చంద్రబాబు కుప్పం కోటకు బీటలు?

చంద్రబాబు కంచుకోట కుప్పం కోటలు బీటలు వారుతున్నాయా? మెజార్టీ తగ్గడం, పంచాయతీ ఎన్నికల్లో ఘోర ఓటమి అందుకు సంకేతాలా? టీడీపీ వెనకబాటు ఇప్పటి వరకేనా.. వచ్చే ఎన్నికల్లోనూ ఇలాగే ఉంటుందా? ఏం జరుగుతోంది కుప్పంలో…!

కుప్పం బాబు కోటకు బీటలు వారుతున్నాయా?
నాటి పంచాయతీ ఎన్నికల్లో 89లో టీడీపీకి దక్కింది 14..!

కుప్పం… చంద్రబాబు సొంత నియోజకవర్గం. అక్కడ నుంచి ఆయన ఏడుసార్లు వరసగా గెలుస్తున్నారు. నామినేషన్ వేయడానికి కూడా కుప్పం వెళ్లకుండానే గెలిచేస్తున్నారు చంద్రబాబు. అంటే… అక్కడ జనం అంతలా బాబును నమ్మారు. కానీ ఇటీవల జరుగుతున్న పరిణామాలు కుప్పం కోటకు బీటలు వారుతున్నాయనే అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో మొదటి రెండురౌండ్లు చంద్రబాబు వెనుకబడటం అప్పట్లో సంచలనం అయ్యింది. ఆ తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ మద్దతుదారులు ఘోరంగా ఓడిపోయారు. నియోజకవర్గంలోని 89 పంచాయతీలలో 74 చోట్ల వైసీపీ గెలిస్తే… 14 పంచాయతీలతో టీడీపీ సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ ఎన్నికల ఎఫెక్ట్ చంద్రబాబుకు బాగానే తగిలినట్టుంది. వెంటనే కుప్పం పర్యటనకు వెళ్లారు. మూడు రోజులు అక్కడే మకాం వేశారు. కార్యకర్తలను, నాయకులను పేరు పేరున పలకరించారు. అంతా సెట్ చేసుకున్నారు అనిపించారు. కట్ చేస్తే… పరిషత్ ఎన్నికల్లోనూ అక్కడి జనం మారలేదని రుజువైంది.

కుప్పంలో ఎంపీటీసీల్లో టీడీపీ 3చోట్లే గెలుపు
కుప్పంలో బాబుకు ఎదురుగాలి మొదలైందా?

పరిషత్ ఎన్నికలను టీడీపీ బాయికాట్ చేసింది. కొన్నిచోట్ల మాత్రం స్థానిక నేతలు పోటీకి దిగారు. కుప్పంలోనూ అదే జరిగింది. నియోజకవర్గంలోని 66 ఎంపీటీసీ స్థానాలలో 44 చోట్ల టీడీపీ అభ్యర్ధులు బరిలోకి దిగారు. వీరిలో ముగ్గురు మాత్రమే గెలిచారు. నాలుగు జడ్పీటీసీలలో అయితే టీడీపీ పోటీకి కూడా ముందుకు రాలేదు. ఇదే ఇప్పుడు అంతటా చర్చనీయాంశం అయ్యింది. దేశరాజకీయాల్లోనూ సీనియర్ మోస్ట్ నేతగా రాష్ట్రానికి సుధీర్ఘకాలం సీఎంగా పని చేసిన చంద్రబాబుకు కుప్పంలో ఎదురుగాలి మొదలైందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దానికి కారణాలూ లేకపోలేదు.

కుప్పంలో టీడీపీని బలహీనపర్చే పనిలో మంత్రి పెద్దిరెడ్డి!

