అప్పన్న సన్నిధిలో ఆరేళ్లపాటు సర్వాధికారిగా విధులు!

దేవుడి సన్నిధిలో ఆరేళ్లపాటు ఆయనే సర్వాధికారి. ప్రభుత్వ పెద్దలతో స్నేహాలు.. రాజకీయ నాయకులతో పరిచయాలు.. చేతిలో అధికారం.. డోంట్ కేర్ అనే తత్వం. ఇంకే ముంది.. అంతా తానై చక్రం తిప్పారు. కాలం మారింది. అసలు కథ ఇప్పుడు మొదలైంది. ఇంతకీ అంతా ఆయనే చేశారా? ఆయన వెనక ఇంకెవరైనా ఉన్నారా? ఈ తవ్వకాలన్నీ ఆ అదృశ్య శక్తి కోసమేనా?

సింహాచలం భూముల రగడలో ప్రభుత్వ యాక్షన్‌ ఏంటి?

సింహాచలం భూముల వ్యవహారం ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ప్రాపర్టీ రిజిస్టర్ నుంచి భూముల మాయం వెనక సూత్రధారులు, పాత్రధారులను గుర్తించి చర్యలకు సిద్ధమవుతోంది. ఈ దశలో దేవాదాయ శాఖ నియమించిన త్రిసభ్య కమిటీ ఇచ్చిన 108 పేజీల నివేదిక కీలకంగా మారనుంది. నివేదిక ప్రకారం.. దేవస్థానం ఆస్తుల జాబితా నుంచి గల్లంతైన భూమి.. 860 ఎకరాలు. ఈ స్థిరాస్తి మార్కెట్ విలువ సుమారు పదివేల కోట్లుగా ఓ అంచనా. విచారణ కమిటీ నివేదిక పరిశీలన తర్వాత ప్రభుత్వం యాక్షన్ ఎలా ఉంటుందనే ఉత్కంఠ దేవాదాయశాఖలో పెరుగుతోంది.

అందరి దృష్టీ అప్పటి ఈవో రామచంద్రమోహన్‌పైనే!

సింహాచలం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ వివాదం తర్వాత ఆలయం ఆస్తులపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ సమయంలోనే ప్రాపర్టీ రిజిస్టర్ నుంచి భూములు చేతులు మారిన విషయం వెలుగు చూసింది. దీంతో అందరి దృష్టి అప్పటి ఎగ్జిక్యూటివ్ అధికారి కోడూరి రామచంద్ర మోహన్ పై పడింది. ఆయన ఈవోగా ఉన్న సమయంలో నిబంధనలకు విరుద్ధంగా అప్పన్న భూములను అన్యాక్రాంతం చేశారనేది అభియోగం. విచారణ కమిటీ తన నివేదికలో ఇదే అంశాన్ని ప్రస్తావించినట్టు తెలిసింది. ఇందుకు సంబంధించిన కీలక ఆధారాలను కమిటీ సమర్పించింది. నిబంధనల ప్రకారం ప్రాపర్టీ రిజిస్టర్లో భూములను డిలీట్ చేసే అధికారం ఈవోలకు ఉండదు. కేవలం ఎండో మెంట్ ట్రిబ్యునల్, దేవాదాయశాఖ కమిషనర్ మాత్రమే ఎన్. ఓ.సీలు జారీ చేసేందుకు చట్టం నిర్ధేశించింది.

2016లో రెండుసార్లు భూముల తొలగింపునకు ప్రతిపాదనలు

2016-17 కాలంలో సింహాచలం దేవస్థానం ఈవో హోదాలో రామచంద్ర మోహన్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారనేది ప్రధాన ఆరోపణ. ఈయన హయాంలోనే గుట్టు చప్పుడు కాకుండా కాగితాలు మారిపోయాయి. భూముల వివరాలు తారుమారైనట్టు విచారణ కమిటీ గుర్తించింది. విచారణ కమిటీ నివేదిక ప్రకారం.. 2016 సెప్టెంబర్ 19న, అక్టోబర్ 4న రెండుసార్లు భూముల తొలగింపునకు అప్పటి ఈవో ప్రతిపాదించారు. దేవాదాయశాఖ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని అప్పటి అసిస్టెంట్ కమిషనర్ తిప్పి పంపించారు. కానీ ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో.. ముందు తిరస్కరించిన ప్రతిపాదనలకు ఉన్నతాధికారులు ఆమోద ముద్ర వేశారు.

ప్రైవేట్‌ వ్యక్తుల స్వాధీనంలోనే భూములు ఉన్నాయా?
రామచంద్రమోహన్‌ వెనక ఉన్న అదృశ్య శక్తి ఎవరు?

