మధురవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం లెక్కే వేరు !

రిజిస్ట్రేషన్ల శాఖలో అదో హాట్ సీట్. ప్రస్తుతం ఖాళీగా వుంది. దీంతో అందరి చూపూ ఆ పోస్టింగ్ పైనే పడింది. ఎలాగైనా అక్కడ పాగా వేసేందుకు ఎత్తులు వేస్తున్నారట. పైరవీలు పెరిగిపోవడంతో తాత్కాలికంగా అక్కడ నియమాకాన్ని అధికారులు పక్కన పెట్టేశారట. ఇంతకీ ఆ పోస్ట్ ఎక్కడ వుంది? దానికి ఎందుకంత డిమాండ్…?.

స్టీల్ సిటీ విశాఖపట్టణం ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక రాజధాని. కాబోయే ఎగ్జిక్యూటివ్ కేపిటల్. మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే ఇక్కడ స్ధిరాస్తుల విలువ ఏటి కేడాది పెరుగుతుంది. ఏటా వందల కోట్ల రూపాయల రియల్ ఎస్టేట్ లావాదేవీలు కూడా జరుగుతున్నాయి. భూములు, అపార్ట్ మెంట్ల క్రయవిక్రయాలకు సీజన్ తో సంబంధం వుండదు. దీంతో విశాఖ నగరంలోని రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఎప్పుడూ కళకళలాడుతూనే వుంటాయి. మిగిలిన అన్ని ఆఫీసులది ఓ లెక్కైతే….మధురవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానిది మరోలెక్క.

రాష్ట్రంలోనే అత్యంత ప్రాధాన్యం కలిగిన, ఆదాయం ఎక్కువ వచ్చేదిగా మధురవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం గుర్తింపు పొందింది. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ లెక్కల్లో ఇద్ది హాట్ సీట్. ఇక్కడ సబ్ రిజిస్ట్రార్ దగ్గర నుంచి దిగువ స్ధాయి సిబ్బంది పోస్టింగ్ వరకు డిమాండ్ ఎక్కువ.
రెవెన్యూ పరంగా ఎంతటి ప్రాధాన్యత కలిగి వుందో ఈ ఆఫీస్ పై అదే స్ధాయిలో ఆరోపణలు ఎక్కువ. 2019లో మధురవాడతో పాటు రెవెన్యూ ఎక్కువ సాధించే మరికొన్ని చోట్ల సబ్‌రిజిస్ట్రార్లను ప్రభుత్వమే నేరుగా నియమించింది. ఏపీపీఎస్సీ ద్వారా నేరుగా ఉద్యోగం పొందిన యువ అధికారులకు బాధ్యతలు అప్పగించింది. రెవెన్యూశాఖ తీసుకున్న ఈ నిర్ణయం అప్పట్లో సంచలనంగా మారింది. పోస్టింగ్ అక్రమాలను నియంత్రించడానికి ఈ తరహా చర్యలు చేపట్టిందనే మంచి పేరు ప్రభుత్వానికి వచ్చింది. అయితే, మధురవాడతో సహా మరికొన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయలపై తక్కువ కాలంలోనే చాలా ఫిర్యాదులు వచ్చాయి.

దీంతో రాష్ట్రంలోని 12 కార్యాలయాల్లో అవినీతి నిరోధక శాఖ ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. అప్పటి సబ్ రిజిస్ట్రార్ తారకేషు సహా పలువురిపైన అభియోగం మోపింది. ఇలా తనిఖీలు జరిగిన అన్ని కార్యాలయాల్లో పనిచేసే సబ్‌రిజిస్ట్రార్లతో పాటు, అక్కడ పనిచేసే ఇతర ఉద్యోగులను మరో చోటుకు డిప్యుటేషన్‌పై పంపారు. మధురవాడ సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఒక్క సబ్‌రిజిస్ట్రార్‌ను తప్ప ఇతర ఉద్యోగులు ఎవర్నీ మార్చలేదు. ఏసీబీ సోదాల వ్యవహారం ప్రభుత్వ విభాగాల మధ్య పెద్ద దుమారమే రేపింది. అవినీతి నిరోధకశాఖ వైఖరిని అప్పట్లో మంత్రులు విమర్శించడం చర్చనీయాంశంగా మారింది.

అయితే, మధురవాడ సబ్ రిజిస్ట్రార్ ను అటాచ్ చేయగా….అప్పటి మంత్రి జోక్యంతో తిరిగి పోస్టింగ్ ఇచ్చారు. ఈ పరిణామాలు అన్నీ ముగిసి అంతా గాడినపడినట్టే అని భావిస్తున్న తరుణంలో… మరోసారి మధురవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వార్తల్లో నిలిచింది. సబ్ రిజిస్ట్రార్ వ్యవహారశైలి నచ్చకపోవడంతో బదిలీ వేటు వేశారు ఉన్నతాధికారులు. ఇది జరిగి నెలలు గడిచిపోతుండగా ప్రస్తుతం ఇన్చార్జి ఆధ్వర్యంలో సబ్ రిజిస్ట్రార్ ఆధ్వర్యంలో కార్యకలాపాలు జరుగుతున్నాయి. అయితే, అత్యంత కీలకమైన మధురవాడ సబ్ రిజిస్ట్రార్ పోస్ట్ ను ఇన్చార్జ్ లతో కొనసాగించడం సరైన విధానం కాదనే అభిప్రాయం వుంది.

రాజధాని ప్రాంతంగా ప్రచారంలో వున్న ఏరియాలో అధికశాతం ఈ కార్యాలయం పరిధిలోకి వస్తుంది. ప్రస్తుతం జోన్‌-1 పరిధిలోని విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో అర్హులైన వారికి పదోన్నతులు కల్పించి… ఖాళీగా ఉన్న స్థానాలను భర్తీ చేయనున్నారు. ఐతే, కీలకమైన మధురవాడ సబ్ రిజిస్ట్రార్ పోస్ట్ ఖాళీగా వుండటంతో ఇటీవల పైరవీలు జోరందుకున్నాయట. పోస్టింగ్ కోసం ప్రయత్నాలు ఎక్కువవ్వడం అధికారులకు తలనొప్పిగా మారిందనే ప్రచారం కూడా వుంది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-