ఇచ్ఛాపురం వైసీపీలో ఆగని ఇంటిపోరు…!

అసెంబ్లీ ఎన్నికల్లో ఇంటర్నల్‌ పాలిటిక్స్ దెబ్బతీశాయి. పార్టీ అధికారంలోకి రావడంతో బలపడేందుకు ఛాన్స్ దక్కిందని సంబర పడ్డారు. కానీ సీన్‌ రివర్స్‌. నిత్యం ఏదో ఒక అంశంపై లడాయి. లోకల్‌గా వైరిపక్షాన్ని ఇరుకున పెట్టడానికంటే.. సొంత పార్టీలో తలనొప్పులు ఎక్కువైయ్యాయట. ఆ నియోజకవర్గం ఏంటో..అక్కడ గొడవలేంటో ఈ స్టోరీలో చూద్దాం.

ఇచ్ఛాపురం వైసీపీలో నిత్యం ఏదో ఒక తగువు!

శ్రీకాకుళం జిల్లా వైసీపీలో గ్రూపు రాజకీయాలకు పెట్టింది పేరు ఇచ్ఛాపురం. రాష్ట్రమంతా వైసీపీ గాలి వీచినా.. 2019లో ఇక్కడ టీడీపీ గెలిచింది. వైసీపీలో అంతర్గత కుమ్ములాటలే పార్టీ ఓటమికి కారణమని ఓపెన్‌ టాక్‌. ఇక్కడ ఓడినా.. వైసీపీ అధికారంలోకి రావడంతో పెత్తనంతోపాటు.. పట్టు కోసం ఎవరి ప్రయత్నాలు వారివే. గత ఎన్నికల్లో ఓడిన పిరియా సాయిరాజే ఇచ్ఛాపురం వైసీపీ ఇంఛార్జ్‌. ఆయనపై ద్వితీయశ్రేణి నాయకులు ఇంకా గుర్రుగానే ఉన్నారట. కండువాలు మార్చిన వారికే ఇంఛార్జ్‌ ప్రాధాన్యం ఇస్తున్నారని.. ఆ మధ్య ఆడియో సంభాషణలు కలకలం రేపాయి. పార్టీ పెద్దల జోక్యంతో ఆ వ్యవహారం సద్దుమణిగినా.. ఏదో ఒక రూపంలో రోజుకో సమస్య చర్చకు రావడంతో తలనొప్పులు ఎక్కువయ్యాయట.

గుబులు రేపుతోన్న కోఆప్షన్‌ సభ్యుల ఎంపిక..!

పంచాయతీ ఎన్నికల్లో రెబల్స్ ఇంఛార్జ్‌ సాయిరాజ్‌కు చుక్కలు చూపించారు. మున్సిపల్ ఎన్నికల వేళ సేమ్ సీన్ రిపీటైంది. చివరకు డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌ హెచ్చరికతో అంతా సజావుగా సాగిపోయింది. తాజాగా ఇచ్ఛాపురం మున్సిపాల్టీ కోఆప్షన్ సభ్యుల ఎంపికలో మొదలైన రచ్చ గుబులు రేపుతోందట. మున్సిపల్ ఛైర్‌పర్సన్‌, వైస్‌ ఛైర్‌పర్సన్ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉన్నాయట పరిస్థితులు.

మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌, వైస్‌ ఛైర్‌పర్సన్‌ వర్గాల మధ్య రగడ!

ఇచ్ఛాపురం మున్సిపాలిటీలో ముగ్గురు కోఆప్షన్ సభ్యుల ఎంపికకు ఇటీవల ఎన్నిక నిర్వహించారు.
ఛైర్‌పర్సన్ పిలక రాజ్యలక్ష్మి, ఆమె భర్త నిబంధనలకు విరుద్ధంగా ఎన్నికల నిర్వహిస్తున్నారంటూ.. మాజీ కౌన్సిలర్లు, పార్టీలో సీనియర్ నేతలు ఇంఛార్జ్‌ సాయిరాజ్ వద్ద తగువు పెట్టారట. ఆయన తన చేతుల్లో ఏమీ లేదని చెప్పడంతో.. వైస్‌ ఛైర్‌పర్సన్‌ భారతి దివ్య, ఆమె మామయ్య బాలయ్యలు ఇంఛార్జ్‌ తీరుపై భగ్గుమన్నారు. పార్టీ నేతలు రెండు వర్గాలుగా విడిపోయారు. చివరకు ఛైర్‌పర్సన్‌ వర్గానికే కోఆప్షన్‌ పదవులు దక్కాయి. ప్రస్తుతం వీటి ప్రకంపనలే ఇచ్ఛాపురం వైసీపీ రాజకీయాన్ని వేడెక్కిస్తున్నాయట.

పార్టీ నేతలను కట్టడి చేయలేకపోతున్నారా?

రాజీనామాలు చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్దామని రెండువర్గాలు సవాళ్లు చేసుకుంటున్నాయి. ఇలా పరస్పరం రోడ్డెక్కుతున్న పార్టీ నేతలను ఇంఛార్జ్‌ సాయిరాజ్‌ కట్టడి చేయలేకపోతున్నారట. పైగా ఆయన తల బొప్పికట్టేలా పరిణామాలు ఉండటంతో పార్టీ వర్గాల్లో చర్చగా మారింది. ఒకరికి సర్దిచెబితే… రెండోవర్గం భగ్గుమనే పరిస్థితి. దీంతో మళ్లీ పార్టీ పెద్దలు జోక్యం చేసుకోవాలేమో అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మరి ఇచ్ఛాపురం వైసీపీ వర్గాల లడాయి ఎలాంటి టర్న్‌ తీసుకుంటుందో చూడాలి.

Related Articles

Latest Articles

-Advertisement-