జనసేనాని పవన్‌ కల్యాణ్‌ వ్యూహం మారుస్తున్నారా?

జనసేనాని వ్యూహం మారుస్తున్నారా? కొత్తగా పాత మిత్రుడి వైపు చూస్తున్నారా? రాష్ట్రాభివృద్ధి కోసం వ్యూహం మారుస్తానని పవన్‌ అనడం వెనక ఉద్దేశం.. బీజేపీని వీడటమా? టీడీపీతో జతకట్టడమా? ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అని బీజేపీ చెబుతున్నా.. పవన్‌ అదే అంశాన్ని ఇప్పుడు ప్రస్తావించడం ఏపీ రాజకీయాలలో పొడుస్తున్న కొత్త పొత్తులకు సంకేతమేనా?

అవసరమైతే వ్యూహం మారుస్తానన్న పవన్‌..!
టీడీపీతో జత కట్టేందుకు గ్రౌండ్‌ ప్రిపేర్‌ చేస్తున్నారా?

బీజేపీ-జనసేన పార్టీల మధ్య గ్యాప్‌ పెరుగుతోంది. ఇప్పుడంతా బాగానే ఉన్నట్టు కన్పిస్తున్నా.. భవిష్యత్తులో బీజేపీతో జనసేన తెగదెంపులు చేసుకుంటుందనేది చర్చ. పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో పవన్‌ కల్యాణ్ చేసిన కామెంట్స్‌ ఆ చర్చకు మరింత బలాన్ని చేకూరుస్తున్నట్టు టాక్‌. తడవకో పార్టీకి మద్దతిస్తున్నారనే ఆరోపణలు.. విమర్శలపై పవన్ గట్టిగానే బదులిచ్చారు. వేరే పార్టీలు మారిన వ్యక్తులను చేర్చుకుని రాజకీయం చేయగా లేనిది.. తాను ప్రజల కోసం.. తన ఆశయ సాధన కోసం ఒక్కో పార్టీకి మద్దతిస్తే తప్పేంటనే రీతిలో కామెంట్‌ చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజల కోసం తాను ఎవరితోనైనా కలుస్తా, అవసరమైతే వ్యూహం మారుస్తా అన్నారు పవన్‌.
ఇదే ఇప్పుడు అతి పెద్ద హాట్‌టాపిక్‌. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో జనసేన జత కడుతుందనే ప్రచారం జోరుగా సాగుతున్న తరుణంలో జనసేనాని కామెంట్స్‌ చూస్తుంటే.. గ్రౌండ్‌ ప్రిపేర్‌ చేసుకుంటున్నారనే ప్రచారానికి బలం చేకూరుతోందని అనుకుంటున్నారు.

ప్రత్యేక హోదా, విశాఖ స్టీల్‌ ప్లాంట్‌పై పోరాటం వెనక మిత్రుడిని మార్చడమేనా?

మరో కీలక అంశాన్నీ పవన్‌ టచ్‌ చేశారు. ప్రత్యేక హోదాను ప్రత్యేకంగా ప్రస్తావించారు. స్పెషల్‌ స్టేటస్‌ అంశాన్ని తాను విడిచి పెట్టలేదని గుర్తు చేశారు. ఓవైపు ప్రత్యేక హోదా అనేది ముగిసిన అధ్యాయమని బీజేపీ.. కేంద్రం పదేపదే చెబుతున్నాయి. ఏపీ బీజేపీ నేతలు కూడా అదే స్పష్టంగా చెప్పేస్తున్నారు. అసలు ఆ అంశాన్ని ప్రస్తావించడానికే ఏపీ బీజేపీ నాయకులు ఇష్టపడటం లేదు. పవన్‌ కల్యాణ్ కూడా బీజేపీతో కలిశాక ఆ అంశం గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. వ్యూహం మారుస్తానంటూ చెబుతూనే ప్రత్యేక హోదా, విశాఖ స్టీల్ ప్లాంట్‌ కోసం పోరాటం చేస్తామని పవన్‌ చెప్పడం వెనక ఉద్దేశం మిత్రుడిని మార్చుకోవడమేనట. పైగా ఈ సమయంలో పవన్‌ కల్యాణ్‌ ప్రత్యేక హోదా అన్నారంటే అర్థమేంటి? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

బీజేపీ ఇచ్చిన హామీలు హామీలుగానే ఉన్నాయని జనసేన నేతల కామెంట్స్‌..!
సరైన సమయంలో పొత్తులపై జనసేనాని స్పందిస్తారా?

భవిష్యత్తులో బీజేపీని వీడడానికి.. టీడీపీతో జతకట్టడానికి ప్రత్యేకహోదా అస్త్రాన్ని జనసేనాని ప్రయోగిస్తారా? అలాగే అమరావతి విషయాన్ని గట్టిగానే ప్రస్తావించారు జనసేనాని. తాను బీజేపీతో కలవడానికి.. కలిసి ఉండడానికి కారణం అమరావతినే రాజధానిగా కొనసాగిస్తామని హామీ ఇచ్చారని గట్టిగా చెప్పారు. కానీ ఆ హామీలు హామీలుగానే ఉన్నాయని జనసేన నేతలు ఈ మధ్య అంటున్నారు. వ్యూహం మారుస్తా అనడం వెనక అసలు కారణాలు ఇవేనని రాజకీయవర్గాలు ఊహాగానాలు చేస్తున్నాయి. అయితే ఇవన్నీ ఇప్పటికిప్పుడే జరిగే ఛాన్స్‌ లేదు. బీజేపీని వీడాలన్నా., టీడీపీతో కలవాలన్నా ఇది సరైన సమయం కాదనే భావన జనసేనానికి ఉందట. సరైన సమయంలో.. పొత్తులపై స్పందిస్తారట.

టీడీపీతో పొత్తుకు జనసేన విస్తృతస్థాయి భేటీలో బీజాలు పడ్డాయా?

పవన్‌ చేసిన ప్రసంగంలో మరికొన్ని కీలకాంశాలను విశ్లేషిస్తే.. ఇదేదో కచ్చితంగా టీడీపీ-జనసేన మధ్య కొత్త పొత్తు చిగురించే దిశగా పాలిటిక్స్‌ టర్న్‌ కాబోతున్నట్టు టాక్‌. దానికి జనసేన విస్తృతస్థాయి సమావేశంలో బీజాలు పడ్డాయని అనుకుంటున్నారు. అందుకే పవన్‌ తదుపరి వ్యూహంపై ఆసక్తి నెలకొంది.

-Advertisement-జనసేనాని పవన్‌ కల్యాణ్‌ వ్యూహం మారుస్తున్నారా?

Related Articles

Latest Articles