ఆదోనిలో ఎమ్మెల్యే అనుచరులదే రాజ్యం..!

ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అనుచరులదే రాజ్యం. వారు ఎంత చెబితే అంత. ఎదురు తిరిగితే ఇంతే సంగతులు. ఎంతటి వారైనా కేడర్ చేతిలో దెబ్బలు తినాల్సిందే. కాదూ కూడదు అంటే ఎంతకైనా తెగిస్తుండటంతో.. అధికారపార్టీలో చర్చగా మారారు ఎమ్మెల్యే. ఇంతకీ ఎమ్మెల్యేకు తెలిసే అనుచరులు చేస్తున్నారా? తెలిస్తే ఎమ్మెల్యే ఎందుకు పట్టించుకోవడం లేదన్నదే ప్రశ్న.

కేడర్‌ రెచ్చిపోతుంటే.. ఎమ్మెల్యే మౌనం!

కర్నూలు జిల్లా ఆదోని. సాయిప్రసాద్‌రెడ్డి ఎమ్మెల్యే. ఇక్కడ సాయి ప్రసాద్‌రెడ్డి కంటే అధికారపార్టీ నేతలుగా.. ఎమ్మెల్యే అనుచరులుగా నియోజకవర్గంలో తిరిగేవారి సంఖ్య ఎక్కువే. ఆ హోదాలో వారు చేస్తున్న పనులే రచ్చ రచ్చ అవుతున్నాయి. ప్రజలు బెంబేలెత్తే పరిస్థితి. సోషల్‌ మీడియాలోనూ వీడియోలు, కామెంట్స్‌ వెల్లువెత్తుతున్నాయి. పార్టీ నేతల్లా కాకుండా రౌడీమూకల్లా ప్రవర్తిస్తున్న తీరు వైసీపీకి చెడ్డ పేరు తెస్తోందని కొందరు నాయకులు వాపోతున్నారట. కేడర్‌ను అదుపులో పెట్టాల్సిన ఎమ్మెల్యే మౌనంగా ఉండటం అనుమానాలకు తావిస్తోందని అంటున్నారు ఇంకొందరు.

ఇంట్లో పేకాటకు ఒప్పుకోలేదని ఆలయ మాజీ ఛైర్మన్‌పై దాడి!

ఇంట్లో పేకాట ఆడేందుకు ఒప్పుకోలేదని ఓ వ్యక్తిని చితకబాదారు ఎమ్మెల్యే అనుచరులు. AR కానిస్టేబుల్‌ సత్యన్నతో కలిసి పార్టీ కేడర్‌గా చెప్పుకొంటున్న కిశోర్‌, ప్రసాద్‌, లక్ష్మన్నలు ఇంట్లో పేకాట ఆడేందుకు మాలమల్లేశ్వర స్వామి ఆలయ మాజీ ఛైర్మన్‌ తిమ్మారెడ్డిపై ఒత్తిడి తెచ్చారు. తిమ్మారెడ్డితోపాటు.. ఆయన కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. దాంతో తిమ్మారెడ్డిని చితక్కొట్టారు. 100కు డయల్‌ చేసి చెప్పడంతో పోలీసులు వచ్చి బాధితులను కాపాడారు. ఈ ఘటన ఆదోనిలో కలకలం రేపింది. దాడి చేసింది ఎమ్మెల్యే అనుచరులు కావడంతో మరింత చర్చ జరిగింది.

రోడ్డు బాగోలేదన్న ఇద్దరిని కారులో ఎత్తుకెళ్లి చితక్కొట్టారు!

ఎమ్మెల్యే కారులో వెళ్తున్న సమయంలో ఆదోనిలో రోడ్లు అద్వాన్నంగా ఉన్నాయని ఆటో డ్రైవర్‌ రవి.. ఒక పూల వ్యాపారితో కామెంట్‌ చేశారు. అక్కడే ఉన్న పార్టీ కేడర్‌.. వీరిద్దరి ఫొటోలు తీసుకొని వెళ్లారట. కొద్ది నిమిషాల్లోనే కారులో వచ్చిన కొందరు వారిద్దరినీ తీసుకెళ్లి చితక్కొట్టారు. ఎమ్మెల్యే ఇంటికి సైతం తీసుకెళ్లి సాయిప్రసాద్‌ రెడ్డి ఎదురుగానే మరోసారి చేయి తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది. చివరకు ఆటో డ్రైవర్‌ రవి ఓ కార్మిక సంఘం నాయకుడని తెలుసుకుని వదిలేశారట. ఈ ఘటనపై కార్మికులు ఆందోళనకు దిగడంతో.. పోలీసులు కేసు నమోదు చేయక తప్పలేదు.

పెన్షన్‌ మంజూరు చేయలేదని ఎమ్మెల్యే అనుచరుడి వీరంగం!
పట్టాగా ఇచ్చిన భూమిని కబ్జా చేసి.. అడ్డుకున్న బాధితులపై దాడి!

మండగిరి సచివాలయంలో పెన్షన్‌ మంజూరు ఆలస్యమైందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. డిజిటల్‌ అసిస్టెంట్‌పై ఎమ్మెల్యే అనుచరుడు పోతుల సురేష్‌ చేసిన వీరంగం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. సచివాలయ ఉద్యోగులు ఆందోళన చేయడంతో సురేష్‌ను పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్టు వైసీపీ నేతలు ప్రకటించారు. ఇక ప్రశాంత్‌ నగర్‌లో ఇంటి పట్టా పొందిన లబ్ధిదారుల స్థలాలను కొందరు ఎమ్మెల్యే అనుచరులు కబ్జా చేయడంతో పెద్ద గొడవే జరిగింది. బాధితులపై దాడులు చేశారు. దీనిపైనా కేసు నమోదైంది. ఈ విధంగా అనుచరులు రెచ్చిపోతున్నా.. ఎమ్మెల్యే మౌనంగా ఉండటం పార్టీ వర్గాలను ఆశ్చర్యపరుస్తోందట. పైకి సాయి ప్రసాద్‌రెడ్డికి ఈ గొడవలతో సంబంధం లేదని చెబుతున్నా.. నిప్పు లేనిదే పొగ రాదుగా అన్నది వైరివర్గాల ప్రశ్న. కాకపోతే ఎన్నడూ లేని విధంగా వెలుగులోకి వస్తున్న గొడవలే ఆదోని ప్రజలను కంటిపై కునుకు లేకుండా చేస్తున్నాయట. మరి.. వీటికి ఎవరు చెక్‌ పెడతారో చూడాలి.

Related Articles

Latest Articles

-Advertisement-