గరం గరంగా జగిత్యాల టీఆర్‌ఎస్‌ రాజకీయం…

నిన్నమొన్నటి వరకు వారిద్దరూ ప్రత్యర్థులు. ఇప్పుడు ఒకే గూటిలో ఉన్నారు. చేరికలు సంతోషాన్నిచ్చినా.. సిట్టింగ్‌ ఎమ్మెల్యే మాత్రం టెన్షన్‌ పడుతున్నారట. పరిస్థితిని గమనించిన కేడర్‌.. ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడగలవా లేదా అని చర్చించుకుంటోంది. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? ఏంటా కథ?

టెన్షన్‌లో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌?

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు చెందిన ఎల్‌ రమణ.. టీ టీడీపీని వీడి టీఆర్‌ఎస్‌లో చేరడంతో జగిత్యాల నియోజకవర్గంలో ఒక్కసారిగా అలజడి మొదలైంది. రమణకు టీఆర్‌ఎస్‌ కండువా కప్పిన సమయంలో సీఎం కేసీఆర్‌ చేసిన కామెంట్స్‌ పార్టీలో చర్చగా మారాయి. తనకు మంచి మిత్రుడు, బీసీ నేత అయిన రమణకు సముచిత స్థానం ఇస్తామన్న దళపతి ప్రకటన.. జిల్లా అంతటా చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో సిట్టింగ్‌ జగిత్యాల ఎమ్మెల్యే సండ్ర సంజయ్‌ కుమార్‌లో టెన్షన్‌ మొదలైందని చెబుతున్నారు.

రమణ రాకతో జగిత్యాలలో సమీకరణాలు మారతాయా?

1994లో జగిత్యాల నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన రమణ.. అదే ఏడాది టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. తర్వాత జరిగిన బై ఎలక్షన్‌లో కరీంనగర్‌ ఎంపీగా గెలిచారు. 2009లోనూ టీడీపీ ఎమ్మెల్యే అయ్యారు. ఏపీ ఖాదీ గ్రామీణ పరిశ్రమల బోర్డు ఛైర్మన్‌గా పనిచేసిన ఆయన.. పద్మశాలీ సామాజికవర్గంలో ముఖ్యుడిగా ఉన్నారు. రాజకీయంగా ముఖ్యమైన పాత్ర పోషించిన రమణ.. ఇప్పుడు టీడీపీని వీడి టీఆర్‌ఎస్‌లోకి రావడంతో జిల్లాలో.. జగిత్యాలలో రాజకీయంగా మారే పరిణామాలను ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.

ఒకే కారులో సంజయ్‌, రమణ ప్రయాణం సాధ్యమేనా?

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల టికెట్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌కు ఇస్తారా లేదా అని పార్టీ కేడర్‌ ఆరా తీస్తున్నారట. రమణ చేరిక సమయంలో సంజయ్‌ నవ్వుతూ కనిపించినా.. భవిష్యత్‌పై ఆందోళన చెందుతున్నట్టు చెబుతున్నారు. కిందటి ఎన్నికల్లో సంజయ్‌ టీఆర్‌ఎస్‌ నుంచి రమణ టీడీపీ నుంచి పోటీ చేశారు. అలాంటి ప్రత్యర్థులు ఇప్పుడు ఒకే కారులో ప్రయాణించే పరిస్థితి. అయితే ఎవరు ఈ ప్రయాణంలో సర్దుకుంటారు.. ఇంకెవరు ఇబ్బందిగా ఫీలవుతారన్నది ప్రశ్నగా ఉందట. ఈ అంశంపై పార్టీ వర్గాలు ఎవరికి వారుగా లెక్కలు వేసుకుంటున్నాయి.

రమణకు ఇచ్చే ప్రాధాన్యం ఆధారంగా మార్పులు ఉంటాయా?

ప్రస్తుతం హుజురాబాద్‌ ఉపఎన్నిక బ్యాక్‌ గ్రౌండ్‌లో రాజకీయాలు జరుగుతున్నా.. రమణ చేరిక మాత్రం జగిత్యాలలో కాక రేపుతోంది. రమణ ఎంట్రీ ఎవరికి ఎసరు పెడుతుంది? అన్నదే హాట్‌ టాపిక్‌గా మారింది. టీఆర్‌ఎస్‌లో.. రానున్న రోజుల్లో ప్రభుత్వంలో రమణకు ఇచ్చే ప్రాధాన్యంబట్టే మిగతా నేతల భవిష్యత్‌ ఆధారపడి ఉంటుందని కొందరు భావిస్తున్నారు. అయితే ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌కు వచ్చిన ఆపద ఏమీ లేదని ఆయన వర్గం వాదిస్తోంది. రమణను టీఆర్‌ఎస్‌లోకి తీసుకురావడం వెనక లెక్కలు వేరని.. జగిత్యాలలో వచ్చే ఎన్నికల్లో మార్పు ఉండకపోవచ్చని చెబుతున్నారు. ఈ విషయంలో ఎవరి వాదన ఎలా ఉన్నా.. రాజకీయాల్లో రేపటి గురించి ఇప్పుడే ఒక అవగాహనకు రావడం పొరపాటే అవుతుందని అనుకుంటున్నారు. మరి.. జగిత్యాల టీఆర్‌ఎస్‌ రాజకీయం రానున్న రోజుల్లో ఎలా మారుతుందో చూడాలి.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-