కేబినెట్ లో బెర్త్ కోసం ఆ ఎమ్మెల్యేలు ఎదురుచూపులు…?

ఒకరు మాజీ మంత్రి. ఇంకొకరు అమాత్య అనిపించుకోవాలని ఆశగా ఎదురు చూస్తున్న ఎమ్మెల్యే. ఇద్దరూ బీసీ సామాజికవర్గమే. రెండున్నరేళ్ల కేబినెట్‌ ప్రక్షాళన వారిని ఊరిస్తోంది. బెర్త్‌ కోసం ఎవరి లెక్కలు వారివే. మరి.. మంత్రివర్గంలో చేరడానికి వారు పెట్టుకున్న కొలమానం ఏంటి? ఎవరు ఏ రూట్‌ను ఎంచుకున్నారు?

కేబినెట్‌లో బెర్త్‌ కోసం పార్థసారథి, జోగి రమేష్‌ ఆశలు

ఆర్నెళ్ల తర్వాత జరిగే మంత్రివర్గ ప్రక్షాళనలో బెర్త్‌ కన్ఫామ్‌ చేసుకునేందుకు కృష్ణాజిల్లాలో కొందరు ఎమ్మెల్యేలు ఇప్పటి నుంచే కసరత్తు మొదలుపెట్టారు. ప్రస్తుతం జిల్లా నుంచి ముగ్గురు మంత్రులుగా ఉన్నారు. కొడలి నాని, పేర్ని నాని, వెలంపల్లి శ్రీనివాస్‌లు కేబినెట్‌లో కొనసాగుతున్నారు. ముగ్గురూ తొలిసారి మంత్రులే. అంతా ఓసీ వర్గానికి చెందినవారు. సంఖ్య పెరగడంతో అప్పట్లో జిల్లా నుంచి బీసీ సామాజికవర్గానికి చోటు దక్కలేదు. ఈ దఫా మాత్రం బీసీని మంత్రిని చేస్తారని ఆ సామాజికవర్గానికి చెందిన ఎమ్మెల్యేలు బలంగా విశ్వసిస్తున్నారు. ఆ విధంగా కొలుసు పార్థసారథి, జోగి రమేష్‌ పేర్లు రేస్‌లోకి వచ్చాయి. ఈ ఇద్దరిలో పార్థసారథి ఉమ్మడి రాష్ట్రంలోనే మంత్రిగా పనిచేశారు. మూడోసారి ఎమ్మెల్యే. జోగి రమేష్‌ రెండోసారి శాసనసభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు.

అసెంబ్లీలో చేసిన విమర్శలతో అధినేత మెప్పు పొందిన రమేష్‌!

తొలి కేబినెట్‌లోనే చోటు దక్కుతుందని పార్థసారథి, రమేష్‌లు గంపెడాశాలు పెట్టుకున్నా.. నాటి సమీకరణాలు వారికి నిరాశ కలిగించాయి. తర్వాతి కాలంలో పార్థసారథిని టీటీడీ సభ్యుడిని చేశారు. ఆ పదవి కూడా ఈ మధ్యే అయిపోయింది. తప్పకుండా తనను మంత్రిని చేస్తారని పార్థసారథి ఆశిస్తున్నారు. ఇక జోగి రమేష్‌ మొదటి నుంచి సీఎం జగన్‌కు బలమైన మద్దతుదారుగా ఉన్నారు. సీఎం జగన్‌ను ఎవరైనా ఏదైనా అంటే తనదైన శైలిలో విరుచుకుపడుతున్నారు. ఇటీవల ఆ విమర్శల పాళ్లు పెరిగాయి. అసెంబ్లీ ఒక్కరోజు సమావేశమైనప్పుడు.. సీఎం జగన్‌కు మద్దతుగా.. ప్రత్యర్థులపై రమేష్‌ చేసిన విమర్శలు రాజకీయంగా కలకలం రేపాయి. అసెంబ్లీలో రమేష్‌ చేసిన కామెంట్స్‌పై బయట విమర్శలు ఎదుర్కొన్నా.. ఆ దూకుడు ద్వారా అధినేత మెప్పు పొందారు.

రివార్డు పాయింట్ల కోసం రమేష్‌ దూకుడు పెంచారా?

రమేష్‌లో ఉన్నంత దూకుడు పార్థసారథిలో కనిపించదని పార్టీ వర్గాల అభిప్రాయం. ఆయన కాస్త నెమ్మది. కాకపోతే సీనియర్‌. జోగి రమేష్‌ మాత్రం రేస్‌లో వెనకపడకుండా జాగ్రత్త పడుతున్నారు. అవకాశం చిక్కితే చంద్రబాబు సహా వైరిపక్షాలపై ఒంటికాలిపై లేస్తున్నారు. ఆ విధంగా మార్కులు కొట్టేసి.. అధిష్ఠానం దగ్గర రివార్డు పాయింట్లు పెంచుకోవాలని చూస్తున్నారో ఏమో.. రమేష్‌ పెదవి విప్పితే మాటలు టాపాసుల్లా పేలుతున్నాయి.

బీసీ ఎమ్మెల్యేల మధ్య పోటీ తీవ్రంగానే ఉందా?

ప్రస్తుతం జిల్లా నుంచి ఉన్న ముగ్గురు మంత్రుల్లో ఎంతమందిని తొలగిస్తారో.. కొత్తగా ఎందరిని కేబినెట్‌లోకి తీసుకుంటారో తెలియదు. కానీ.. ఇద్దరు బీసీ ఎమ్మెల్యేల మధ్య పోటీ తీవ్రంగానే ఉందట. ఇప్పటికే మంత్రిగా.. టీటీడీ బోర్డు సభ్యుడిగా పనిచేసిన పార్థసారథికి మరోసారి అవకాశం ఇస్తారా అని పార్టీ వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయట. ఒకవేళ సీనియారిటీని పరిగణనలోకి తీసుకుంటే మాత్రం ఆయనకు ఛాన్స్‌ వస్తుందనే వారు లేకపోలేదు. తొలిదఫా కేబినెట్‌లో చోటు దక్కకపోయినా.. ఈసారి మాత్రం జోగి రమేష్‌కు మంత్రివర్గంలో ప్లేస్‌ ఖాయమని పార్టీలో చెవులు కొరుక్కుంటున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో సీఎం జగన్‌ ఆయన్ని ప్రశంసించిన తీరును గుర్తు చేస్తున్నారు. మరి.. జిల్లాలోని బీసీ ఎమ్మెల్యేలలో సీనియారిటీకి ప్రాధాన్యం ఇస్తారో.. అనుయాయుడిని పిలిచి పట్టం కడతారో చూడాలి.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-