రసవత్తరంగా మంగళగిరి రాజకీయాలు..!

ఆ జిల్లాలో వైసీపీ, టీడీపీల మధ్య నలిగిపోతున్నారు అధికారులు. ఏ పని చేస్తే ఎవరు విరుచుకుపడతారో తెలియక ఆందోళన చెందుతున్నారట. ఈ టెన్షన్‌ అంతా ఒక సర్టిఫికెట్‌ కోసం. దానిపైనే పెద్ద పొలిటికల్‌ ఫైటే జరుగుతోంది. రాజకీయం రసవత్తరంగా మారుతోంది.

దుగ్గిరాలలో క్యాస్ట్‌ సర్టిఫికెట్‌ రగడ..!

కరవమంటే కప్పకి కోపం.. విడవమంటే పాముకి కోపం. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని దుగ్గిరాల పొలిటికల్‌ పంచాయితీకి ఈ సామెత చక్కగా సరిపోతుంది. దుగ్గిరాల మండల పరిషత్‌ ఎన్నిక కోసం టీడీపీ ఎంపీపీ అభ్యర్థిగా ప్రచారంలో ఉన్న ముస్లిం MPTCకి కుల ధ్రువీకరణ పత్రం ఇవ్వాలి. ఎంపీపీ సీటుపై వైసీపీ కూడా ఉడుంపట్టు పట్టడంతో సర్టిఫికెట్‌ జారీ వివాదంలో పడింది. సాధారణంగా క్యాస్ట్‌ సర్టిఫికెట్‌ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎన్నికల కోడ్‌ ప్రకారం 24 గంటల్లో దానిని జారీ చేయాలన్నది రూల్‌. వైసీపీ, టీడీపీ ఆధిపత్యపోరు మధ్య దుగ్గిరాలలో ఆ రూల్‌ గాయబ్‌.

తెర వెనక జోరుగా రాజకీయాలు..!

దుగ్గిరాల ఎంపీపీ సీటును దక్కించుకోవడానికి టీడీపీకి మెజారిటీ ఉంది. అయితే ఈ సీటును కోల్పోవడం వైసీపీకి ఇష్టం లేదు. మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే ససేమీరా అంటున్నారట. రెండు పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో రాజకీయం రసకందాయంలో పడింది. తెరవెనక రాజకీయాలు జోరుగా సాగుతున్నాయి.

ఆందోళనలో రెవెన్యూ ఉద్యోగులు..!

టీడీపీ తమ ఎంపీటీసీలను విప్ జారీ చేసి మరీ క్యాంప్‌లో పెట్టుకుంటే.. టీడీపీ అభ్యర్థికి కుల ధ్రువీకరణ పత్రం నిలిపివేస్తే కచ్చితంగా MPP సీటును కైవశం చేసుకోవచ్చని ఎమ్మెల్యే ఆర్కే ప్లాన్‌ వేశారట. అందుకే రెవెన్యూ శాఖ టీడీపీ ఎంపీపీ అభ్యర్థికి కుల ధ్రువీకరణ పత్రం ఇవ్వడం లేదని ప్రచారం జరుగుతోంది. ఇదే రెవెన్యూ శాఖకు ప్రాణసంకటంగా మారిందట. క్యాస్ట్ సర్టిఫికెట్ ఇస్తే అధికారపార్టీ ఎమ్మెల్యేకి కోపం.. ఇవ్వకపోవడంతో ఇప్పటికే టీడీపీ కోర్టుకు వెళ్లింది. దీంతో ఏ పని చేస్తే ఎక్కడ తమ ఉద్యోగాలు పోతాయో అని రెవెన్యూ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారట.

మళ్లీ కోర్టుకు వెళ్లేందుకు టీడీపీ యత్నం..!

క్యాస్ట్‌ సర్టిఫికెట్‌ ఇవ్వకపోతే.. ఎందుకు ఇవ్వలేదో నిబంధనల ప్రకారం చెప్పాలి. కోర్టుకు జవాబు ఇవ్వాలి. ఒకవేళ క్యాస్ట్‌ సర్టిఫికెట్‌ ఇస్తే అధికారపార్టీ ముందు తలవంచుకుని నిలబడాలి. లేదంటే పెట్టే బేడా సర్దుకుని ఏ మారుమూల ప్రాంతానికో ట్రాన్స్‌ఫర్‌. అందుకే ఏం చేయాలో అర్థంకాక తలలు పట్టుకుంటున్నారు రెవెన్యూ అధికారులు. ఇప్పటికే కోర్టు ఆదేశాలతో కలెక్టర్‌ను కలవడానికి ప్రయత్నిస్తున్నారు టీడీపీ నేతలు. కలెక్టర్‌ అపాయింట్‌మెంట్‌ ఇవ్వడం లేదన్నది టీడీపీ ఆరోపణ. మరోసారి కోర్టు తలుపు తట్టేందుకు చూస్తున్నారు. ఇప్పుడీ వివాదం ఎలాంటి మలుపు తిరుగుతుందో.. ఏ అధికారి కొంప ముంచుతుందో తెలియక రెవెన్యూ అధికారులు టెన్షన్‌ పడుతున్నారట.

-Advertisement-రసవత్తరంగా మంగళగిరి రాజకీయాలు..!

Related Articles

Latest Articles