన్నిక కంటే ముందే ఉంటుందా.. లేదా?

సీఎం కేసీఆర్‌తోపాటు అసెంబ్లీకి రావడంతో చర్చల్లోకి మోత్కుపల్లి..!

బీజేపీకి దూరమైన మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు టీఆర్ఎస్‌ వైపు అడుగులు వేస్తున్నారని కొంతకాలంగా ప్రచారం జరుగుతూ వస్తోంది. రేపోమాపో టీఆర్ఎస్‌ కండువా కప్పేసుకుంటారని చర్చ జరిగినా.. తర్వాత అంతా మర్చిపోయారు. తాజాగా సీఎం కేసీఆర్‌తో కలిసి మోత్కుపల్లి అసెంబ్లీకి రావడంతో మళ్లీ చర్చల్లోకి వచ్చారు మాజీ మంత్రి. ఒక రోజంతా సీఎంతోనే ఉండటం రాజకీయంగా మరింత హైప్‌ వచ్చింది. కొద్ది రోజుల్లోనే టీఆర్‌ఎస్‌ కండువా కప్పుకోవడం ఖాయమని అనుకుంటున్నారు. పైగా నర్సింహులు చేరిక బాధ్యతను మంత్రి జగదీష్‌రెడ్డికి అప్పగించారట సీఎం కేసీఆర్‌.

దళిత బంధు కార్పొరేషన్‌కు ఛైర్మన్‌ను చేస్తారా?

టీఆర్ఎస్‌లో చేరాక.. మోత్కుపల్లికి దక్కే పదవిపై ఇప్పుడు చర్చ మొదలైంది. అప్పట్లో సీఎం కేసీఆర్‌ నిర్వహించిన దళిత బంధు స్కీమ్‌ సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అప్పడు మోత్కుపల్లి బీజేపీలో ఉన్నారు. సమీక్షా సమావేశానికి దూరంగా ఉండాలని నాడు బీజేపీ నిర్ణయించినా.. ధిక్కరించి ప్రగతిభవన్‌కు వెళ్లారు మోత్కుపల్లి. ఆ తర్వాత బీజేపీకి గుడ్‌బై చెప్పేశారు. ఇప్పుడు టీఆర్‌ఎస్‌ సర్కార్‌ ఏర్పటు చేసే దళితబంధు కార్పొరేషన్‌కు మోత్కుపల్లిని ఛైర్మన్‌ను చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ నిర్ణయం రాజకీయంగా కలిసి వస్తుందనే లెక్కల్లో ఉంది గులాబీ పార్టీ.

ఛైర్మన్‌ పదవితో సంతృప్తి చెందుతారా?
అసెంబ్లీ టికెట్‌ అడిగితే పరిస్థితి ఏంటి?

ఇదే సమయంలో మోత్కుపల్లి రాజకీయ భవిష్యత్‌పై మరో చర్చా మొదలైంది. ఒకవేళ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ను చేస్తే.. ఆ పదవితోనే సంతృప్తి చెంది టీఆర్ఎస్‌లో కొనసాగుతారా? లేక.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్‌ అడుగుతారా? 2014లో ఖమ్మం టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2018లో BLF కూటమి తరఫున ఆలేరు నుంచి అసెంబ్లీకి పోటీ చేసినా కలిసి రాలేదు. ప్రస్తుతం టీఆర్ఎస్‌లో ఆలేరు సీటు ఖాళీగా లేదు. అలాగని.. మరో ఎస్సీ రిజర్డ్వ్‌ స్థానానికి మోత్కుపల్లిని పంపిస్తారని భావించినా.. అవి కూడా ఫుల్‌. అందుకే టీఆర్ఎస్‌లో మోత్కుపల్లి రాజకీయ భవిష్యత్‌ ఏంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం టీఆర్ఎస్‌ ఇచ్చే పదవితో సంతృప్తి చెంది.. కామైపోతారని కొందరి వాదన. ఆపై అంతా గులాబీ దళపతి దయ అని కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. మరి.. మోత్కుపల్లి రాజకీయ జాతకం ఎలా ఉందో చూడాలి.

-Advertisement-మోత్కుపల్లి నర్సింహులకు పదవీయోగం ఉందా?

Related Articles

Latest Articles