అధికారంలోకి వచ్చాక కుప్పంపై స్పెషల్ ఫోకస్ పెట్టింది వైసీపీ. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నేతృత్వంలో అక్కడ వైసీపీ శ్రేణులు పక్కడ్బందీగా పని చేస్తున్నాయి. రాష్ట్రంలో కంటే ముందు కుప్పంలో చంద్రబాబుకు నిలవడనీడ లేకుండా చేయడానికి పెద్దిరెడ్డి నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నారు. టీడీపీ నుంచి వైసీపీలోకి వలసలను ప్రోత్సహించడం, ప్రభుత్వ పథకాల విషయంలో కాస్త లిబరల్ గా వ్యవహరించడం ద్వారా టీడీపీని బలహీనం చేసే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు పెద్దిరెడ్డి. స్థానిక ఎన్నికల్లో టీడీపీకి వ్యతిరేకంగా ఫలితాలు రావడానికి ఈ ఎఫెక్టే కారణమనే అభిప్రాయమూ ఉంది.

బాబు మూడురోజుల పర్యటన తర్వాత పరిస్థితులు ఉల్టా!
బాబుపై అభిమానంతో 44 మంది పోటీ చేసినా మరోలా ఫలితాలు!

ఇక టీడీపీ అంతర్గత విషయాలకు వస్తే… పార్టీ పరిస్థితికి కుప్పం తమ్ముళ్లదే తప్పన్నట్టు చంద్రబాబు మాట్లాడటాన్ని కేడర్ జీర్ణించుకోలేకపోతోందట. నియోజవర్గంలో చంద్రబాబు ప్రతినిధులుగా ఉన్న మనోహర్, ఎమ్మెల్సీ గౌరివాని శ్రీనివాసులుపై కేడర్ పెద్దఎత్తున ఆరోపణలు చేసింది. మనోహర్ ను తొలగించాలని చంద్రబాబు ముందే కార్యకర్తలు పట్టుబట్టినట్టు సమాచారం. అయినా చంద్రబాబు పట్టించుకోలేదట. పైగా మనోహర్ లేకుంటే మీలో ఎవరు ఆ బాధ్యతలు చూస్తారని ఎదురు ప్రశ్నించారట. అంతా సెట్ చేస్తుందనుకున్న బాబు త్రీ డే టూర్ తర్వాత పరిస్థితులు ఉల్టా అయ్యాయి. స్థానిక నాయకత్వం పార్టీ కార్యక్రమాల్లో అంటీముట్టనట్టు వ్యవహరించడం లేదంటే అసలు పట్టించుకోకపోవడం చేస్తోందట. మరికొందరు పెద్దిరెడ్డి ఆపరేషన్ ఆకర్ష్ లో వైసీపీ కండువాలు కప్పుకొన్నారు. వీరిలో కొంత మంది కీలక నేతలు కూడా ఉన్నారట. ఎంత ఎన్నికలను బహిష్కరించినా.. చంద్రబాబు కోటలో టీడీపీ అంటే టీడీపీలానే ఉండాలి కదా.. కానీ అలా జరగలేదు. పార్టీ వద్దాన్నాక పోటీ ఎందుకులే అనుకున్నారో లేక పోటీ చేయడం ఇష్టం లేదో కానీ… పరిషత్ ఎన్నికలకు దూరంగా ఉండిపోయారు. పార్టీ పై మమకారం, బాబుపై అభిమానం ఉన్న 44 మంది పోటీ చేసినా ఫలితాలు అనుకూలంగా లేకపోవడం కుప్పం నాడిని తెలియజేస్తోంది.

ఈ ఎఫెక్ట్‌ వచ్చే ఎన్నికల వరకు ఉంటుందా?

అయితే.. ఇది ఈ ఎన్నికల వరకే పరిమితం అవుతుందా? లేక వచ్చే సాధారణ ఎన్నికల వరకు ఉంటుందా? అనే చర్చ నియోజకవర్గంలో నడుస్తోంది. ఎన్నికలను బహిష్కరించకుండా టీడీపీ బరిలోకి దిగితే కుప్పంలో ఫలితాలు ఎలా ఉండేవో ఏమో కానీ… పార్టీ తరఫున అంటూ పోటీ చేసిన 44 మంది ఎంపీటీసీ అభ్యర్ధులు.. చంద్రబాబు పునరాలోచనలో పడేలా చేసిందట.


-Advertisement-చంద్రబాబు కుప్పం కోటకు బీటలు?

Related Articles

Latest Articles