విభజించు..పాలించు.. పార్టీకి కలిసొస్తుందా?

పదవుల పంపకాల్లో అనేక వడపోతలు.. లెక్కలు వేస్తాయి పార్టీలు. అధికారంలో ఉన్న పార్టీ అయితే మరెన్నో సమీకరణాలను పరిగణనలోకి తీసుకుంటుంది. ఇటీవల ఏపీలో అదే జరిగిందని వైసీపీ వర్గాల్లో ఒక్కటే చర్చ. కాకపోతే ఆ జిల్లాలో మాత్రం విభజించు.. పాలించు సూత్రం పాటించారని చెవులు కొరుక్కుంటున్నారట. అదెలాగో ఇప్పుడు చూద్దాం.

పదవుల పంపకంలో సామాజిక లెక్కలు!

ఇటీవల ప్రకటించిన నామినేటెడ్‌ పదవుల పంపకాల్లో కృష్ణాజిల్లాకు కీలకమైన పోస్ట్‌లే దక్కాయి.
కమ్మ కార్పొరేషన్‌, కాపు కార్పొరేషన్‌, ఏపి పరిశ్రమల అభివృద్ధి కార్పొరేషన్‌, అటవీ అభివృద్ధి కార్పొరేషన్‌లతోపాటు DCCBకి కూడా కొత్త ఛైర్మన్‌ను ఎంపిక చేశారు. ఈ పదవుల పంపకం కోసం వైసీపీ వేసిన సామాజిక లెక్కలే ఇప్పుడు పార్టీ వర్గాల్లో చర్చగా మారాయి. కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతం అయ్యేలా పదవులు కట్టబెట్టారని టాక్‌ నడుస్తోంది.

పెనమలూరు, జగ్గయ్యపేటలో కమ్మ సామాజికవర్గం ఓటర్లు ఎక్కువ!

కృష్ణా-గుంటూరు జిల్లాల్లో కమ్మ సామాజికవర్గం ఎక్కువ. వారిలో టీడీపీ సానుభూతి పరుల సంఖ్య కూడా ఎక్కువే. మంత్రి కొడాలి నాని.. ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌ తప్ప.. కృష్ణా జిల్లాలో వైసీపీకి కమ్మ సామాజికవర్గం నుంచి బలమైన నాయకులు లేరు. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైసీపీకి మద్దతుదారుగా మారిపోయారు. జిల్లాలో గెలుపోటములను ప్రభావితం చేసేస్థాయిలో కమ్మ సామాజికవర్గం ఓటర్లు ఉన్న నియోజకవర్గాల్లో పెనమలూరు, జగ్గయ్యపేట కూడా ఉన్నాయి.

జగ్గయ్యపేటలో తన్నీరుకు పదవిచ్చి బ్యాలెన్స్‌ చేశారా?

సామినేని ఉదయభాను జగ్గయ్యపేట ఎమ్మెల్యే. 2009, 2014లో ఆయన టీడీపీ అభ్యర్థి శ్రీరాం తాతయ్య చేతిలో ఓడిపోయారు. జగ్గయ్యపేటలో ఆర్యవైశ్య ఓటింగుతోపాటు కమ్మ సామాజికవర్గం ఓటు బ్యాంకు 32 వేల వరకు ఉంది. శ్రీరాంతాతయ్య ఎమ్మెల్యే అవకముందు ఉదయభానుకు ప్రధాన అనుచరుడిగా చక్రం తిప్పారు. ఆర్యవైశ్య సామాజికవర్గానికి చెందిన శ్రీరాంతాతయ్య తర్వాత టీడీపీలో చేరి కమ్మ సామాజికవర్గం మద్దతుతో రెండుసార్లు ఎమ్మెల్యే అయ్యారు. ఇక్కడ పరిస్థితులు గమనించిన ఎమ్మెల్యే ఉదయభాను.. తన నియోజకవర్గంలో కమ్మ సామాజికవర్గానికి చెందిన తన్నీరు నాగేశ్వరరావుకు DCCB ఛైర్మన్‌ పదవి ఇప్పించుకున్నారు. రానున్న రోజుల్లో జగ్గయ్యపేటలో వైసీపీకి స్ట్రాంగ్‌ హోల్డ్‌ సంపాదించేందుకే తన్నీరును ఎంచుకున్నారని పార్టీ వర్గాల టాక్‌.

పెనమలూరులో తుమ్మల చంద్రశేఖర్‌కు కమ్మ కార్పొరేషన్‌ ఛైర్మన్‌!

పెనమలూరులో దాదాపు 50 వేల పైచిలుకు కమ్మ సామాజికవర్గం ఓట్లు ఉంటాయి. పదవుల పంపకంలో పెనమలూరుకు కూడా ప్రాధాన్యం ఇచ్చారు. పెనమలూరు ఎమ్మెల్యేగా కొలుసు పార్థసారధి ఉండటంతో.. ఆయనకు, పార్టీకి అండగా ఉంటోన్న తుమ్మల చంద్రశేఖర్‌కు.. కమ్మ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పదవి ఇచ్చారు. అప్పట్లో నియోజకవర్గంలోని నాలుగు కీలక పంచాయతీలను కలిపి YSR తాడిగడప మున్సిపాలిటీగా మార్చినప్పుడు మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌ అభ్యంతరం తెలిపారు. ఆ సమయంలో బోడే ప్రసాద్‌ చేసిన నిరసనలు వైసీపీకి చికాకు కలిగించాయి. అందుకే ఆ సామాజికవర్గాన్ని కలుపుకొనిపోయేందుకు తొలిసారిగా కమ్మ కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి.. దానికి పెనమలూరుకు చెందిన తుమ్మల చంద్రశేఖర్‌ను ఛైర్మన్‌ను చేసింది.

బెజవాడ తూర్పులో కమ్మ, కాపు కాంబినేషన్‌!

ఇక బెజవాడ తూర్పు నియోజకవర్గంలోనూ కమ్మ, కాపు కాంబినేషన్‌కు వైసీపీ ప్రాధాన్యం ఇచ్చింది. ఇక్కడ టీడీపీ నుంచి గద్దె రామ్మోహన్‌రావు ఎమ్మెల్యేగా గెలిచారు. వైసీపీ నియోజకవర్గ ఇంఛార్జ్‌గా దేవినేని అవినాష్‌ ఉన్నారు. ఇదే నియోజకవర్గానికి చెందిన అడపా శేషును కాపు కార్పొరేషన్‌ ఛైర్మన్‌ను చేసి కులాల ఈక్వేషన్‌లో సమతూకం పాటించారని అనుకుంటున్నారట. మరి.. ఈ సమీకరణాలు రానున్న కాలంలో అధికారపార్టీకి ఏ విధంగా వర్కవుట్‌ అవుతాయో చూడాలి.

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-