హరీష్ రావు ఎదుటే బలప్రదర్శనకు దిగుతున్నారా…?

హుజురాబాద్‌ ఉపఎన్నికలో గెలుపుకోసం అధికారపార్టీ వ్యూహ రచన చేస్తుంటే.. మరోవైపు పార్టీలోని ఇద్దరు నేతల మధ్య పంచాయితీ కలవర పెడుతోందట. ఆ ఇద్దరూ కొత్తగా గులాబీ కండువా కప్పుకున్నవాళ్లే కావడంతో.. వారి అంతర్గత విభేదాలు టీఆర్ఎస్‌ శ్రేణులకు ఇబ్బందిగా మారాయట. ఒకే వరలో రెండు కత్తులు ఇమడలేవన్నట్టుగా చిటపటలాడుతున్నాట. వారెవరో.. లెట్స్‌ వాచ్‌..!

ఎడముఖం పెడముఖంగా కౌశిక్‌రెడ్డి, ఇ.పెద్దిరెడ్డి..?

హుజురాబాద్ ఉపఎన్నిక కాకమీద ఉంది. నియోజకవర్గంలో కులాలు, సంఘాలు, సంస్థల ఆత్మీయ సమ్మేళనాలపై టీఆర్‌ఎస్ ఎక్కువ ఫోకస్‌ పెట్టింది. మంత్రులు హరీష్‌రావు, గంగుల కమలాకర్‌, కొప్పుల ఈశ్వర్‌, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అదేపనిగా ప్రచారం చేస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. హుజురాబాద్‌కే చెందిన ఇద్దరు నేతల మధ్య పంచాయితీ గులాబీ శిబిరంలో హాట్ టాపిక్‌గా మారింది. వారే కాంగ్రెస్‌ను వీడి వచ్చిన కౌశిక్‌రెడ్డి, బీజేపీకి గుడ్‌బై చెప్పి టీఆర్ఎస్‌ కండువా కప్పుకొన్న ఇ. పెద్దిరెడ్డి. ఇద్దరూ ఇటీవలే టీఆర్‌ఎస్‌లో చేరారు. గతంలో హుజురాబాద్‌ నుంచి పోటీ చేసిన నేతలే. మంత్రి హరీష్‌రావు హాజరైన ఓ కార్యక్రమంలో కౌశిక్‌రెడ్డి, పెద్దిరెడ్డి ఎడముఖం పెడముఖంగా ఉండటంతో పార్టీలో టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారిపోయారు. ఏమైందా అని అంతా ఆరా తీయడం మొదలుపెట్టారట.

ఎలాంటి పదవి ఇవ్వకపోవడంపై పెద్దిరెడ్డి అసంతృప్తి..!
రెడ్డి సామాజికవర్గ ఆత్మీయ సమ్మేళనంలో సెటైర్లు..!

కౌశిక్‌రెడ్డిని గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీగా పంపేందుకు కేబినెట్‌ ప్రతిపాదించింది. అయితే మాజీ మంత్రిగా.. సీనియర్‌ పొలిటీషియన్‌గా ఉన్న తనకు ఏ పదవీ ఇవ్వకపోవడంపై అసంతృప్తితో ఉన్నారట ఇ.పెద్దిరెడ్డి. హుజురాబాద్‌లో తనకు పట్టు ఉందని.. ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పనిచేశానని.. కౌశిక్‌రెడ్డి కంటే తనకేం తక్కువని అనుచరుల దగ్గర వాపోతున్నారట ఇ.పెద్దిరెడ్డి. ఈ విషయం అధిష్ఠానం చెవిన పడటంతో బుజ్జగించే ప్రయత్నం చేసిందట. గత నెలలో రెడ్డి సామాజికవర్గ ఆత్మీయ సమ్మేళన సభ నిర్వహించారు. ఆ సభకు కౌశిక్‌రెడ్డి, పెద్దిరెడ్డి ఇద్దరూ వెళ్లారు. తన సామాజికవర్గం గురించి గొప్పగా చెప్పి వారిని ఓన్‌ చేసుకోవడానికి కౌశిక్‌రెడ్డి ప్రయత్నించారు. ఆ తర్వాత మాట్లాడిన పెద్దిరెడ్డి ఏ మాత్రం ఆలోచించకుండా.. కౌశిక్‌కు సెటైర్లు వేయడం పెద్ద చర్చగా మారింది.

హరీష్‌రావు ఎదుటే బలప్రదర్శకు దిగుతున్నారా?

టీఆర్‌ఎస్‌ పెద్దల దగ్గర మార్కులు కొట్టేసేందుకు కాంగ్రెస్‌ కేడర్‌కు గులాబీ కండువా కప్పే పనిలో కౌశిక్‌రెడ్డి ఉన్నారట. కౌశిక్‌రెడ్డి కంటే ముందే బీజేపీ, టీడీపీలలో ఉన్న నాయకులను టీఆర్ఎస్‌లో చేర్పించేందుకు పెద్దిరెడ్డి చూస్తున్నారట. ఇదే క్రమంలో మంత్రి హరీష్‌రావు మెప్పుకోసం ఇద్దరు నేతలూ బల ప్రదర్శనకు దిగుతున్నట్టు టాక్‌. అయితే వీరిద్దరి మధ్య వచ్చిన గ్యాప్‌తో టీఆర్ఎస్‌ కిందిస్థాయి కేడర్‌ ఇబ్బంది పడుతోందట. ఇది గమనించిన పార్టీ పెద్దలు.. వేర్వేరుగా ప్రచారంలో పాల్గొనాలని కౌశిక్‌రెడ్డి, ఇ. పెద్దిరెడ్డిలకు సూచించారట. ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చే బాధ్యత హరీష్‌రావుకు అప్పగించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే వివిధ పార్టీల నుంచి వచ్చిన వారికి గులాబీ కండువాలు కప్పేయడంతో హుజురాబాద్‌ TRS హౌస్‌ఫుల్‌ అయింది. ఇలా వచ్చిన వారి మధ్య చిటపటలు కామన్‌ అయ్యాయి. మరి.. కౌశిక్‌రెడ్డి, పెద్దిరెడ్డిల మధ్య పంచాయితీని ఎలా కొలిక్కి తెస్తారో చూడాలి.

-Advertisement-హరీష్ రావు ఎదుటే బలప్రదర్శనకు దిగుతున్నారా...?

Related Articles

Latest Articles