మాజీ మంత్రి పెద్దిరెడ్డికి విద్యాసాగర్‌రావు ఆఫర్‌ ఇచ్చారా?

ఒక మాజీ మంత్రి చేరిక.. ఇంకో మాజీ మంత్రి అలకకు కారణమైంది. అసంతృప్తితో ఉన్న ఆ నాయకుడిని ఎలా బుజ్జగించాలో పార్టీ నేతలకు అంతుచిక్కడం లేదు. అందుబాటులో ఉన్న పెద్దలందరినీ పంపి సముదాయిస్తున్నారట. ఈ సందర్భంగా ఒక ఆఫర్‌ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. దానికి ఆయన ఒప్పుకొంటారా? ఇంతకీ ఎవరా నాయకుడు? ఏంటా ఆఫర్‌?

బీజేపీ పెద్దలు ఆఫర్‌ ఇచ్చారట

మాజీ మంత్రి ఇ. పెద్దిరెడ్డి బీజేపీని వీడి టీఆర్‌ఎస్‌లో చేరతారనే ప్రచారం జరుగుతోంది. ఆయన్ని కాషాయ శిబిరంలోనే ఉంచాలని కమలనాథులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. బండి సంజయ్‌ మొదలుకొని.. సీనియర్లుగా గుర్తింపు పొందిన బీజేపీ నాయకులు.. మోస్ట్‌ సీనియర్లు పెద్దిరెడ్డితో మాట్లాడుతున్నారు. వాస్తవానికి మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ బీజేపీలో చేరిక ఆయనకు రుచించడం లేదు. అందుకే పెద్దిరెడ్డి చెంతకు ఒక ఆఫర్ తీసుకెళ్లారట బీజేపీ నాయకులు. దానిపైనే ఇప్పుడు చర్చ జరుగుతోంది.

బీజేపీలో ఉండబోరని.. టీఆర్‌ఎస్‌లో చేరతారని ప్రచారం!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీలో ఓ వెలుగు వెలిగిన పెద్దిరెడ్డి.. మంత్రిగా పనిచేశారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత బీజేపీలో రాజకీయ భవిష్యత్‌ను వెతికే పనిలో పడ్డారు. హుజురాబాద్‌లో పాగా వేయాలని అనుకున్నారు. కానీ.. ఈటల రాకతో పరిస్థితులు మారిపోయాయి. ఒకప్పుడు ప్రత్యర్థులుగా తలపడిన ఈటల, పెద్దిరెడ్డిలు ఒకే పార్టీలో ఉన్నారు. అసంతృప్తితో ఉన్న పెద్దిరెడ్డితో చాలామంది బీజేపీ నాయకులు మాట్లాడారు. ఇదే సమయంలో ఆయన్ని ఆకర్షించేందుకు టీఆర్‌ఎస్‌ నాయకులు ప్రయత్నాలు ప్రారంభించారు. టీఆర్‌ఎస్ కండువా కప్పుకొనేందుకు పెద్దిరెడ్డి ఒప్పేసుకున్నారని.. మంచి ముహూర్తం చూసుకుని బీజేపీని వీడి కారెక్కేస్తారని ప్రచారం జరుగుతోంది.

పెద్దిరెడ్డితో మాట్లాడిన మాజీ గవర్నర్‌ విద్యాసాగర్‌రావు?
హుజురాబాద్‌ వదిలేసి హుస్నాబాద్‌ చూసుకోవాలని చెప్పారా?

హుజురాబాద్‌ ఎన్నికల వేళ పెద్దిరెడ్డి పార్టీని వీడటం మంచిది కాదని అనుకున్నారో ఏమో.. బీజేపీ సీనియర్‌ నేత, మాజీ గవర్నర్‌ విద్యాసాగర్‌రావు లైన్‌లోకి వచ్చారు. పెద్దిరెడ్డితో విద్యాసాగర్‌రావు మాట్లాడినట్టు తెలుస్తోంది. బీజేపీని వీడొద్దని విద్యాసాగర్‌రావు సూచించారట. పైగా.. బీజేపీలో నీకేం కావాలో అడుగు.. అందులో అర్థం ఉంది. ఇప్పుడు హుజురాబాద్‌లో పట్టు లేదు కదా.. అక్కడ ఎందుకు పట్టుబట్టడం.. నీకు బలం ఉన్న ప్రాంతాలు హుస్నాబాద్‌లో ఉన్నాయి. ఆ నియోజకవర్గం చూసుకోవాలని పెద్దిరెడ్డికి సలహా ఇచ్చారట విద్యాసాగర్‌రావు.

Read Also : స్టోరీస్ ఎండ్… లవ్ స్టోరీస్ డోన్ట్..!!

బీజేపీ ఆఫర్‌ పెద్దిరెడ్డికి నచ్చిందా?

మాజీ మంత్రి పెద్దిరెడ్డికి ఈ ఆఫర్‌ నచ్చిందో లేదో కానీ.. ఆయన మాత్రం ఎక్కడా బయట పడటం లేదు. ఎవరెంతగా బుజ్జగించినా.. పెద్దిరెడ్డి టీఆర్‌ఎస్‌ గూటికి వెళ్లడం ఖాయయని అనుకుంటున్నారట. అయితే ఈ విషయంలో బీజేపీ నేతల లెక్కలు వేరే ఉన్నాయట. పెద్దిరెడ్డి కాషాయ శిబిరం వీడి వెళ్లరని చాలా విశ్వాసంతో చెబుతున్నారు. కానీ.. రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేం. ఉదయం మంచిగా మాట్లాడినవారే.. సాయంత్రం వేరే శిబిరంలో చేరి గొంతు సవరించుకున్న ఉదంతాలు చాలా ఉన్నాయి. మరి.. పెద్దిరెడ్డి ఆ కోవలోకే చేరతారో లేక హుజురాబాద్‌ను వదులుకొని హుస్నాబాద్‌ను ఎంచుకుంటారో చూడాలి.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-