2017 ఏప్రిల్ 24న~భూములను ఆలయ ఆస్తుల జాబితా నుంచి తొలగించేందుకు అనుమతి ఇచ్చినట్టు గుర్తించారు. రికార్డుల నుంచి తొలగించడానికి దారితీసిన పరిస్ధితులు, ఆనాటి ఒత్తిళ్లు, లబ్ధిపొందిన ప్రజాప్రతినిధులు, వారి అనుచరుల కథంతా విచారణ నివేదికలో పొందుపరిచినట్టు తెలిసింది. అయితే ఆ భూములు అప్పుడు పొందిన ప్రైవేట్‌ వ్యక్తుల స్వాధీనంలోనే~ఉన్నాయా..? వేరే చేతులు మారాయా…?~ అన్నది కీలకంగా మారింది. ఈ మొత్తం కుంభకోణం ఒక్క రామచంద్రమోహన్‌ చేతులు మీదుగానే జరిగిందా? లేక ఆయన వెనక మరెవరైనా ఉన్నారా అన్నది కూపీ లాగుతున్నారు. రామచంద్రమోహన్‌ ఒక్కరే లబ్ధి పొంది.. ఇలా లేని అధికారంతో స్వామి వారి భూములను అన్యాక్రాంతం చేశారంటే నమ్మశక్యం కాదంటున్నారు. బలమైన రాజకీయ నేపథ్యం ఉంటే తప్ప ..ఆయన ఆ స్థాయి నిర్ణయాన్ని తీసుకుని ఉండరని అనుకుంటున్నారు. ఇప్పుడు ప్రభుత్వానికి ప్రధాన టార్గెట్‌ రామచంద్రమోహన్‌ వెనక ఉన్న ఆ అదృశ్య శక్తే. ఇప్పుడు ఆ అదృశ్య శక్తి పట్టే పనిలో ప్రభుత్వం ఉంది.

నాలుగు కేటగిరీలలోని భూములను తొలగించారా?
మాన్సాస్‌కు చెందిన 150 ఎకరాలను రూల్స్‌ ప్రకారం విక్రయించారా?

ఈ ఎపిసోడ్‌లో ప్రభుత్వం చర్యలు తీసుకుంటే ముందు వరుసలో అప్పటి ఈవో కోడూరి రామచంద్ర మోహనే ఉంటారట. ముందు ఆయన్నను ఫిక్స్‌ చేస్తే తప్ప ఆయన వెనక ఉన్న వారు బయటకు లాగలేరు కాబట్టి అక్కడ నుంచే చర్యలు మొదలుపెట్టారు. రామచంద్రమోహన్‌ను ఇటీవల దేవాదాయశాఖ ప్రభుత్వానికి సరెండర్ చేసింది. ఇప్పుడు త్రిసభ్య కమిటీ నివేదికలో దీన్లో ఉన్న మరి కొన్ని పేర్లు ప్రస్తావించినట్టు సమాచారం. వాస్తవానికి ఆలయ ఆస్తుల జాబితా నుంచి నాలుగు కేటగిరీలలోని భూములను తొలగించినట్టు తేలింది. ఇనామ్ భూముల కేటగిరీలో తొలగించిన వాటిలో 21 సర్వే నెంబర్లకు సంబంధించి ‘మీ భూ’ పొర్టల్లో ఇప్పటికీ ఆలయం భూముల పేరుతోనే ఉన్నట్టు సమాచారం. దీనికి సంబంధించి అప్పటి ఈవో, దేవాదాయశాఖ కమిషనర్ కార్యాలయం మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగినట్టు తేలింది. రామచంద్ర మోహన్ ఆరేళ్లు సింహాచలం ఈవో గా పని చేశారు. మాన్సాస్‌కు ఈవోగా ఉన్నారు. మాన్సాస్‌కు చెందిన 150 ఎకరాల విక్రయంలో నిబంధనల మేరకు నడుచుకున్న ఆయన సింహాచలం భూముల విషయంలో ఎందుకు రూల్స్‌కు విరుద్ధంగా చేశారన్నదే ప్రశ్న. ఆలయ ఈవోగా ఆయన హయాంలో అభివృద్ధి పనులు జరిగినప్పటికీ.. గుట్టు చప్పుడు కాకుండా జరిగిన వ్యవహారాలు ఇప్పుడు బయటపడుతున్నాయి. దీంతో చర్యలు ఎవరి మీద ఉంటాయి? ఎలా ఉంటాయనేది తేలాల్సి ఉంది.

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-