మదర్‌ డెయిరీలో ‘గుత్తా’ శకం ముగిసిందా?

దాదాపు 3 దశాబ్దాలుగా ఆ డెయిరీలో ఆ సీనియర్ నేత చెప్పిందే వేదం.. శాసనం..! పెత్తనమంతా ఆయన ఫ్యామిలీదే…! పార్టీలు మారినా.. డెయిరీలో పట్టు సడలకుండా చూసుకున్నారు ఆ నాయకుడు. కానీ.. జిల్లా రాజకీయాల్లో వచ్చిన ఆధిపత్యపోరు.. సీటుకే ఎసరు పెట్టింది. ఇక ఆయన శకం ముగిసినట్టేనని చర్చించుకుంటున్నారు. ఇంతకీ ఎవరాయన? ఏమా కథ?

మదర్‌ డెయిరీతో గుత్తా బంధం తెగినట్టేనా?

నల్లగొండ జిల్లా రాజకీయాల్లో మదర్ డెయిరీ కూడా కీలకం. 30 ఏళ్లుగా డెయిరీపై గుత్తా సుఖేందర్‌రెడ్డిదే పెత్తనం. అధికారంలో ఏ పార్టీ ఉన్నప్పటికీ పట్టు కోల్పోకుండా చూసుకున్నారు గుత్తా. ఇప్పుడు మాత్రం ఆ ఫ్యామిలీ పెత్తనానికి బ్రేక్ పడింది. మదర్‌ డెయిరీ నుంచి గుత్తా కుటుంబం బయటకు రావాల్సిన పరిస్థితిని కల్పించారు ప్రత్యర్థులు. దానిపైనే ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో పెద్ద చర్చ జరుగుతోంది.

ఈ దఫా గుత్తా ఫ్యామిలీని పోటీ చేయనివ్వలేదా?

నల్లగొండ రంగారెడ్డి జిల్లాల పాల ఉత్పత్తిదారుల సహకార సంఘానికి సుఖేందర్‌రెడ్డి దాదాపు ఐదుసార్లు ఛైర్మన్‌గా ఉంటే.. ఆయన సొదరుడు జితేందర్‌రెడ్డి పదమూడేళ్లపాటు ఛైర్మన్‌గా ఉన్నారు. మధ్యలో ఒకసారి బొందుగుల నరసింహారెడ్డి ఛైర్మన్‌గా పనిచేశారు. ఈ మార్పు కూడా గుత్తా అనుమతితో జరిగిందేనని చెబుతారు. ప్రస్తుతం ఎన్నికల ముంగిట నిలిచిన మదర్‌ డెయిరీలో గుత్తా ఫ్యామిలీని పోటీ చేయనివ్వలేదని టాక్‌. ఛైర్మన్‌ రేస్‌ నుంచి సుఖేందర్‌రెడ్డితోపాటు ఆయన సోదరుడు తప్పుకోక తప్పని పరిస్థితి. ఇప్పటికే డైరెక్టర్‌ ఎన్నికలకు సంబంధించి జోరుగా రాజకీయం సాగుతోంది. డెయిరీ పరిధిలోని సొసైటీ ఛైర్మన్లను క్యాంపులకు తరలించడంతో ఎప్పుడేం జరుగుతుందోనన్న ఉత్కంఠ అధికారపార్టీ వర్గాల్లో ఎక్కువగా ఉంది.

గుత్తా చేతిలో ప్రస్తుతం ఎలాంటి పదవి లేదు?

మదర్‌ డెయిరీ ఎన్నికల్లో గెలుపు బాధ్యతలను మంత్రి జగదీశ్వర్‌రెడ్డికి అప్పగించారు. దీంతో ఇప్పుడు సూర్యాపేట ప్రాంతానికి చెందిన వ్యక్తినే మదర్ డెయిరీ ఛైర్మన్‌గా ఎన్నుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయట. అందువల్లే గుత్తా కుటుంబాన్ని పోటీలో నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని సమాచారం. మొత్తంగా 30 ఏళ్లుగా మదర్‌ డెయిరీపై గుత్తా ఫ్యామిలీకి ఉన్న పట్టు సడలినట్టు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. నిన్నటి వరకు శాసనమండలి ఛైర్మన్‌గా ఉన్న గుత్తా సుఖేందర్‌రెడ్డికి ఇప్పుడు ఆ పదవి కూడా లేదు. మరోసారి ఎమ్మెల్సీ పదవి వస్తుందో రాదో తెలియదు. ఇప్పుడు తమ కుటుంబం అధీనంలో ఉన్న మదర్‌ డెయిరీ ఛైర్మన్‌ గిరి కూడా పోవడంతో గుత్తా రాజకీయ భవిష్యత్‌పై నీలి నీడలు కమ్ముకుంటున్నాయా అన్న చర్చ జోరందుకుంది. మరి.. ఈ సీనియర్‌ పొలిటీషియన్‌ ఏం చేస్తారో చూడాలి.

-Advertisement-మదర్‌ డెయిరీలో 'గుత్తా' శకం ముగిసిందా?

Related Articles

Latest Articles