పెదకూరపాడు ఇసుక రీచ్‌ గొడవలో మళ్లీ పాత కథ..!

ఆ నియోజకవర్గం ఇసుకకు పెట్టింది పేరు. ఇప్పుడు అదే ఇసుక వివాదం ఆ ఎమ్మెల్యేకు తలనొప్పిగా మారింది. ఆయనే చేస్తున్నారో.. లేక ఆయనకు తెలియకుండా అనుచరులే చేస్తున్నారో కానీ.. అవన్నీ ఎమ్మెల్యే మెడకు చుట్టుకుంటున్నాయి. దీంతో ఎమ్మెల్యేకు అధిష్ఠానం నుంచి వార్నింగ్‌ల మీద వార్నింగ్‌లు వస్తున్నాయి. కార్యకర్తలకు సర్ది చెప్పుకోలేక.. హైకమాండ్‌ ఆగ్రహం తట్టుకోలేక ఎమ్మెల్యే సతమతం అవుతున్నారు. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? లెట్స్‌ వాచ్‌!

నాడు ఎమ్మెల్యే శంకర్రావు అనుచరుడు కంచేటి సాయిపై కేసు!

గుంటూరు జిల్లా పెదకూరపాడు కృష్ణానదిని అనుకుని ఉన్న నియోజకవర్గం. ఈ పరిధిలోని అచ్చంపేట, అమరావతి మండలాల్లో దాదాపు పది ఇసుక రీచ్‌లున్నాయి. గతంలో ఈ రీచ్‌ల ద్వారా ప్రజాప్రతినిధులకు భారీగా ఆదాయం వచ్చేది. కొత్త ఇసుక పాలసీ తెచ్చకా.. ఇక్కడ తవ్వకాలను జేసీ పవర్ వెంచర్స్‌కు అప్పగించారు. ఇసుకపై వచ్చే ఆదాయానికి అలవాటుపడ్డ కొందరు నేతలకు ఈ పరిణామం ఇబ్బందిగా మారింది. జేపీ పవర్ వెంచర్స్ ఇసుక తవ్వకాలు చేసే రీచ్ వద్ద గొడవలకు దిగారు. రీచ్‌లకు వెళ్లే అప్రోచ్ రోడ్డును ప్రొక్లైనర్‌తో తవ్వేసి.. ఆ సంస్థ ప్రతినిధులపై దాడి చేశారు. బాధితులు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. దాడి విషయాన్ని జేపీ పవర్స్‌ వెంచర్స్‌ ప్రతినిధులు ఏకంగా ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వ పెద్ద ఆదేశాలతో పోలీసులు దాడిచేసిన కంచేటి సాయిపై కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే నంబూరు శంకర్రావుకు కంచేటి సాయి ప్రధాన అనుచరుడు కావడంతో సంచలనంగా మారింది.

ప్రభుత్వ పెద్దల వార్నింగ్‌తో కొంతకాలం సైలెంట్‌!

ఇసుక వ్యవహారాన్ని గాడిలో పెట్టడానికి ప్రభుత్వం నానా తంటాలు పడుతుంటే సొంతపార్టీ ఎమ్మెల్యే నుంచే చికాకులు ఎదురుకావడం హైకమాండ్‌ సీరియస్‌గా తీసుకుంది. ఎమ్మెల్యే నంబూరును పిలిపించి గట్టిగా క్లాస్‌ పీకారట. ప్రభుత్వ పెద్దల వార్నింగ్‌తో కొంతకాలం సైలెంట్‌గా ఉన్న వివాదం ఈ మధ్య మళ్లీ మొదలైంది. తమ వాహనాలకు ఇసుక లోడింగ్ చెయ్యడం లేదంటూ ఇసుక రీచ్‌ల వద్ద స్థానిక నేతలు ఆందోళనకు దిగారు. తాము రీచ్‌ల వద్దకు వచ్చి రోజుల తరబడి వేచి ఉన్నా ఇసుక లోడింగ్ చెయ్యడం లేదని సంస్థ ప్రతినిధులతో వాగ్వాదానికి దిగారు. ఇదే విషయాన్ని ఎమ్మెల్యే నంబూరు శంకరావు దృష్టికి తీసుకెళ్లారు. సమస్య పట్టించుకోకుంటే పార్టీ నేతలతో ఇబ్బంది. పట్టించుకుంటే హైకమాండ్‌తో తలనొప్పి. ఏం చేయాలో తెలియని ఎమ్మెల్యే లోకల్‌ ఈక్వేషన్‌తో వెళ్లారు.

