టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల అలక వీడారా?..

అంతా సెట్‌ చేశారా? అడిగినవన్నీ చేస్తామన్నారా? అలిగి.. ఆరోపణలు చేసి.. పంతం నెగ్గించుకున్నారా? అందుకే సైలెంట్‌ అయ్యారా? ఇంతకీ ఎవరా నాయకుడు? ఏమా కథ?

ఊహాగానాలు, చర్చలకు గోరంట్ల ట్వీట్‌ ఫుల్‌స్టాప్‌ పెట్టినట్టేనా?

రాజీనామా లీకేజీలతో టీడీపీలో కలకలం రేపిన పొలిట్‌బ్యూరో సభ్యుడు, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి అలక వీడినట్టు తాజా పరిణామాలు చెబుతున్నాయి. జ్వరంతో బాధపడుతున్న తనను పార్టీ అధినేత చంద్రబాబు ఫోన్లో పరామర్శించి.. త్వరగా ప్రజాక్షేత్రంలోకి రావాలని ఆకాంక్షించారని ట్వీట్‌ చేస్తూ రాజకీయ భవిష్యత్‌పై క్లారిటీ ఇచ్చారు గోరంట్ల. దీంతో ఆయన బెదిరింపులు టీకప్పులో తుఫానేనని.. ఆయన పార్టీ మారడం లేదన్న విషయం స్పష్టమైందని టాక్‌. రాజీనామా లీకులతో గోరంట్ల బుచ్చయ్యచౌదరిపై సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ఊహాగానాలు.. చర్చలకు ఫుల్‌స్టాప్ పడిందని అనుకుంటున్నారు.

మంతనాలు.. ఫోన్‌ బుజ్జగింపులు వర్కవుట్‌ అయ్యాయా?

పదవుల కేటాయింపుల్లో తనను చిన్న చూపు చూస్తున్నారని బుచ్చయ్య చౌదరి అసంతృప్తి వ్యక్తం చేశారు. టీడీపీ ప్రభుత్వంలో మంత్రి పదవి ఇవ్వకుండా తొక్కి పెట్టారని.. అందువల్ల కేబినెట్‌ హోదా కలిగిన PAC ఛైర్మన్‌ పదవి ఇవ్వాలని అధిష్ఠానాన్ని కోరారు. దానికి టీడీపీ పెద్దల నుంచి సానకూల స్పందన రాలేదు. టీడీపీ రాష్ట్ర కమిటీ పదవుల్లో సైతం ఆయన సూచించిన వారికి చోటు ఇవ్వలేదు. దాంతో రాజీనామా ప్రస్తావన బయటపెట్టారు బుచ్చయ్య. గత నెల 25నే రాజీనామా లేఖను అధిష్ఠానానికి ఇస్తానని చెప్పారు. ఈలోగా రెండు త్రిసభ్య కమిటీలు బుచ్చయ్యను బుజ్జగించే పని చేపట్టడం, చంద్రబాబు, అచ్చెన్నాయుడులు ఫోన్‌లో మాట్లాడటంతో పరిస్థితి చల్లబర్చినట్టు తెలుస్తోంది.

సోదరుడి కుమారుడిని వారసుడిగా ప్రకటించారా?
రాజమండ్రి రూరల్ సీటుపై ముందే కర్ఛీప్‌?

ప్రస్తుతం గోరంట్ల అలక వీడారా లేదా అన్నది పార్టీలో చర్చగానే ఉంది. అధిష్ఠానం ముందు పెట్టిన డిమాండ్లను నెరవేర్చుకున్నారా లేదో కూడా అనుచరులకు అంతుబట్టడం లేదట. వాస్తవానికి బుచ్చయ్య ప్రస్తావించిన అంశాలపై పార్టీలో అంతర్గతంగానే చర్చ జరిగింది. గోరంట్ల కానీ.. పార్టీ నేతలు కూడా దీనిపై ఎక్కడా బయట మాట్లాడలేదు. అయితే 74 ఏళ్ల బుచ్చయ్య చౌదరి తన సోదరుడి కుమారుడు రాజకీయ భవిష్యత్‌ కోసం అధిష్ఠానం ముందు డిమాండ్‌ పెట్టినట్టు తెలుస్తోంది. గోరంట్ల సోదరుడి కుమారుడు రవిరామ్‌ కిరణ్‌ వృత్తిరీత్యా వైద్యుడు. ఆయన్నే తన రాజకీయ వారసుడిగా ప్రకటించుకున్నారు. రవిరామ్‌ కిరణ్‌ పెద్దగా క్రియాశీలకంగా లేరు. రానున్న ఎన్నికల్లో టీడీపీతో పొత్తు కుదిరితే కాపు సామాజికవర్గ ఆధిపత్యం ఉన్న రాజమండ్రి రూరల్ సీటును జనసేనకు కేటాయించే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే గోరంట్ల ముందస్తు వ్యూహంలో భాగంగానే పార్టీ అధిష్ఠానంపై ఒత్తిడి తెస్తున్నారని అనుకుంటున్నారట. ముందుగా రూరల్‌ సీటుమీద కర్చీఫ్‌ వేసి తనదే అని అనిపించుకున్నారట. అంతేకాదు.. అధిష్ఠానం ముందు ఆయన లేవనెత్తిన డిమాండ్లకు పరిష్కారం కూడా దొరికిందనే ప్రచారం ఉంది. అందుకే అంత ఎత్తున ఎగిరిపడి పార్టీ నాయకత్వాన్ని దుమ్ముదులిపేసిన బుచ్చయ్య చౌదరి సైలెంట్‌ అయ్యారు. మరి.. బాబు చెప్పినట్టు గోరంట్ల అలకవీడి ప్రజాక్షేత్రంలోకి వస్తారో లేదో చూడాలి.

Related Articles

Latest Articles

-Advertisement-