కర్నూలు జిల్లా నుంచి మంత్రి అయ్యే ఛాన్స్ ఎవరికి… ?

పదవంటే ఎవరికి చేదు? అందులోనూ మంత్రి పదవి అంటే ఎమ్మెల్యేలకు ఒక డ్రీమ్‌..! ప్రస్తుతం అలాంటి కలను సాకారం చేసుకునే పనిలో యాగాలు, యాత్రలను నమ్ముకున్నారు ఆ జిల్లాలోని అధికారపార్టీ ఎమ్మెల్యేలు. అమాత్య అని అనిపించుకోవడానికి ఇదే మంచి తరుణంగా భావిస్తున్నారట. వారెవరో.. ఏంటో ఇప్పుడు చూద్దాం.

కర్నూలు జిల్లా నుంచి మంత్రి అయ్యే ఛాన్స్‌ ఎవరికి?

కేబినెట్‌లో చోటుకోసం కర్నూలు జిల్లాలో సీనియర్ ఎమ్మెల్యేలతోపాటు తొలిసారి గెలిచిన ఒకరిద్దరు సీరియస్‌గా ప్రయత్నాలు చేస్తున్నారు. వైసీపీ పవర్‌లోకి వచ్చాక జిల్లాలోని సీనియర్‌ ఎమ్మెల్యేలలో కొందరికి మంత్రి పదవి ఖాయమని అనుకున్నా.. నిరాశ తప్పలేదు. రెండున్నరేళ్ల తర్వాత మంత్రుల్లో చాలామందిని మారుస్తామని అప్పట్లోనే సీఎం జగన్ చెప్పడంతో తప్పకుండా ఛాన్స్‌ వస్తుందని ఎదురు చూస్తున్నారు శాసనసభ్యులు. ప్రస్తుతం కర్నూలు జిల్లా నుంచి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, గుమ్మనూరు జయరామ్‌లు మంత్రులుగా ఉన్నారు. మినిస్టర్‌ కావాలని అనుకుంటోన్నవారి జాబితా మాత్రం పెద్దగానే ఉండటంతో ఎవరికి ఛాన్స్‌ అన్నది ఉత్కంఠగా మారింది.

సీనియర్‌ ఎమ్మెల్యేగా కేబినెట్‌లో చోటుకోసం కాటసాని ఆశ..!

జిల్లాలో ఆరోసారి ఎమ్మెల్యేగా గెలిచిన పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి మంత్రి పదవి రేస్‌లో ఉన్నారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలోనే కేబినెట్‌లో బెర్త్‌ కోసం తీవ్రంగా ప్రయత్నించారు కాటసాని. ఇప్పుడు సీఎం జగన్ హయాంలోనైనా ఆ కోరిక తీరుతుందని ఆశతో ఉండగా టీటీడీ బోర్డు సభ్యునిగా నియమించారు. అయిష్టంగానే టీటీడీ పదవి తీసుకున్నా.. తనకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని వైసీపీ పెద్దలపై ఒత్తిడి చేస్తూనే ఉన్నారట కాటసాని. రాష్ట్రంలోనే అత్యంత సీనియర్ ఎమ్మెల్యేల్లో ఒకడినైన తనను ఈసారి తప్పకుండా మినిస్టర్‌ను చేయాలని కోరుతున్నారట.

బలమైన లెక్కల్లో చక్రపాణిరెడ్డి..!

శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి సైతం తొలిమంత్రివర్గంలోనే చోటు ఆశించారు. రెండుసార్లు ఎమ్మెల్సీగా గెలిచిన ఆయన.. నంద్యాల ఉపఎన్నిక సమయంలో వైసీపీలో చేరారు. ఎమ్మెల్సీగా ఎన్నికైన కొద్దిరోజులకే ఆ పదవికి రాజీనామా చేశారు చక్రపాణిరెడ్డి. నాడు శాసన మండలి ఛైర్మన్‌ పదవి ఇస్తామని టీడీపీ ఆఫర్‌ చేసినా సైకిల్‌ దిగి వెళ్లిపోయారు. వైఎస్ కుటుంబంతో శిల్పా కుటుంబానికి చాలాఏళ్లుగా సాన్నిహిత్యం ఉంది. ఈ దఫా మాత్రం మంత్రి అయ్యేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారట చక్రపాణిరెడ్డి.

సాయిప్రసాద్‌రెడ్డి మంత్రి కావాలని అనుచరుల పాదయాత్ర..!

ఇక ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి మూడోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన మరో ఇద్దరు సోదరులు కూడా ఎమ్మెల్యేలే. బాలనాగిరెడ్డి మంత్రాలయం, వెంకట్రామిరెడ్డి గుంతకల్లు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. సాయిప్రసాద్‌రెడ్డి మంత్రి కావాలని ఆయన అనుచరులు ఊరుకుంద ఆలయానికి పాదయాత్ర నిర్వహించారు. అయితే బాలనాగిరెడ్డి కూడా మంత్రి పదవి ఆశిస్తున్నారట. బాలనాగిరెడ్డి ఫాలోవర్స్‌ కూడా నెలన్నర క్రితం కోసిగి నుంచి మంత్రాలయం వరకు పాదయాత్ర చేశారు. ఇప్పుడు ఊరుకుంద నుంచి శ్రీశైలం వరకు బైక్ ర్యాలీకి ప్లాన్‌ వేశారు.

కర్నూలు, నందికొట్కూరు ఎమ్మెల్యేలు ఆశ..!

తొలిసారి ఎమ్మెల్యేలైన వారి లెక్కలు మరోలా ఉన్నాయి. ఆ జాబితాలో కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌, నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్‌ ఉన్నారట. ముస్లిం ఎమ్మెల్యేలలో కడప జిల్లా నుంచి ఇప్పటికే అంజాద్‌ భాషా డిప్యూటీ సీఎం. అయినప్పటికీ విస్తరణలో సీఎం జగన్‌ కొత్తవారికి అవకాశం కల్పిస్తారని.. తనను పిలుస్తారని హఫీజ్‌ఖాన్‌ లెక్కలేస్తున్నారట. కోవిడ్ సమయంలో తన పనితీరును అధిష్ఠానం మెచ్చుకుందని గుర్తు చేస్తున్నారట. ఇక నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్.. అయితే మంత్రి లేదా ప్రభుత్వ విప్‌ ఖాయమని అనుకుంటున్నట్టు సమాచారం. మరి.. సీఎం జగన్ మనసులో ఎవరున్నారో.. ఎవరికి కేబినెట్‌లో చోటు దక్కుతుందో చూడాలి.

-Advertisement-కర్నూలు జిల్లా నుంచి మంత్రి అయ్యే ఛాన్స్ ఎవరికి... ?

Related Articles

Latest Articles