నామినేటెడ్‌ పదవుల భర్తీలో అన్యాయం జరిగిందా?

నామినేటెడ్‌ పదవుల భర్తీలో అన్యాయం జరిగిందని వాపోతున్నారు కర్నూలు వైసీపీ సీనియర్లు. ఎమ్మెల్యేలు సిఫారసు చేశారు ఇక తిరుగే ఉండదు అనుకున్న నేతలకు తాజా పదవుల పంపకాల్లో నిరాశే మిగిలింది. స్థానికంగా సీనియర్లు అనిపించుకున్న నేతలనూ హైకమాండ్‌ పక్కన పెట్టేయడం ఏ లెక్కలోనో అర్థంకాక తలపట్టుకుంటున్నారు.

ఎమ్మెల్యేలు సిఫారసు లేఖలు ఇచ్చినా పదవుల్లేవ్‌!

కర్నూలు జిల్లాలో వైసీపీ సీనియర్లు.. నాయకులకు కొదవ లేదు. దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డితో సాన్నిహిత్యం ఉండి.. వైసీపీ ఆవిర్భావం నుంచి జెండా మోస్తున్న వాళ్లు అనేక మంది ఉన్నారు. ఇటీవల ప్రకటించిన నామినేటెడ్‌ పదవుల్లో జిల్లాకు ఆరు రాష్ట్రస్థాయి, 4 జిల్లా స్థాయి పోస్ట్‌లు దక్కాయి. అయితే పదవులు ఆశించిన వారి జాబితా ఎక్కువగా ఉండటం.. కొందరికే పట్టం కట్టడంతో.. అసంతృప్తులు గట్టిగానే ఉన్నాయి. ఎమ్మెల్సీ, ఛైర్మన్‌ పదవులు ఆశించినవారికి సైతం నిరాశ తప్పలేదు. ఎమ్మెల్యేలు సిఫారసు లేఖలు ఇచ్చినా.. పదవి దక్కలేదని మరికొందరు వాపోతున్నారట.

డైరెక్టర్‌, మెంబర్‌ పోస్టుల కోసం ద్వితీయశ్రేణి నేతల ఎదురు చూపులు!
ఒకటి రెండేళ్ల తర్వాతైన ఛాన్స్‌ ఉంటుందా?

శ్రీశైలం ఆలయం ట్రస్ట్ బోర్డు చైర్మన్‌గా చిత్తూరు జిల్లాకు చెందిన చక్రపాణిరెడ్డిని నియమించారు. ఈ పదవికోసం కర్నూలు జిల్లా నేతలు ఆశపడ్డారు. ట్రస్ట్ బోర్డ్ మెంబర్ పదవైనా దక్కుతుందా లేదా అని ద్వితీయశ్రేణి నాయకులు ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతున్నారు. నంద్యాలలో వైసీపీ సీనియర్ నేత రాజగోపాల్ రెడ్డి గతంలో మున్సిపల్ చైర్మన్ పదవిని ఆశించారు. గతంలో YSతో ప్రస్తుతం సీఎం జగన్‌తో ఆయనకు మంచి సంబంధాలే ఉన్నాయి. 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించారు. ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పడంతో వెనక్కి తగ్గారు. ఎమ్మెల్సీని చేస్తారో లేదో తెలియడం లేదు. ఇటు నామినేటెడ్‌ పదవీ దక్కలేదు. హైకమాండ్‌ హామీ ఇచ్చిన ఎమ్మెల్సీ పదవి దక్కాలంటే మరో ఏడాదో.. రెండేళ్లో వేచి ఉన్నా అప్పుడేం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు రాజగోపాల్ రెడ్డి వర్గీయులు.

భార్యకు పదవి ఇచ్చినా భర్తకు అసంతృప్తే!

వైసీపీ రాష్ట్ర కార్యదర్శి తెరనేకల్ సురేందర్‌రెడ్డి కూడా చైర్మన్ పదవికోసం తీవ్రంగా ప్రయత్నించారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు ఆలూరు ఎమ్మెల్యేగా నీరజారెడ్డి ఉన్నారు. సురేందర్‌రెడ్డి, నీరజారెడ్డిలది ఒకే ఊరు తెరనేకల్‌. అయినప్పటికీ ఎమ్మెల్యేను కాదని నాడు జగన్‌ వెంట నడిచారు. పాదయాత్రలో తెరనేకల్‌లో సురేందర్‌రెడ్డి ఇంట్లోనే జగన్‌ బస చేశారు. అయినప్పటికీ ఇప్పుడు ప్రకటించిన జాబితాలో సురేందర్‌రెడ్డి పేరు లేదు. కుడా చైర్మన్ పదవి కోట్ల హర్షవర్ధన్ రెడ్డికి దక్కింది. వాస్తవానికి వైసీపీ నగర అధ్యక్షుడు రాజా విష్ణువర్ధన్ రెడ్డి కుడా చైర్మన్ పదవిని ఆశించారు. కాకాపోతే రాజా సతీమణి మహాలక్ష్మికి డీసీసీబీ చైర్మన్ పదవి ఇవ్వడంతో కొంత బ్యాలెన్స్‌ అయింది. అయినా రాజా విష్ణువర్ధన్ రెడ్డి అసంతృప్తితోనే ఉన్నారట.

విద్యార్థి దశ నుంచి పార్టీలో ఉన్నా దక్కని అదృష్టం!

వైసీపీ ఆవిర్భావం నుంచి పనిచేసిన బెల్లం మహేశ్వర్ రెడ్డి గ్రంథాలయ చైర్మన్ పదవిని ఆశించారు. ఆయనకు 9 మంది ఎమ్మెల్యేలు సిఫారసు చేశారట. అయితే వాల్మీకి రిజర్వేషన్ పోరాటసమితి అధ్యక్షుడు సుభాష్ చంద్రబోస్‌కి ఆ పదవి దక్కింది. జగన్ యువసేనలో మొదటి నుంచి చురుగ్గా ఉన్న సత్యం యాదవ్‌కు అయితే తాజా పంపకాలలో ఏ పదవి దక్కలేదు. విద్యార్థి దశ నుంచి కూడా ఆయన YSR కుటుంబాన్ని అంటిపెట్టుకొని ఉన్నారు. ఈ విధంగా జూనియర్లు.. సీనియర్లు పదవులు రాక దిగాలు పడ్డారు. పదవీ యోగం లేదని ఆందోళన చెందుతున్నారు. మరి.. ఎన్నికల నాటికి ఈ అసంతృప్తి పెద్దది కాకుండా పార్టీ పెద్దలు వారినెలా బుజ్జగిస్తారో చూడాలి.

Related Articles

Latest Articles

-Advertisement-