జేపీ పవర్‌ వెంచర్స్‌పై ఎన్జీటీకి ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే అనుచరుడు!

జేపీ పవర్ వెంచర్స్ ప్రతినిధులను పిలిపించి మాట్లాడారు ఎమ్మెల్యే. స్థానికంగా ఉండే లారీలు, ట్రాక్టర్లకు కూడా ఇసుక లోడింగ్ చెయ్యాలని సూచించారు. ఇదే సమయంలో అమరావతి మండలం ధరణికోటకు చెందిన ఎమ్మెల్యే అనుచరుడు దండా నాగేంద్రకుమార్ ఏకంగా జేపీ పవర్ వెంచర్స్‌పై నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్‌కు ఫిర్యాదు చేశారు. జేపీ పవర్ వెంచర్స్ నిబంధనలు పాటించకుండా అడ్డగోలుగా తవ్వకాలు చేపడుతోందని ఆరోపించారు. కృష్ణానదిలో ఇసుక తవ్వకాలతో పర్యావరణం దెబ్బతింటుందని పిటిషన్‌లో ప్రస్తావించారు. దీంతో ఇసుక తవ్వకాలపై తనిఖీలు నిర్వహించి నివేదిక అందజేయాలని NGT ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ అనుమతితో తవ్వకాలు చేస్తున్న సంస్థపై సొంతపార్టీ నేతలే ఫిర్యాదు చేయడం జిల్లాలో సంచలనం సృష్టించింది.

తనకేం తెలియదని చెప్పడంతో ఎమ్మెల్యేపై మరింత ఆగ్రహం?

తాజా వివాదాన్ని ఆ సంస్థ ప్రతినిధులు మరోసారి ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లారట. దీంతో ఎమ్మెల్యే నంబూరు శంకర్రావును పిలిపించి మళ్లీ క్లాస్ తీసుకున్నట్టు సమాచారం. ఫిర్యాదు చేసిన దండా నాగేంద్రకుమార్ మీ అనుచరుడే కదా..! ఎందుకు ఇలా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారట. ఇసుక విషయంలో జోక్యం చేసుకోవద్దని చెబితే ఎందుకు కల్పించుకున్నారని తలంటారట. అయితే NGTకి చేసిన ఫిర్యాదుపై తనకేం తెలియదని చెప్పడంతో ప్రభుత్వ పెద్దలు మరింత ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. నియోజకవర్గంలో ఏం జరుగుతుందో కూడా తెలుసుకోకపోతే ఎలా అని ప్రశ్నించారట. కొంతమంది నేతలను దూరం పెట్టాలని కూడా సూచించారట. దీంతో స్థానిక నేతలను కంట్రోల్‌ చేయలేక.. అధిష్ఠానానికి చెప్పుకోలేక ఎమ్మెల్యే నలిగిపోతున్నట్టు పెదకూరపాడులో ప్రచారం సాగుతోంది. పైగా జేపీ పవర్‌ వెంచర్స్‌ రాష్ట్రంలో ఇసుక తవ్వకాలు చేస్తున్న ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితులే ఉన్నాయట. మరి.. వీటికి ఎలాంటి పరిష్కారం లభిస్తుందో చూడాలి.

-Advertisement-పెదకూరపాడు ఇసుక రీచ్‌ గొడవలో మళ్లీ పాత కథ..!

Related Articles

Latest Articles