తెలంగాణ కాంగ్రెస్ ని ఇరుకున పెట్టిన కొండా సురేఖ.. అసలేమైంది..?

తెలంగాణ కాంగ్రెస్ ని ఆమె ఇరుకున పెట్టేశారా..? హుజూరాబాద్‌ అభ్యర్థి కోసం వెతుకుతున్న సమయంలో… ఆ మహిళా నేత కామెంట్స్ పార్టీని మరింత గందరగోళం లోకి నెట్టాయా..? ఇప్పుడు హుజూరాబాద్‌, తర్వాత వరంగల్‌ అంటున్నారట. ఓవరాల్‌ గా కాంగ్రెస్ పార్టీ ఏదో అనుకుంటే మరేదో జరిగిందా?

తెలంగాణ కాంగ్రెస్ హుజూరాబాద్ అభ్యర్ధి ఎంపిక పై పెద్దగా తర్జనభర్జనలు పడలేదు. కానీ, బలమైన అభ్యర్దిని బరిలోకి దించే ప్రయత్నం చేసింది. అందులో భాగంగా నే బీసీ సామాజిక వర్గం లక్ష్యంగా, మాజీ మంత్రి కొండా సురేఖ పేరును తెర మీదకు తెచ్చారు పిసిసి చీఫ్ రేవంత్. ఇంతకు మించి బరిలో నిలవడానికి ముందుకు వచ్చిన కాంగ్రెస్‌ నాయకులు కూడా లేరు. మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ పేరు ప్రస్తావనకు వచ్చినా, ఆయన పోటీ చేయనని తేల్చేశారు.

అయితే ఉప ఎన్నికల బరిలో సాదాసీదా మనిషిని నిలిపితే… తప్పుడు సంకేతాలు వెళ్లినట్టు అవుతుందని భావించింది పార్టీ. అందులో భాగంగానే కొండా సురేఖ పేరు దాదాపు ఫైనల్ స్టేజ్ కి వచ్చింది. ఇంతలో కొండా సురేఖ పార్టీ కి ఓ ట్విస్ట్ పెట్టేశారు. హుజూరాబాద్ లో పార్టీ ఆదేశిస్తే పోటీ చేయడానికి సిద్దంగా ఉన్నా..కానీ వచ్చే ఎన్నికల్లో వరంగల్ ఈస్ట్ నియోజకవర్గం నుండే బరిలో ఉంటా… అని కామెంట్ చేసింది సురేఖ. ఇదే ఇప్పుడు పార్టీని ఇరుకున పెట్టినట్టయింది.

తెలంగాణ కాంగ్రెస్‌ ఉప ఎన్నికల్లో కొండా సురేఖ ను బరిలో దించి .. వచ్చే ఎన్నికల్లో కూడా హుజురాబాద్‌ నుండే సురేఖ ను బరిలో నిలపాలని ప్లాన్ వేసింది. దానివల్ల ఈ ఎన్నికల్లో దెబ్బ కొట్టినా, వచ్చే ఎన్నికల నాటికి ఆ నియోజకవర్గం కాంగ్రెస్ జాబితాలో చేరుతుందనే ధీమాతో ఉంది. అయితే… సురేఖ కొత్తగా ఇప్పుడు ఇచ్చిన ట్విస్ట్ తో సమస్య మళ్ళీ మొదటికి వచ్చింది.

హుజూరాబాద్ కి వెళ్లమంటే ఇప్పుడు వెళ్తా కానీ, తిరిగి వరంగల్ కే వస్తా అని చెప్పడంతో ఎన్నికల్లో ప్రత్యర్థులకు విమర్శలకు ఆయుధాన్నిచ్చినట్టైంది. దీంతో… కొండా సురేఖ ఇప్పుడు ఉప ఎన్నికల బరిలో ఉన్నా… వచ్చే ఎన్నికలకు వరంగల్ వెళ్ళిపోతుందనే చర్చను సురేఖ స్వయంగా తెరమీదికి తెచ్చినట్టైందని పార్టీ నాయకుల వాదన

గతంలో వరంగల్ ఈస్ట్ వదిలేసి… పరకాల వెళ్లి తప్పు చేశానని చెప్పిన సురేఖ… ఇంకా క్లారిటీకి వచ్చినట్టు లేరు. అటు హుజూరాబాద్…ఇటు వరంగల్ ఈస్ట్..రెండిటిపై ఆశలు పెట్టుకున్నట్టు కనిపిస్తోంది. హుజూరాబాద్ సురేఖ కి ఇప్పుడు ఇచ్చినా… వచ్చే ఎన్నికల నాటికి.. కొండా మురళికి వరంగల్ ఇచ్చే అలోచనేదో…పిసిసి చేసినట్టు చర్చ జరుగుతోంది. అయితే… పార్టీ వేదికల మీదనో… పార్టీలో ముఖ్యులతో చర్చించాల్సిన అంశం కాస్తా, కార్యకర్తల సమావేశంలో చర్చకు పెట్టేసరికి… అది రచ్చకు దారితీసింది. ఒక కుటుంబంలో ఒక్కరికే సీటు అనే చర్చ ఇప్పటికే ఉండగా, కొండా చేసిన కామెంట్స్ తో కొత్త సమస్య తెర మీదకు వచ్చినట్టు అయ్యింది.

కొండా సురేఖ, మురళిలకు ఎన్నికల సమయంలో పరిస్థితిని బట్టి అవకాశం ఇవ్వాలనుకున్నారేమో. లేదంటే పొరుగున ఉన్న నియోజకవర్గం నుండి బరిలో నిలిపితే ఉప ఎన్నికల్లో కలిసి వస్తుంది అనుకున్నారో కానీ, కొండా సురేఖ చేసిన కామెంట్స్ కాంగ్రెస్ ఆశలకు గండి కొట్టినట్టయింది. తెలంగాణ కాంగ్రెస్‌ ఇప్పుడు హుజూరాబాద్ కి కొత్త అభ్యర్థిని వెతుకుతారా? లేదంటే సురేఖకే నచ్చచెప్తారా? అనేది చూడాలి.

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-