ఏపీ అధికార పార్టీ శిబిరంలో అలజడి రేపుతున్న ప్రజాప్రతినిధుల జల్సాలు…!

జల్సారాయుళ్లు..! ఏపీ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌. మంత్రి బాలినేని రష్యా టూర్‌పై చర్చ జరుగుతున్న సమయంలోనే.. ఇదేతరహాలో ఎంజాయ్ చేస్తున్న మరికొందరిపై ఫోకస్‌ పడింది. ప్రభుత్వవర్గాలు ఆరా తీస్తున్నాయట. అలా తీగకు తగిలిందే.. గోవా టూర్‌..! అధికారపార్టీ శిబిరంలో అలజడి రేపుతోంది. అదేంటో ఈ స్టోరీలో చూద్దాం.

బాలినేని రష్యా టూర్‌పై చర్చ ఆగలేదు.. తెరపైకి మరో పర్యటన!

ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి రష్యా టూర్‌ ఓ హాట్‌టాపిక్‌. విలసవంతమైన ప్రైవేట్‌ జెట్‌లో రష్యా వెళ్లడం.. ఆ ఫొటోను మంత్రి ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్‌ చేయడంతో చర్చగా మారింది.. రచ్చ రచ్చ అవుతోంది. విపక్ష పార్టీలకు మంత్రి కార్నర్‌ అయ్యారు. టీడీపీ ఓ రేంజ్‌లో విరుచుకుపడుతున్న సమయంలో.. అదే విమానంలో తనతోపాటు టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ కూడా ఉన్నారని మంత్రి చెప్పడంతో తెలుగుదేశం శ్రేణులు ఇరకాటంలో పడ్డాయి. అయినప్పటికీ బాలినేని టూర్‌పై చర్చ ఆగలేదు. ఇదే సమయంలో కొత్త ప్రచారం తెరపైకి వచ్చింది. అది ఇంకాస్త రక్తి కట్టిస్తుండటంతో రకరకాల విశ్లేషణలు బయటకొస్తున్నాయి.

పార్టీలోని సుఖ పురుష్‌లపై పెద్దల నజర్‌!
గోవా వెళ్లి ఎంజాయ్‌ చేసి వచ్చిన సీమ నేతల బృందం?
గోవా వెళ్లిన వారిలో ఓ మంత్రి, ఇద్దరు ఎమ్మెల్యేలు!

అధికారపార్టీలో మంత్రి బాలినేని తరహాలో జల్సారాయుళ్ల బ్యాచ్‌లు మరికొన్ని ఉన్నాయట. ఈ తరహా సుఖ పురుషుల మీద ప్రభుత్వ నిఘా వర్గాల నజర్‌ పడిందట. ఈ సందర్భంగా నిఘా వర్గాలకు ఆసక్తికర విషయాలు తెలిసినట్టు ప్రచారం జరుగుతోంది. కొంతకాలం క్రితం నేతల బృందం ఒకటి.. విదేశాలకు కాకున్నా.. గోవా వెళ్లి వచ్చిందట. వారంతా రాయలసీమలో ఒకే జిల్లాకు చెందిన వారట. ఆ బృందంలో ఒక మంత్రి.. మరో ఇద్దరు ఎమ్మెల్యేలతోపాటు మరికొందరు ప్రజాప్రతినిధులు ఉన్నట్టు సమాచారం. గోవాలో నాలుగైదురోజులపాటు ఖరీదైన హోటల్లో.. సముద్రం వ్యూ పాయింట్లో ఉన్న రూమ్‌ తీసుకున్ని అన్నిరకాలుగా సేదతీరారట.

గోవాలో ఖరీదైన హోటల్‌లో ఓ ఎమ్మెల్యే పెట్టుబడి!

సరే వెళ్తే వెళ్లారు. వెళ్లే తప్పేంటి? అనొచ్చు. కానీ.. ఎందుకెళ్లారన్నదే ఇప్పుడు ప్రశ్నగా మారింది. గోవా వెళ్లిన బృందంలో ఓ ఎమ్మెల్యే అక్కడి ఖరీదైన హోటల్‌లో పెట్టుబడులు పెట్టారట. ఆ హోటల్‌ను ఇటీవలే ప్రారంభించడంతో.. ఆ కార్యక్రమానికి వెళ్లి అన్నీరకాలుగా ఎంజాయ్‌ చేసి వచ్చారట. పైగా ఈ బృందం గోవా వెళ్లడం కన్నా.. అక్కడ ప్రైవేట్‌ హోటల్‌లో పెట్టిన పెట్టుబడులపైనే అధికారపార్టీలో ఎక్కువ చర్చ జరుగుతోందట. గోవా హోటల్‌లో పెట్టుబడి పెట్టడానికి అంత సొమ్ము ఎక్కడి నుంచి వచ్చింది? భారీగా పెట్టుబడి పెట్టిన ఎమ్మెల్యే ఎవరు? అని ఆరాలు తీస్తున్నట్టు సమాచారం.

అనుమానం రాకుండా వేర్వేరు ప్రాంతాల నుంచి గోవా వెళ్లారట!

ఈ గోవా టూర్‌లో మరో ట్విస్ట్‌ కూడా ఉందట. స్వస్థలాల నుంచి గోవా వెళ్తే అందరికి డౌట్‌ వస్తుందని అనుకున్నారో ఏమో.. వేర్వేరు ప్రాంతాల నుంచి తాము అనుకున్న డెస్టినీకి చేరుకున్నారట బృందంలోని ప్రజాప్రతినిధులు. పైగా గోవా టూర్‌ గురించి ఎక్కడా బయటపడకుండా వారు తీసుకున్న జాగ్రత్తలు చర్చల్లో హైలైట్‌గా మారాయి. మొత్తంమీద మంత్రి బాలినేని రష్యా టూర్‌ పుణ్యమా అని గోవా ఎపిసోడ్‌ బయటకు రావడంతో.. పార్టీలో ఉన్న ఇతర జల్సారాయుళ్లపై ప్రభుత్వ పెద్దలు దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. దీంతో ఇటీవల కాలంలో ఎంజాయ్‌మెంట్‌ టూర్లకు వెళ్లినవారు ఎవరికి వారుగా గప్‌చుప్‌ అయినట్టు టాక్‌.

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-